Begin typing your search above and press return to search.

కన్నడ సీమలో RRR టికెట్ రేట్లు ఎంతో తెలిస్తే షాకే..!

By:  Tupaki Desk   |   26 March 2022 10:30 AM GMT
కన్నడ సీమలో RRR టికెట్ రేట్లు ఎంతో తెలిస్తే షాకే..!
X
'బాహుబలి' తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ''ఆర్‌.ఆర్‌.ఆర్‌'' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదలైంది.

రాజమౌళి క్రేజ్ కు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా తోడవడంతో RRR సినిమా అన్ని ఏరియాలలో ఎక్కువ రేట్లకు అమ్ముడైంది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు పెంచుకోవడానికి అవకాశం ఉండటంతో అధిక రేట్లకు టికెట్లను విక్రయించారు.

కర్ణాటకలో సైతం RRR టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో టికెట్ మీద రూ. 250 నుంచి రూ. 800 వరకు వసూలు చేశారని తెలుస్తోంది. అయితే కన్నడ సినిమాలకు ఇంత ఎక్కువ టికెట్‌ ధరలు ఎప్పుడూ లేవు.

మాములుగా మల్టీప్లెక్స్ లలోనే ఈ విధమైన భారీ టికెట్‌ ధరలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు సింగిల్‌ స్క్రీన్ థియేటర్లలో కూడా అధిక రేట్లు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కర్ణాటకలో టికెట్‌ ధర రూ. 200 కు మించి ఉండకూడదని కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో సినిమాకు ఒక్కోలా రేట్లు ఉంటున్నాయి. అయితే RRR చిత్రానికి మరీ ఎక్కువగా రేట్లు పెట్టడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణ రోజుల్లో కంటే 'ఆర్.ఆర్.ఆర్' టికెట్ ధరలు ఎక్కువగా వుండటం పై కన్నడ సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇంత మొత్తంలో ఖర్చు పెట్టి చూడడం సామాన్యుడికి భారంగా మారుతోందని వాపోతున్నారు.

ఇకపోతే కర్ణాటకలో RRR తొలి రోజు రూ. 16.04 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 'జేమ్స్' సినిమాను థియేటర్లలో నుంచి తీసేస్తున్నారంటూ 'బాయ్ కాట్ RRR' అంటూ కన్నడిగులు పెద్ద ఎత్తున నెగెటివ్ ప్రచారం చేసినా జక్కన్న మూవీ ఈ రేంజ్ వసూళ్ళు అందుకోవడం విశేషం.

కాగా, చరిత్రలో ఎన్నడూ కలవని అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థీమ్ తో జక్కన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇందులో తారక్ - చరణ్ కు తమ పాత్రల్లో జీవించారు.

అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. RRR సినిమా వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే నాడు రూ. 248 కోట్లు రాబట్టినట్లు సమాచారం.