Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ తో జ‌త క‌లిసిన ఇళ‌య‌రాజా

By:  Tupaki Desk   |   26 May 2022 3:11 PM GMT
నెట్ ఫ్లిక్స్ తో జ‌త క‌లిసిన ఇళ‌య‌రాజా
X
క‌రోనా కార‌ణంగా ప్రేక్ష‌కుల‌లో ఎక్కువ శాతం మంది ఓటీటీల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు స‌రికొత్త వెబ్ సిరీస్‌ల‌తో వీవ‌ర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇదే త‌ర‌హాలో ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ తాజాగా సూప‌ర్ హిట్ వెబ్ డ్రామా `స్ట్రేంజ‌ర్ థింగ్స్‌` స‌రికొత్త సీజ‌న్ ని స్ట్రీమింగ్ చేయ‌బోతోంది. ఇంత వ‌ర‌కు వ‌చ్చిన సీరీస్ ల‌న్నీ సూప‌ర్ స‌క్సెస్ కావ‌డంతో ఫోర్త్ సీజ‌న్ అంటే చివ‌రి సీజ‌న్ ని శుక్ర‌వారం నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కాబోతోంది.

`స్ట్రేంజ‌ర్ థింగ్స్‌` కు ఇండియాతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులున్నారు. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని చివ‌రి సీజ‌న్ ని స‌రికొత్త‌గా నెట్ ఫ్లిక్స్ అందించ‌బోతోంది. అంతే కాకుండా ఈ సీజ‌న్ తో భార‌తీయ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే క్ర‌మంలో ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజాతో జ‌త‌క‌ట్టింది. గ‌త కొంత కాలంగా ఇండియాలో వీవ‌ర్స్ ని పెంచుకోవాల‌ని అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న నెట్ ఫ్లిక్స్ తాజా వెబ్ సిరీస్ కోసం ఇళ‌య‌రాజాతో జ‌త‌క‌ట్ట‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సంగీత దిగ్గ‌జం ఇళ‌య‌రాజా నెట్ ఫ్లిక్స్ లో శుక్ర‌వారం నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కానున్న `స్ట్రేంజ‌ర్ థింగ్స్‌` ఇండియ‌న్ వెర్ష‌న్ కు సంగీతాన్ని అందించాడు. మ్యూజిక్ వీడియోని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఇళ‌యారాజా శాస్త్రీయ వాయిద్యాల‌ను చేర్చ‌డం ద్వారా థీమ్ సంగీతానికి భార‌తీయ సంప్ర‌దాయిక ట్విస్ట్ ఇచ్చారు. ఇళ‌యారాజా అందించిన సంగీతం వెంటాడేలా వుంది.

ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ సంగీత స్వ‌ర‌క‌ర్త‌ల‌లో ఇళ‌య‌రాజా ప్ర‌త్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయ‌న‌ని అలా ఎందుకు పిలుస్తారో తాజాగా నెట్ ఫ్లిక్స్ `స్ట్రేంజ‌ర్ థింగ్స్‌` కు అందించిన సంగీతంతో మ‌రోసారి రుజువు చేసి అద‌ర‌గొట్టారు. తాజాగా విడుద‌ల చేసిన మ్యూజిక్ వీడియో చూసిన ఇళ‌య‌రాజా అభిమానులు అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ వీడియోని వైర‌ల్ చేయ‌మ‌ని నెట్ ఫ్లిక్స్ ని రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.