Begin typing your search above and press return to search.

RRR-KGF2 ని కొట్ట‌లేక‌పోతే వీళ్లు ఖ‌తం!

By:  Tupaki Desk   |   24 April 2022 3:30 AM GMT
RRR-KGF2 ని కొట్ట‌లేక‌పోతే వీళ్లు ఖ‌తం!
X
RRR వ‌చ్చి సంచ‌ల‌నాలు సృష్టించింది. KGF2 అంత‌కుమించి ఆడుతోంది. రెండు సౌత్ సినిమాలు బాలీవుడ్ ని ఢీకొట్టి అక్క‌డ హీరోల‌కు సాధ్యం కాని రికార్డుల్ని అందుకున్నాయి. ప్ర‌స్తుతం ఇది బాలీవుడ్ లో పెద్ద చర్చ‌కు తెర తీసింది. అస‌లు బాలీవుడ్ ని డిఫెన్స్ లో ప‌డేసిన స‌న్నివేశ‌మిద‌న్న చ‌ర్చ వేడెక్కిస్తోంది.

అయితే మ‌న హీరోల రికార్డుల్ని తిర‌గ‌రాసేందుకు ఇప్పుడు రేస్ లోకి వ‌స్తున్నారు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్... ఎన‌ర్జిటిక్ ల‌వ‌ర్ బోయ్ ర‌ణ‌బీర్ క‌పూర్.. ఇందులో ఎవరికి ఆ ఛాన్స్ వ‌స్తుంది? ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 రికార్డుల‌ను కొట్టేది ఎవ‌రు? అన్న చ‌ర్చా అగ్గి రాజేస్తోంది.

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా.. ర‌ణ‌బీర్ బ్రహ్మాస్త్ర .. అక్షయ్ కుమార్ యొక్క పృథ్వీరాజ్ .. ఇతర బాలీవుడ్ భారీ చిత్రాలు యష్ నటించిన KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడతాయా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

KGF చాప్టర్ 2 హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు హిందీ బాక్సాఫీస్ వద్ద 53.95 కోట్లు వసూలు చేసింది. హిందీ మార్కెట్ లో ఒక సినిమాకు ఇదే అత్యధిక ఓపెనింగ్స్. యశ్ నటించిన కేజీఎఫ్ 2 .. హృతిక్ వార్ చిత్రం ఓపెనింగుల‌ రికార్డును బద్దలు కొట్టింది. మొదటి రోజు వార్ కేవ‌లం 53.53 కోట్లు వ‌సూలు చేసింది. కానీ య‌ష్ కేజీఎఫ్ 2 కేవలం రెండు రోజుల్లోనే రూ. 100.74 కోట్లతో ఏడు రోజుల్లోనే 250 కోట్ల మార్కును రాబట్టింది. ఈ సంవత్సరం చాలా బాలీవుడ్ భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి బాక్సాఫీస్ వద్ద KGF 2ని ఏ చిత్రం బీట్ చేస్తుంది? అన్న చ‌ర్చ వేడెక్కించేస్తోంది.

అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ పీరియాడికల్ ఫిల్మ్. ప్రేక్షకులు పీరియాడికల్ డ్రామాలను చూడటానికి ఇష్టపడతారు. ఇందులో అక్షయ్ ఉన్నారు కాబట్టి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద KGF 2ని బీట్ చేయగలదా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

అమీర్ ఖాన్ చిత్రం ఎల్లప్పుడూ బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ ల‌తో అద‌ర‌గొట్టేస్తుంది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మిన‌హా అమీర్ గత కొన్ని విడుదలలు బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి విజయాన్ని సాధించాయి. లాల్ సింగ్ చ‌ద్దాలో తెలుగు హీరో అక్కినేని నాగ‌చైత‌న్య కూడా న‌టించారు. అమీర్ మూవీ కాబట్టి లాల్ సింగ్ చద్దా KGF 2 రికార్డులను బ్రేక్ చేస్తుందా అన్న చ‌ర్చ సాగుతోంది.

వీట‌న్నిటినీ మించి భారీగా తెర‌కెక్కింది బ్రహ్మాస్త్రా. ఈ మూవీకి ప్రీ-రిలీజ్ బజ్ గొప్పగా లేదు కానీ అలియా భట్ - రణబీర్ కపూర్ వివాహం తో బ్ర‌హ్మాస్త్ర టైటిల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. నూతన వధూవరులను పెద్ద తెరపై చూసేందుకు సినీ ప్రేక్షకులు ఉత్సుకత చూపుతున్నారు. కానీ రికార్డులు ఏ రేంజులో ఉంటాయ‌న్న‌ది స‌స్పెన్స్. ఇందులో సౌత్ స్టార్ నాగార్జున కూడా న‌టించారు.

హృతిక్ రోషన్ చివరి రిలీజ్ 'వార్' బంపర్ ఓపెనింగ్స్‌తో రూ. 53 కోట్లు కొల్ల‌గొట్టింది.వార్ - KGF 2 మధ్య ఓపెనింగుల ప‌రంగా గ్యాప్ కేవలం కొన్ని లక్షలు మాత్రమే. కాబట్టి హృతిక్- సైఫ్ అలీ ఖాన్ నటించిన 'విక్రమ్ వేద' బాక్సాఫీస్ వద్ద KGF 2 రికార్డుల్ని బ్రేక్ చేస్తుందా అన్న చ‌ర్చ కూడా వేడెక్కిస్తోంది. అయితే అన్ని వేళ‌లా స‌న్నివేశాలు ఒకేలా ఉండ‌వు. ఇప్పుడు సీన్ అంతా మారింది.

బాలీవుడ్ హీరోల గొప్ప ఇప్పుడు చెల్లుబాటు కావ‌డం లేదు. సౌత్ నుంచి పోటీ స్టార్లు దూసుకొచ్చి గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నారు. ఉత్త‌రాదిని షేక్ చేయ‌డ‌మే ధ్యేయంగా మునుముందు కూడా దూసుకొస్తున్నారు. అందువ‌ల్ల ఈ పోటీలో ఎంత పెద్ద స్టార్లు అయినా ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే. అమీర్ - హృతిక్- అక్ష‌య్- ర‌ణ‌బీర్ ల‌ పైనా ఆ ఒత్తిడి ప‌ని చేస్తోంద‌న‌డంలో సందేహం లేదు. మునుముందు ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.