Begin typing your search above and press return to search.

చిరూ డాన్సుకి మణిశర్మ బీట్ తోడైతే బ్లాక్ బస్టరే!

By:  Tupaki Desk   |   14 Oct 2021 11:30 AM GMT
చిరూ డాన్సుకి మణిశర్మ బీట్ తోడైతే బ్లాక్ బస్టరే!
X
తెలుగు పాటకు పడుచుదనాన్ని తీసుకొచ్చిన సంగీత దర్శకులలో మణిశర్మ ఒకరు. పాటకు పరిమళాన్నీ .. పరవశాన్ని తీసుకొచ్చిన సంగీత దర్శకుడు ఆయన. ఆయన పాటలతో సినిమాలకు భారీతనం వస్తుంది .. ఆ పాటలు ఆ సినిమాలను వీలైనంత వరకూ విజయాల దిశగా తీసుకెళతాయి. ఇళయరాజా .. రాజ్ - కోటి .. కీరవాణిలోని ప్రత్యేకతలు సంతరించుకున్నవారిగా మణిశర్మ కనిపిస్తారు. మెలోడీలు ఎంత అద్భుతంగా ట్యూన్ చేస్తారో .. ఫాస్టుబీట్లకు అంతగా పదును పెడతారు. ఇక జానపద సొగసులతో కూడిన పాటలు, ఖవ్వాలి పాటలు చేయడంలోను ఆయన సిద్ధహస్తులు.

అందువల్లనే చిరంజీవి .. బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాలకు ఆయన పనిచేయాలని కోరుకుంటారు. ముఖ్యంగా చిరంజీవి పాటల పరంగా తన అభిమానులకు ఏం కావాలనేది మణిశర్మకి బాగా తెలుసని భావిస్తారు. అందువల్లనే చిరంజీవి వరుస సినిమాలకి మణిశర్మ పనిచేశారు. తొలిసారిగా 'బావగారూ బాగున్నారా' సినిమాతో చిరంజీవి సినిమాకి మణిశర్మ పనిచేశారు. ఈ సినిమాను చూసినవారు, ఇది ఒక పాటల పండుగ అనేసి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి వరుసగా ఆయన చిరంజీవి సినిమాలకు బాణీలు కడుతూ బహుదూరమే ప్రయాణం చేశారు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో 10 సినిమాలవరకూ వస్తే, వాటిలో చాలా సినిమాలు కథాకథనాల పరంగానే కాకుండా, మ్యూజిక్ పరంగా కూడా ఎక్కువ మార్కులు కొట్టేశాయి. వాటిలో 'చూడాలని వుంది' .. 'ఇంద్ర' .. 'ఠాగూర్' .. 'స్టాలిన్' సినిమాలు మ్యుజికల్ గా కూడా ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించాయి. 'స్టాలిన్' తరువాత అనుకోకుండానే చిరంజీవి సినిమాలతో మణిశర్మకి గ్యాప్ వచ్చేసింది. అలా 15 ఏళ్లకి పైగా ఆయన చిరంజీవి సినిమాలు చేయకపోవడం ఆశ్చర్యకరం. అయితే కొన్నాళ్లపాటు మణిశర్మ జోరు తగ్గడం .. చిరంజీవి సినిమాలు చేయని కాలం ఈ గ్యాపులోనివే.

తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ .. తమన్ ధాటిని తట్టుకోవడం మణిశర్మకి కాస్త కష్టమే అయింది. అలాంటప్పుడు ఆయన ట్రెండ్ మారిపోయిందని డీలాపడిపోలేదు. సరైన అవకాశం వస్తే కొత్త ట్రెండ్ ను సెట్ చేయాలనే పట్టుదలతోనే వెయిట్ చేశారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తానేమిటనేది చూపించారు. ఆ సినిమా విజయంలో సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. అప్పటి నుంచి ఆయన కెరియర్ మళ్లీ పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాకి పనిచేసే అవకాశాన్ని కూడా అందుకోగలిగారు.

కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందింది. చిరంజీవి - కాజల్ ఒక జంటగా, చరణ్ - పూజ హెగ్డే ఒక జంటగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా నుంచి వదిలిన 'లాహే లాహే' సాంగ్ జనంలోకి దూసుకుపోయింది. మొదటి నుంచి కూడా ఇలా ఒక ఉత్సవం .. జాతర .. సందర్భాల్లో వచ్చే పాటలను చేయడంలో మణశర్మ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తుంటారు. కోలాటం పాటలు .. భజన పాటలను కూడా ఆయన వినసొంపుగా నడిపిస్తారు. చాలా గ్యాప్ తరువాత కలిసిన ఈ కాంబినేషన్ తో, 'ఆచార్య' కూడా మ్యూజికల్ హిట్ గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.