Begin typing your search above and press return to search.

థియేటర్లు ఈసారి ఓపెన్ అయితే.. ఆ లెక్కనేనట

By:  Tupaki Desk   |   6 July 2021 8:30 AM GMT
థియేటర్లు ఈసారి ఓపెన్ అయితే.. ఆ లెక్కనేనట
X
కరోనా జోరు తగ్గింది. కేసుల నమోదులోనూ మార్పులు వచ్చేశాయి. రెండు నెలల క్రితం మహమ్మారి దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అయిన రెండు తెలుగురాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ప్రభుత్వాలు సైతం తాము విధించిన పరిమితుల్ని వెనక్కి తీసుకుంటున్నాయి. సాధారణ పరిస్థితుల్ని నెలకొనేలా చేస్తున్నాయి.అన్ని వర్గాల ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో అనుమతులు ఇచ్చేసింది. అయినప్పటికీ థియేటర్లు ఓపెన్ కాలేదు.

ఎందుకిలా? అంటే.. ఏపీలో థియేటర్లు ఓపెన్ కాకుండా.. తెలంగాణలో మాత్రమే తెరిస్తే ప్రయోజనం ఏముంటుందన్నది ప్రశ్న. నిజమే.. తెలుగు సినిమాకు ఆయువుపట్టు ఆంధ్రానే. కలెక్షన్లలో సింహభాగం ఏపీ నుంచే వస్తాయి. అలాంటప్పుడు అంత పెద్ద ఆదాయవనరును ఏ వ్యాపారవేత్త కూడా వదులుకోడు కదా? అందులోకి పెద్ద హీరోల సినిమాలు అంటే.. అంచనాలు భారీగా ఉంటాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్లను ఓపెన్ చేసుకోవటానికి అనుమతులు ఇచ్చింది. మరి.. థియేటర్లు ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో రెండు వారాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. కాకుంటే ఆగస్టు రెండో వారం నుంచి కరోనా థర్డ్ వేవ్ మొదలువుతుందన్న అంచనా తెలుగు సినిమా పరిశ్రమను కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ నెలలో థియేటర్లు ఓపెన్ చేసినా.. సరిగ్గా మరో నెల..నెలన్నరకు మూయాల్సి రావటం అంటే అదో తిప్పలు. అందుకే.. స్వల్ప వ్యవధిలో మళ్లీ పరిమితులు విధించే వీలుంటే.. థర్డ్ వేవ్ తర్వాతే థియేటర్లు ఓపెన్ అవుతాయని చెబుతున్నారు.

మొదటి వేవ్ తర్వాత రెండో వేవ్ కు మధ్యన థియేటర్లను ఓపెన్ చేయటం.. మొదట 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కొంతకాలం థియేటర్లను నిర్వహించారు. తాజాగా అలా థియేటర్లు ఓపెన్ చేయటం అంటే.. సాధ్యం కాదన్నది సినీ పెద్దల మాటగా చెబుతున్నారు. 50 శాతం సీటింగ్ పరిమితి ఉంటే కలెక్షన్లు పెద్దగా ఉండవని.. అలాంటి వేళలో పెద్ద హీరోల సినిమాలు విడుదల కావని తేలుస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకుంటే.. పెద్ద మజా ఉండదు. ఇలాంటివెన్నో అంశాలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యే విషయంలో కీలకమవుతాయని భావిస్తున్నారు. మరేం జరగుతుందో చూడాలి.