Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: 'రంగ‌స్థ‌లం' స్ఫూర్తితోనే తీశాడా?

By:  Tupaki Desk   |   18 Oct 2022 1:30 AM GMT
ట్రెండీ టాక్‌: రంగ‌స్థ‌లం స్ఫూర్తితోనే తీశాడా?
X
రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమా ఏది? అంటే... ఆర్.ఆర్.ఆర్ కంటే ముందే వ‌చ్చిన 'రంగ‌స్థ‌లం' గురించే అభిమానులు ప్ర‌స్థావిస్తారు. ఆ చిత్రంలో చ‌ర‌ణ్ న‌ట‌న అసమానం. చెవులు వినిపించ‌ని బ‌ధిరుడిగా ప‌ల్లెటూరి మాస్ చిట్టిబాబుగా అత‌డి న‌ట‌న‌కు గొప్ప ప్ర‌శంస‌లు కురిసాయి. నిజంగానే ప‌ల్లెటూరి మాస్ కుర్రాడు అంటే ఇలానే ఉంటాడు! అన్నంత‌గా లీన‌మై చ‌ర‌ణ్ న‌టించాడు. ఈ చిత్రంలో అన్న‌ద‌మ్ముల అనుబంధాన్ని కూడా సుకుమార్ అంతే నేచురల్ గా చిత్రీక‌రించాడు. 1980 నేప‌థ్యంలో గోదారి బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని అద్భుతంగా తెర‌కెక్కించారు.

అయితే ఈ సినిమాని అప్ప‌ట్లో సైమ‌ల్టేనియ‌స్ గా అన్ని భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా ప్ర‌చారం చేసి అదే స్థాయిలో రిలీజ్ చేసి ఉంటే హిందీలోను హిట్ట‌య్యేదా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి మేక‌ర్స్ అప్ప‌టి ట్రెండ్ లో కేవ‌లం తెలుగు త‌మిళం వ‌ర‌కే ప‌రిమితం చేశారు. ఉత్త‌రాదిన రిలీజ్ చేయాల‌ని అనుకోక‌పోవ‌డం చ‌ర‌ణ్ కి మైన‌స్. నిజానికి జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఈ మూవీలో చ‌ర‌ణ్ న‌ట‌న హిందీ ఆడియెన్ కి కూడా న‌చ్చుతుంద‌న‌డంలో సందేహం లేదు.

అన్న‌ను చంపించిన ఊరి పెద్ద కుట్ర‌ను ఆల‌స్యంగా తెలుసుకుని త‌మ్ముడు చిట్టిబాబు ప్ర‌తీకారం తీర్చుకునే నేప‌థ్యంలో తెర‌కెక్కించిన బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ స్టోరి రంగ‌స్థ‌లం. గోదారి యాస భాష క్యారెక్ట‌ర్ల నేప‌థ్యంలో అద్భుత చిత్ర‌మిది. కానీ ఇప్పుడు దానికి రివ‌ర్సులో త‌మ్ముడిని చంపిన ఊరి పెద్ద గురించి ఆల‌స్యంగా తెలుసుకుని ప్ర‌తీకారం తీర్చుకునే నేటివ్ కుర్రాడిగా క‌న్న‌డ హీరో రిష‌బ్ శెట్టి 'కాంతార' సినిమాలో క‌నిపించాడు. ఈ మూవీకి స్ఫూర్తి రంగ‌స్థ‌లం అని అర్థ‌మ‌వుతుంది సినిమా చూస్తున్నంత సేపూ! క‌న్న‌డ‌ మూవీని పాన్ ఇండియా కేట‌గిరీలో ప్ర‌చారం చేసి రిలీజ్ చేయ‌డంతో అన్ని భాష‌ల్లోను చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఇది కూడా 80ల నేపథ్యంలో క‌థాంశ‌మే.

అయితే క‌న్న‌డ నాట సంస్కృతి ఆచారాల నేప‌థ్యం అడ‌వి బ్యాక్ డ్రాప్ సినిమాకి పెద్ద ప్ల‌స్ అయ్యింది. రెండు సినిమాల‌కు కామ‌న్ గా థీమ్ లైన్ ఒక‌టే. ఊరి పెద్ద వెన్నుపోటు హ‌త్య‌. దానికి సోద‌రుడి ప్ర‌తీకారం.. చాలా సింపుల్ లైన్ తో వ‌చ్చినా క‌ల్చ‌ర్ ని అందంగా చూపించ‌డంలో రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌కుడిగా హీరోగా స‌క్సెస‌య్యాడు. ఇందులో థ్రిల్ల‌ర్ ఎలిమెంట్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకున్నాడ‌ని చెప్పాలి. నిజానికి కాంతారాతో పోలిస్తే రంగ‌స్థ‌లం స్క్రీన్ ప్లే ప‌రంగా టాప్ క్లాస్ లో గ్రిప్పింగ్ గా ఉంటుంది. కానీ ఈ సినిమాని హిందీలోకి ఆలస్యంగా అనువ‌దించి రిలీజ్ చేయ‌డం మైన‌స్ అయ్యింది. కాంతార మూవీకి ఐఎండిబిలో 9.4 రేటింగ్ ఇవ్వ‌గా... రంగ‌స్థ‌లం కి 8.2 రేటింగ్ ఉంది.

ప్ర‌స్తుత ట్రెండ్ లో హిందీ ఆడియెన్ లో సౌత్ సినిమా హ‌వా సాగుతోంది. ఈ ట్రెండ్ లో యూనివ‌ర్శ‌ల్ కంటెంట్ ని ఎంపిక చేసుకుంటే హీరో ఎవ‌రు? అనేదానితో సంబంధం లేకుండా విజ‌యం సాధించేందుకు ఆస్కారం ఉంది. ఇటీవ‌ల నిఖిల్ కార్తికేయ 2 ఉత్త‌రాదినా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత కాంతారా హిందీలోనూ బాగా ఆడుతోంద‌ని టాక్ ఉంది.

ఇక‌పై టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల‌కు పాన్ ఇండియా కేట‌గిరీలో స‌రైన ప్ర‌చారం ముఖ్యం. పాన్ ఇండియా క‌థాంశాల‌ను ఎంపిక చేసుకోవ‌డంలో కూడా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌ఫ‌లం కావాల్సి ఉంది. ఈ ఊపును ఎన్ క్యాష్ చేసుకునేందుకు మునుముందు టాలీవుడ్ హీరోలు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎవ‌రి ప్ర‌ణాళిక‌ల్లో వాళ్లు ఉన్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.