Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఇదే మా కథ

By:  Tupaki Desk   |   2 Oct 2021 9:48 AM GMT
మూవీ రివ్యూ : ఇదే మా కథ
X
చిత్రం : ‘ఇదే మా కథ’


నటీనటులు: శ్రీకాంత్-భూమిక-సుమంత్ అశ్విన్-తన్య హోప్-సప్తగిరి-భద్రమ్-పృథ్వీ-సుబ్బరాజు తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
మాటలు: మీరాక్
నిర్మాత: జి.మహేష్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గురు పవన్

సీనియర్ హీరో శ్రీకాంత్.. యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ కలిసి నటించిన సినిమా ‘ఇదే మా కథ’. రోడ్ ట్రిప్ నేపథ్యంలో కొత్త దర్శకుడు గురు పవన్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తన చిన్ననాటి స్నేహితురాలికి తన ప్రేమను చెప్పడానికి సిద్ధ పడ్డ నడి వయస్కుడైన మహేంద్ర (శ్రీకాంత్).. తండ్రి కలను నెరవేర్చడానికి భర్త మాట కాదని ఇంటి గడప దాటిన లక్ష్మి (భూమిక).. తన కలలకు అడ్డం పడుతున్న తండ్రిని ఎదిరించి ఇల్లు వదిలి వచ్చేసిన యూట్యూబర్ అజయ్ (సుమంత్ అశ్విన్).. ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో అతడి పెళ్లి చెడగొట్టి తనకు దూరంగా వచ్చేసిన మేఘన (తన్య హోప్).. ఈ నలుగురూ బైకుల మీద వేర్వేరుగా రోడ్ ట్రిప్ మొదలుపెడతారు. మధ్యలో ఒకరితో ఒకరికి పరిచయమై కలిసి ప్రయాణం సాగిస్తారు. ఐతే మధ్యలో ఈ నలుగురికీ వేర్వేరుగా పెద్ద సమస్యలు ఎదురవుతాయి. మరి వాటిని తట్టుకుని తమ ప్రయాణాన్ని ఎలా ముందుకు సాగించారు.. తమ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారు.. చివరికి వీళ్ల జీవితాలు ఏ మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

హాలీవుడ్లో రోడ్ ట్రిప్ మూవీస్ బాగా పాపులర్. ఈ జానర్లో ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి. బాలీవుడ్లో కూడా ‘జిందగీ నా మిలేగా దోబారా’ అనే కల్ట్ మూవీతో పాటు మరికొన్ని చిత్రాలు వచ్చాయి ఈ తరహాలో. ఐతే తెలుగులో మాత్రం ఈ జానర్లో పెద్దగా సినిమాలు రాలేదు. గమ్యం కొంత వరకు ఈ తరహాలోనే సాగుతుంది. మహి.వి.రాఘవ్ ‘పాఠశాల’ అనే పూర్తి స్థాయి రోడ్ ట్రిప్ మూవీ తీశాడు. అది మంచి సినిమానే అయినప్పటికీ.. సరైన ప్రచారం లేక ప్రేక్షకులకు చేరువ కాలేదు. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఇప్పుడు ‘ఇదే మా కథ’ అంటూ ఫుల్ లెంగ్త్ రోడ్ ట్రిప్ మూవీని అందించాడు కొత్త దర్శకుడు గురు పవన్. ఐతే హాలీవుడ్డయినా.. బాలీవుడ్డయినా.. టాలీవుడ్డయినా.. రోడ్ ట్రిప్ మూవీని ప్రేక్షకులకు చేరువ చేయడం అందులో ఎమోషన్లు ఏమేర పండాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

ముందుగా ప్రధాన పాత్రలు ప్రేక్షకులు తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా ఉండాలి. వాటి తాలూకు ఎమోషన్లను ఫీలవ్వాలి. వాటి ప్రయాణం.. ఆ క్రమంలో వచ్చే పరివర్తన హృదయానికి హత్తుకునేలా ఉండాలి. అప్పుడు ఈ జానర్ సినిమాలు గుండెల్లో నిలిచిపోతాయి. కానీ ‘ఇదే మా కథ’లో ఇలాంటి లక్షణాలేమీ లేవు. చాలా సాధారణమైన పాత్రలు.. రొటీన్ గా అనిపించే వాటి నేపథ్యాలు.. చాలా మామూలుగా సాగిపోయే వాటి ప్రయాణం వల్ల ఈ పాత్రలను ఏ దశలోనూ ప్రేక్షకులు ఓన్ చేసుకోలేరు. సినిమాలో ఎక్కడా కూడా ఎమోషన్లు పండక ఒక మామూలు చిత్రంగా మిగిలిపోయింది ‘ఇదే మా కథ’.

‘ఇదే మా కథ’లో నలుగురు వ్యక్తులు వేర్వేరు కారణాలు.. సమస్యలతో రోడ్ ట్రిప్ కు రెడీ అవుతారు. వేర్వేరుగా ప్రయాణం మొదలుపెట్టే ఈ నలుగురూ అనుకోకుండా కలుస్తారు. ఆ తర్వాత వీరి ప్రయాణం ఉమ్మడిగా సాగుతుంది. ఈ క్రమంలో ఒక్కొక్కరి కథలను తెరలు తెరలుగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఐతే నాలుగు పాత్రలున్నపుడు.. అందులో నాలుగూ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా.. ఒకటో రెండో అయినా ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకునేలా ఉండాలి. అలా ఉంటే ఆ పాత్రలతో పాటు ప్రయాణం సాగిస్తాం.

వాటి ఎమోషన్లను ఫీలవుతాం. కానీ సరైన కసరత్తు లేకుండా చాలా సాధారణంగా ఈ పాత్రలను తీర్చిదిద్దడంతో వీటి ఇంట్రడక్షన్ దగ్గరే ఆసక్తి కోల్పోతాం. ఏ పాత్ర విషయంలోనూ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కలగదు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఒక సాధారణ గృహిణి.. రాయల్ ఎన్ ఫీల్డ్ లో 20 ఏళ్ల కిందట మెకానిక్ గా పని చేసిన తన తండ్రి అప్పట్లో కనిపెట్టిన కొత్త ఫార్ములాను పట్టుకుని ఇప్పుడు దాని మీద డెమో ఇవ్వడం కోసమని లద్దాఖ్ కు బైక్ మీద బయల్దేరిపోవడం.. అక్కడికెళ్లి కంపెనీ ప్రతినిధిని మెప్పించి రీసెర్చ్ టీంకు హెడ్ అయిపోవడం అన్నదే అంత లాజికల్ గా అనిపించదు. ఒక మహిళ సామర్థ్యాన్ని శంకించడం ఇక్కడ పాయింట్ కాదు. సినిమాలో దాన్ని కన్విన్సింగ్ గా చూపించడం కీలకం. భూమిక చేసిన ఈ పాత్రే కాదు.. మిగతా క్యారెక్టర్లను కూడా ఇంతే పేలవంగా తీర్చిదిద్దారు.

ప్రేమించిన వాడు మోసం చేశాడని.. అరడజను బీర్లు కొనుక్కొని కార్లో కూర్చుని ఒక్కోటి తాగుతూ వెళ్లి.. చివరి బీర్ ను పెళ్లి మంటపంలోనే తాగి ఆ బాటిల్ ను పెళ్లికొడుకు తల మీద కొట్టి పెళ్లి ఆపించే తన్య హోప్ పాత్ర ఇంట్రడక్షన్లోనే దిమ్మదిరిగిపోయేలా చేస్తుంది. ఈ అమ్మాయి ప్రేమించిన హీరో.. ఆమె లవర్ పెళ్లి చేసుకుంటున్న సంగతి తనే చెప్పి ఆమెతో తర్వాత ప్రేమ ప్రయాణం మొదలుపెడతాడు. ఇలాంటి జంట ప్రేమ ప్రయాణాన్ని ఎలా ఆస్వాదిస్తాం? ఇక పెద్ద ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ప్రయాణం సాగించే శ్రీకాంత్ పాత్ర వర్తమానంలో కొంత ఆసక్తికరంగా అనిపిస్తుంది కానీ.. దాని ఫ్లాష్ బ్యాక్ చూస్తే మాత్రం దాని మీదా ఆసక్తి కోల్పోతాం. మధ్య మధ్యలో అడ్వెంచర్లతో ప్రేక్షకులను థ్రిల్ చేయాలని.. ఎమోషనల్ సన్నివేశాలతో కదిలించాలని.. కామెడీతో నవ్వించాలని స్క్రిప్టులో మసాలా అంశాలు బాగానే పెట్టుకున్నారు కానీ.. ఏవీ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ముఖ్యంగా లద్దాఖ్ లో నదిలో చిక్కుకున్న బస్సు ప్రయాణికుల్ని కాపాడే ఒక సాహసోపేత సన్నివేశాన్ని చిత్రీకరించిన తీరైతే మరీ సిల్లీగా అనిపిస్తుంది.

దాన్ని డీల్ చేసిన విధానమే ఈ సినిమా స్థాయి ఏంటో చెప్పేస్తుంది. క్లైమాక్స్ లో ఉత్కంఠ కోసం చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. రోడ్ ట్రిప్ సినిమాల్లో ప్రయాణం సాగే కొద్దీ పాత్రల్లో ఒక పరివర్తన రావడం.. ప్రేక్షకులు ఎమోషనల్ గా కదిలించే ప్రయత్నం జరగడం చూస్తుంటాం. ఇక్కడ డైలాగుల ద్వారా ఎమోషన్ తెప్పించే ప్రయత్నం జరిగింది తప్ప.. అది ప్రేక్షకులు ఫీలయ్యేలా లేదు. సినిమా మొత్తంలో కొత్తగా ఉందనిపించే సన్నివేశం ఒక్కటీ లేదు. పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల ఈ ప్రయాణం ఆద్యంతం భారంగా అనిపిస్తుంది. చివరగా ఎలాంటి అనుభూతి లేకుండా థియేటర్ల నుంచి బయటికి వస్తాం.

నటీనటులు:

ఆర్టిస్టుల్లో శ్రీకాంత్ అందరిలోకి మెరుగ్గా కనిపించాడు. తన అనుభవాన్ని చూపిస్తూ హడావుడి లేకుండా తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. పాత్రను సరిగా తీర్చిదిద్దకపోయినా శ్రీకాంత్ మాత్రం దానికి కొంత ప్రత్యేకతను చేకూర్చాడు. సుమంత్ అశ్విన్ చేసిన అజయ్ పాత్ర చాలా వరకు చికాకు పెడుతుంది. యూట్యూబర్ అనేసరికి విచిత్రమైన హెయిర్ స్టైల్ తో డిఫరెంట్ గా కనిపించాలని చూశాడు కానీ.. అతడి ఆహార్యం.. నటన చిరాగ్గా అనిపిస్తాయి. భూమిక మరీ డల్లుగా కనిపించింది. నటన ఓకే. సుమంత్ కు జోడీగా నటించిన తన్య హోప్.. అతడికి తగ్గట్లే కనిపించింది. తన పాత్ర కూడా ఆకట్టుకోదు. సప్తగిరి.. పృథ్వీ.. జబర్దస్త్ రామ్ ప్రసాద్.. కామెడీ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. అతిథి పాత్రలో సుబ్బరాజు ఓకే అనిపించాడు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గానూ ‘ఇదే మా కథ’ చాలా వీక్ గా కనిపిస్తుంది. సునీల్ కశ్యప్ పాటల్లో ఒక్కటీ వినసొంపుగా లేవు. కథకు కీలకమైన ఎమోషనల్ సాంగ్ కూడా అంతగా ఆకట్టుకోదు. నేపథ్య సంగీతం కూడా మామూలుగా అనిపిస్తుంది. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం పాత శైలిలో సాగింది. రోడ్ ట్రిప్ నేపథ్యంలో సినిమా అంటే మంచి విజువల్స్ ఆశిస్తాం కానీ.. ఇందులో అలాంటి ఆకర్షణలేమీ లేవు. నిర్మాణ విలువలు పర్వాలేదు. చిన్న స్థాయి సినిమా అయినా ఓ మోస్తరుగానే ఖర్చు పెట్టారు. డైలాగ్స్ కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ గురు పవన్ విషయానికి వస్తే.. అతను రైటింగ్ దగ్గరే తేలిపోయాడు. ప్రధాన పాత్రలను చాలా సాధారణంగా తీర్చిదిద్దడం.. కథ విషయంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం మైనస్ అయ్యాయి. ఇక దర్శకుడిగానూ అతనేమీ మెరుపులు చూపించలేదు.

చివరగా: ఇదే మా కథ.. ఎమోషన్ లెస్ స్టోరీ

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre