Begin typing your search above and press return to search.

డెల్టా ముందు వ్యాక్సిన్ ద‌మ్ము చాల‌ట్లేద‌ట‌.. వైద్యుల ప్ర‌క‌ట‌న‌!

By:  Tupaki Desk   |   7 July 2021 1:30 AM GMT
డెల్టా ముందు వ్యాక్సిన్ ద‌మ్ము చాల‌ట్లేద‌ట‌.. వైద్యుల ప్ర‌క‌ట‌న‌!
X
చైనాలో వెలుగు చూసినప్ప‌టి కొవిడ్-19కు.. ఇప్పుడు ప్ర‌పంచంలో మ‌నుగ‌డ‌లో క‌రోనాకు అస‌లు సంబంధ‌మే లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వైర‌స్ ఎన్ని ర‌కాలుగా రూపాంత‌రం చెందిందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే.. ఇందులో ప‌లు వేరియంట్లు ప్ర‌మాద‌క‌రంగా, అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మార‌డం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఈ వేరియంట్ల‌లో.. బ్రెజిల్ లో వెలుగుచూసిన (P.1), సౌతాఫ్రికాలో గుర్తించిన‌ (B.1.351), బ్రిట‌న్ లో రూపాంత‌రం చెందిన‌(B.1.1.7)తోపాటు భార‌త్ లో వెలుగు చూసిన (B.1.617) వేరియంట్లు ప్ర‌మాద‌క‌రంగా మారాయి. అయితే.. వీట‌న్నింటిలో భార‌త్ లో గుర్తించిన B.1.617 వేరియంట్ ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించిన అన్ని ర‌కాల మ్యుటెంట్ల క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని నిపుణులు నిర్ధారించారు.

అయితే.. ఇందులోనూ మ‌రో మూడు ర‌కాలు వెలుగులోకి వ‌చ్చాయి. అవి.. B.1.617.1, B.1.617.2, B.1.617.3గా ఉన్నాయి. అయితే.. ఇందులో B.1.617.2 ర‌కం చాలా బ‌లంగా ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణులు చెబుతున్నారు. భార‌త్ లో సెకండ్ వేవ్ ఈ స్థాయిలో విజృంభించ‌డానికి కూడా ఈ వేరియంటే కార‌ణ‌మ‌ని భావిస్తోంది. భార‌త్ లో దాదాపు 12 వేల‌కు పైగా వేరియంట్స్ ను గుర్తించ‌గా.. ఇవే అత్యంత ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన‌ట్టు నిపుణులు నిర్ధారించారు.

అయితే.. ఇప్పుడు డెల్టా ప్ల‌స్‌ వేరియంట్ ద‌డ పుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేరియంట్ వ్యాక్సిన్ల‌కు సైతం లొంగే అవ‌కాశాలు త‌క్కువేన‌ని నిపుణులు సందేహించారు. అయితే.. ఇది నిజ‌మేన‌ని అంటున్నారు ఢిల్లీలోని గంగారామ్ ఆసుప‌త్రి వైద్యులు. తాము చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని తెలిపారు. డెల్టా వేరియంట్ ను వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోలేక‌పోతోంద‌ని చెప్పారు.

అదేవిధంగా క‌రోనా వైర‌స్ బారిన ప‌డి, కోలుకున్న వారిలో ఉత్ప‌త్తి అయిన యాంటీ బాడీలు కూడా డెల్టాను ధీటుగా ఎదుర్కోలేక‌పోతున్నాయ‌ని గుర్తించారు. ఈ కార‌ణంగానే.. ఒక‌సారి కొవిడ్ బారిన ప‌డిన‌వారు.. రెండోసారి కూడా వైర‌స్ బారిన ప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. ఇక‌, ఈ వేరియంట్ వ‌చ్చిన వారిలో శ్వాస వ్య‌వ‌స్థ తీవ్రంగా ఇన్ఫెక్ట్ అవుతోంద‌ని కూడా ఢిల్లీ వైద్యులు తెలిపారు.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ పై అంచ‌నాలు గంద‌ర‌గోళంగా ఉన్న నేప‌థ్యంలో.. ఈ త‌ర‌హా రిపోర్టును ఢిల్లీ వైద్యులు వెల్ల‌డించ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే. ఇప్ప‌టికే.. సెకండ్ వేవ్ దేశంపై ఏ స్థాయిలో ప్ర‌భావం చూపిందో తెలిసిందే. గ‌రిష్టంగా నిత్యం 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. రోజూవారి మ‌ర‌ణాలు కూడా 4 వేలు దాటిపోయాయి. దీంతో.. దేశం అన్నివిధాలుగా న‌ష్ట‌పోయింది. ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోగా.. ఆర్థికంగా చితికిపోయారు.

ఇంత‌టి భ‌యోత్పాతాన్ని సృష్టించిన క‌రోనా మ‌హ‌మ్మారి.. ఇప్పుడిప్పుడే అదుపులోకి వ‌స్తోంది. ఇంకా ప‌లు రాష్ట్రాల్లో కేసులున‌మోదు అవుతున్న‌ప్ప‌టికీ.. తీవ్ర‌త మాత్రం చాలా వ‌ర‌కు త‌గ్గింది. ప్ర‌స్తుతం దేశంలో రోజూవారి కేసుల సంఖ్య 40 వేల ద‌గ్గ‌ర న‌మోద‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. థ‌ర్డ్ వేవ్ రాబోతోంద‌ని హెచ్చ‌రికలు వినిపిస్తున్న త‌రుణంలో.. డెల్టా ప్ల‌స్ పై వ్యాక్సిన్ కూడా ప్ర‌భావం చూప‌లేక‌పోతోంద‌న్న వార్త‌.. ఖ‌చ్చితంగా ఆందోళ‌న పెంచేదే. ఈ నేప‌థ్యంలో.. అంద‌రూ ముందుజాగ్ర‌త్త‌లు పాటించి, మ‌హ‌మ్మారిని నిరోధించ‌డ‌మే చేయాల్సి ఉంది.

జూలై సెకండ్ వీక్ నుంచి క‌రోనా థ‌ర్డ్ వేవ్ పెరిగే ఛాన్స్ ఉంద‌ని తాజాగా.. ఎస్‌బీఐ స‌ర్వే నివేదిక కూడా వెల్ల‌డించింది. ఇది ఆగ‌స్టు నాటికి వేగం పుంజుకుంటుంద‌ని, ఆగ‌స్టు 12 త‌రువాత కేసుల సంఖ్య‌లో మ‌రింత వేగం పెరుగుతుంద‌ని తెలిపింది. ఆ నెల పూర్త‌యిన త‌ర్వాత సెప్టెంబ‌ర్ నాటికి గ‌రిష్ఠ స్థితికి చేరుకుంటుందని ఎస్బీఐ రిపోర్టు వెల్ల‌డించింది. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.