Begin typing your search above and press return to search.

ఆ ప‌దాలు రాస్తే సిద్ శ్రీరామ్ కి నాలుక తిర‌గ‌దా?

By:  Tupaki Desk   |   25 Aug 2022 4:31 AM GMT
ఆ ప‌దాలు రాస్తే సిద్ శ్రీరామ్ కి నాలుక తిర‌గ‌దా?
X
ప‌ర‌భాషా గాయ‌కుల‌తో పాడించేప్పుడు వారి ప‌దోచ్ఛార‌ణలో లోపాల్ని స‌రిదిద్దాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? అంటే అది క‌చ్ఛితంగా ఆ పాట‌ను రాసిన లిరిస్టు లేదా సంగీతం అందించిన సంగీత‌జ్ఞుడిదే అవుతుంది. క‌నీసం ఆ పాట విన్న త‌ర్వాత ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అయినా దానిపై కొంత దృష్టి సారిస్తే బావుంటుంది. ఎక్క‌డైనా ఉచ్ఛార‌ణ ప‌రంగా గ్ర‌మటిక‌ల్ త‌ప్పిదాలు జ‌రిగితే క‌నీసం గుర్తించి స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తే అది అభాసుపాలు కాదు.

త‌మిళ గాయ‌కుడు సింగర్ సిద్ శ్రీరామ్ టాలీవుడ్ లో ఎన్నో చార్ట్ బ‌స్టర్ పాట‌ల‌ను ఆల‌పించాడు. అవ‌న్నీ అన్ని వ‌ర్గాల శ్రోత‌ల‌ను ఉర్రూత‌లూగించాయి. అయితే సిద్ పాడిన పాటల్లో లోపాలు లేవా? అంటే ఉచ్ఛార‌ణ ప‌రంగా చాలా లోటు పాట్లు ఉన్నాయ‌ని ఒక తెలుగు పండిట్ గుర్తించ‌డం .. ఆ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా స్ట్రెస్ చేసి అత‌డు ఒక వీడియోని రూపొందించి విడుద‌ల చేయ‌డంతో అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి సిద్ శ్రీ‌రామ్ స్వ‌ర‌మాయాజాలంలో ప‌డిపోయి ఆడియెన్ ఆ త‌ప్పిదాల‌ను ప‌ట్టించుకోలేదు కానీ తెలుగు భాషా అభిమానుల‌కు ఆ ప‌దాలు విన్న‌ప్పుడ‌ల్లా ఏదో క్లారిటీ మిస్స‌య్యింది అన్న భావ‌న క‌లుగుతూనే ఉంటుంది. అలాంటి ఓ రెండు ఉచ్ఛార‌ణ లోపాల గురించి ఎంతో చ‌క్క‌గా వివ‌రించిన ఈ వీడియో ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

పెద్ద బడ్జెట్ చిన్న బ‌డ్జెట్ అనే విభేధం లేకుండా సిద్ శ్రీ‌రామ్ తో ఒక పాట అయినా పాడించేందుకు చాలా మంది చిన్న నిర్మాత‌లు ఉవ్విళ్లూరుతున్నారు. నిరంత‌రం సిద్ త‌న గానాలాప‌న మాయాజాలంలో అంద‌రినీ ఓలలూగిస్తూనే ఉన్నాడు. అత‌డి పాట‌తో చార్ట్ బ‌స్ట‌ర్ కొట్టి త‌మ సినిమా మార్కెట్ ని పెంచుకునే వ్యూహాన్ని కూడా అనుస‌రిస్తున్నారు. దానికోసం అత‌డికి భారీగానే చెల్లిస్తున్నారు. కానీ అతని పాటలు సంగీత ప్రియులను సాహితీకారుల‌ను అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. తప్పుడు ప‌దోచ్ఛారణను గుర్తించ‌డం సాహితీకారుల‌కు బాధ‌ను క‌లిగించే అంశ‌మే అవుతోంది.

అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలోని సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ఎంత పెద్ద చార్ట్ బ‌స్ట‌ర్ అయ్యిందో తెలిసిందే. ఆ పాట ప్ర‌పంచ‌వ్యాప్తంగా జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది అంటే అది సిద్ శ్రీ‌రామ్ స్వ‌ర‌మాయాజాలం వ‌ల్ల‌నే. అయినప్పటికీ ఇది లిరికల్ ఉచ్ఛారణ ప‌రంగా కొన్ని లోపాలను కలిగి ఉంది. ఈ పాటలో చాలా పదాలు సరిగ్గా ఉచ్ఛరించలేదు. ఇంకా చాలా పాటల్లో సిద్ ఉచ్చారణ లోపాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో సిద్ శ్రీరామ్ ఉచ్చారణ పై వ్యంగ్యాస్త్రం క‌నిపిస్తోంది.

వీడియోలోని వ్యక్తి తప్పులు పాడుతున్నప్పుడు ఆ లోపాన్ని గీత రచయితలు ఎందుకు సరిదిద్దలేకపోయారని ఆశ్చర్యం వ్య‌క్తం చేశారు. సిద్ శ్రీ‌రామ్ ప‌ల‌క‌లేని కొన్ని పదాలను క‌చ్ఛితంగా రాయొద్ద‌ని గీత రచయితల‌ను ఆ పండిట్ కోరాడు. సాహిత్యాభిరుచి ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ అత‌డి సూచ‌న‌ల‌ను అర్థం చేసుకుని ప్ర‌శంసిస్తున్నారు.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న స‌హా ఎన్నో పాట‌లు ఆల‌పించిన ప‌ర‌భాషా గాయ‌ని శ్రేయా ఘోష‌ల్ పాట‌లోని ప‌దాల‌ను కిల్ చేయ‌కుండా పాడే గొప్ప ప్ర‌తిభావ‌ని అని నిరూపించారు. అంత‌కుముందు కూడా చాలా మంది ప‌ర‌భాషా గాయ‌నీగాయ‌కులు ఉచ్ఛార‌ణా లోపాలు లేకుండా పాడ‌గ‌లిగారు. అదే విధంగా ఇత‌ర గాయ‌నీ గాయ‌కులు కూడా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. ముఖ్యంగా భాష మారినా కానీ ప‌దాల‌ను పూర్తిగా అర్థం చేసుకున్న త‌ర్వాతే పాడితే ఇలాంటి లోపాలు రిపీట్ కావు.