Begin typing your search above and press return to search.

ఇళయరాజా పాటలు ఏమవుతాయి?

By:  Tupaki Desk   |   21 March 2017 8:37 AM GMT
ఇళయరాజా పాటలు ఏమవుతాయి?
X
తన పాటల్ని వాడుకుంటే రాయల్టీ చెల్లించాల్సిందే అంటూ తేల్చి చెబుతూ.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగల్ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం సౌత్ ఇండియన్ మ్యూజిక్ లవర్స్ పెద్ద చర్చకే దారితీసింది. దీనిపై ఎవరి యాంగిల్లో మవాళ్లు మాట్లాడుతున్నారు. ఐతే మెజారిటీ జనాలు అభిప్రాయపడుతున్నదేంటంటే.. బాలు విషయంలో ఇళయరాజా లీగల్ నోటీసుల దాకా వెళ్లి ఉండాల్సింది కాదని. లీగల్ నోటీసులపై బాలు స్పందనను బట్టి ఇళయరాజా తీరుతో ఆయన చాలా బాధపడ్డ విషయం అందరికీ అర్థమైంది. ఇప్పుడు మెజారిటీ జనాలు ఆయన వైపే ఉన్నారు. తాను సంగీతం సమకూర్చిన పాటను వాడుకుంటున్నపుడు రాయల్టీ చెల్లించాలన్నది నిబంధనల ప్రకారం సమంజసమే కానీ.. బాలుతో ఆయన ఇలా వ్యవహరించి ఉండాల్సింది కాదన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇళయరాజా రాయల్టీ విషయంలో ఇంతకుముందే తన వైఖరిని స్పష్టం చేశాడు. తమిళ ఎఫ్ఎం స్టేషన్లన్నింటికీ నోటీసులిచ్చాడు. తనకు రాయల్టీ ఇవ్వకుండా తన పాటను వాడుకోవడానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పాడు. ఐతే ఇళయరాజా పాట వాడుకోనేల.. రాయల్టీ ఇవ్వనేల అని తమిళ ఎఫ్ ఎం స్టేషన్లన్నీ కూడా ఆయన పాటను ఆపేశాయి. ఇళయరాజా పాటల్ని సీడీలు వేసి అమ్మేవాళ్లు కూడా సైలెంటైపోయారు. తాజా పరిణామాలతో ఇక ఏ మ్యూజికల్ షోలోనూ ఇళయరాజా పాటను వాడుకునే సాహసాలు చేయకపోవచ్చు. ఆర్కెస్ట్రాల వాళ్లు కూడా ఇళయరాజా పాటల విషయంలో భయపడుతున్నారు. రేప్పొద్దున ‘పాడుతా తీయగా’ లాంటి కార్యక్రమాల్లో కూడా ఇళయరాజా పాటలు వినిపించకపోయినా ఆశ్చర్యం లేదు. పాటలు వాడుకుని రాయల్టీ చెల్లించడానికి చాలామంది ఆసక్తి చూపించకపోవచ్చు. మనదగ్గర ఈ రాయల్టీ లాంటి వ్యవహారాలు నడవవు. కాబట్టి మున్ముందు ఇళయరాజా పాటలు బయటెక్కడా వినిపించకపోవచ్చు. అభిరుచి ఉన్న వాళ్లు వాళ్లంతట వాళ్లు ఇళయరాజా పాటల్ని వినుకోవాలే తప్ప.. బయటెక్కడా ఆయన పాట ప్లే కాకపోవచ్చు. కాబట్టి ఇళయరాజాకు రాయల్టీ రావడం మాటేమో కానీ.. ఆయన పాటకు ఉన్న ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయి.. భవిష్యత్ తరాలకు ఆయన పాట విలువేంటో తెలియకుండా పోయే ప్రమాదమూ లేకపోలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/