Begin typing your search above and press return to search.

ఇళ‌య‌రాజాపై చ‌ర్య‌ల‌కు ఆదేశాలు జారీ

By:  Tupaki Desk   |   10 May 2018 6:44 AM GMT
ఇళ‌య‌రాజాపై చ‌ర్య‌ల‌కు ఆదేశాలు జారీ
X
ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా చిక్కుల్లో ప‌డ్డారు. తాజాగా ఆయ‌న చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆయ‌న‌కు త‌ల‌నొప్పులు తెచ్చి పెట్ట‌ట‌మే కాదు.. కేసుల చిక్కుల్లో చిక్కుకునేలా చేశాయి. ఇటీవ‌ల ఒక సంగీత కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న త‌న ప్ర‌సంగంలో భాగంగా చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.

ఎప్పుడూ లేని రీతిలో ఏసుక్రీస్తు మీద ఇళ‌య‌రాజా వ్యాఖ్య‌లు ప‌లువురికి విస్మ‌యానికి గురి చేశాయి. మ‌నోభావాలు దెబ్బ తినేలా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లుగా ప‌లువురు మండిప‌డుతున్నారు. తాను పాల్గొన్న కార్య‌క్ర‌మానికి ఏ మాత్రం సంబంధం లేనప్ప‌టికీ హ‌టాత్తుగా ఏసుక్రీస్తు పున‌రుత్థానంపై వ్యాఖ్య‌లు చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది.

ఏసుక్రీస్తు మ‌ర‌ణించిన త‌ర్వాత తిరిగి లేచాడ‌నే విశ్వాసం క్రైస్తువుల్లో ఉంద‌ని.. అయితే అది వాస్త‌వం కాదంటూ ప‌రిశోధ‌న‌లు జ‌రిపి యూట్యూబ్‌లో పెట్టనున్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన ఒక డాక్యుమెంట‌రీని ఆయ‌న ప్ర‌ద‌ర్శించారు. ఇక్క‌డితో ఆగ‌ని ఆయ‌న‌.. వాస్త‌వంగా మ‌ర‌ణించి తిరిగి లేవ‌టం ర‌మ‌ణ మ‌హ‌ర్షికే సాధ్య‌మ‌ని వ్యాఖ్యానించారు.

ఇళ‌య‌రాజా వ్యాఖ్య‌లు క్రైస్త‌వ సంఘాల వారికి ఆగ్ర‌హాన్ని క‌లిగించాయి. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా ఇళ‌య‌రాజా వ్యాఖ్య‌ల‌పై క్రైస్త‌వ సంఘాలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఆయ‌న‌పై చెన్నై క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు.

తాము ఏసుక్రీస్తు పున‌రుత్థానాన్ని న‌మ్ముతున్నామ‌ని.. త‌మ న‌మ్మ‌కాన్ని దెబ్బ తీసేలా ఇళ‌య‌రాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని.. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు. ఇదే స‌మ‌యంలో లాయ‌ర్ దినేశ్‌.. చెన్నై పోలీస్ క‌మిష‌న‌ర్‌.. చెన్నై జిల్లాక‌లెక్ట‌ర్ పోలీసు క‌మిష‌న‌ర్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన వారు ఇళ‌య‌రాజాపై చ‌ర్య‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు. మ‌రి.. దీనిపై ఇళ‌య‌రాజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.