Begin typing your search above and press return to search.

మా లో ఆయన అతిథి... ?

By:  Tupaki Desk   |   19 Oct 2021 5:03 AM GMT
మా లో ఆయన అతిథి... ?
X
మా ఎన్నికలు ఈసారి టాలీవుడ్ లో అతి పెద్ద చిచ్చునే రగిల్చాయి. ఆ సంగతి ఎవరిని అడిగినా చెబుతారు. ఇక మా ఎన్నికలలో మంచు విష్ణు ప్యానల్ నెగ్గింది. పోటాపోటీగా నిలిచిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడింది. అయితే ఓటమిని ప్రకాష్ రాజ్ మొదట్లో హుందాగానే స్వీకరించారు. పోలింగ్ కేంద్రం వద్ద విష్ణుకు గ్రీట్ కూడా చేశారు. అయితే ఆ తరువాత రోజు నుంచే అసలు కధ మొదలైంది. మొదట మెగా బ్రదర్ నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకాష్ రాజ్ మా సభ్యత్వం వద్దు అనుకున్నారు. ఇక ఆ తరువాత ఆయన ప్యానల్ మెంబర్స్ కూడా రాజీనామా చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే తాను ఎవరి రాజీనామా ఆమోదించడంలేదని మా ప్రెసిడెంట్ విష్ణు తాజాగా చెప్పేశారు.

మరో వైపు ప్రకాష్ రాజ్ ప్యానల్ మూకుమ్మడి రాజీనామాల మీద సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. మా మెంబర్స్ ప్రేమతో ఎన్నుకుంటే రాజీనామాలు చేయడం ఏంటి అని కూడా చర్చ సాగుతోందిట. దాంతో విష్ణు సైతం రాజీనామాలు ఆమోదించరు అంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే రాజీనామాలు అన్నీ కూడా మీడియాలోనే కనిపిస్తున్నాయి తప్ప మా అసోషియేషన్ కి చేరలేదని అంటున్నారు. అంటే సినీ పెద్దలు జోక్యం చేసుకుంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ అంతా మళ్లీ కలసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే ప్రకాష్ రాజ్ మాత్రం తాను తగ్గేది లేదు అంటున్నారు. ఆయన మా ఎన్నికలు జరిగిన తీరు మీదనే ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన మొత్తం తతంగం అంతా రికార్డు అయిన సీసీ పుటేజ్ మీద ఆయన దృష్టి పెడుతున్నారు. కోర్టుకు వెళ్ళి అయినా దాన్ని తెచ్చుకుని ఆ మీదట మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ న్యాయ పోరాటానికి కూడా రెడీ అవుతారని అంటున్నారు. అయితే ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ యాగీ మీద కూడా సినీ పెద్దలు గుర్రుగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్. జరిగిందేదో జరిగిపోయింది. విష్ణు కొత్త ప్రెసిడెంట్. ఆయన పదవీ కాలం రెండేళ్ళే కదా. మళ్లీ గిర్రున కాలం తిరిగి ఎన్నికలు వస్తాయి.

ఈ మాత్రం దానికి రచ్చ చేసుకోవడం ఎందుకు అన్న భావన కూడా సినీ పెద్దలలో ఉంది అంటున్నారు. ఈ విషయంలో మెగాస్టార్ కూడా అందరినీ కలుపుకుని పోవాలనుకుంటున్నారు అంటున్నారు. అందుకే ఆయన మోహన్ బాబుకు ఫోన్ చేశారని, త్వరలో ఇద్దరు కలసి అన్ని విషయాలూ మాట్లాడుకుంటారని అంటున్నారు. మొత్తానికి విష్ణు మా ప్రెసిడెంట్ అన్న దాన్ని అంతా అంగీకరించి సామరస్యంగా ముందుకు అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం రాజీ ప్రసక్తే లేదు అన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. మరి ఆయన్ని ఎవరు తీసుకువచ్చి పోటీకి పెట్టారో, ఎవరు ఎన్నికల్లో సాయం చేయలేదో, ఇపుడు ఎవరు వెనక్కి తగ్గమంటున్నారో తెలియదు కానీ తాను పావుని అయ్యాయన్న ఆవేదన ఆయనలో ఉందని చెబుతున్నారు.

ఇప్పటికే అంతా జరిగింది. తమ ఇమేజ్ కూడా ఎంతో కొంత దెబ్బ తిన్నది, మళ్ళీ రెండేళ్ళ తరువాత ఎన్నికల్లో పోటీ అంటే తనకు చాన్స్ ఉంటుందో లేదో, అందుకే తాడో పేడో ఇపుడే తేల్చేసుకోవాలన్న పట్టుదల ఆయనలో ఉంది అంటున్నారు. అయితే ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చే వారు ఇపుడు ఎంతమంది అన్నదే ప్రశ్న. మెల్లగా ఆయన ప్యానల్ మెంబర్స్ కూడా దారికి వస్తే ఒంటరి పోరాటమే మిగులుతుంది అంటున్నారు. ఏది ఏమైనా మా ఎన్నికలు అనేక మలుపులు తిరిగి చివరికి ప్రకాష్ రాజు చెబుతున్నట్లుగానే ఆయన్ని అతిధి పాత్రలోనే ఉంచేసిందా అంటే పరిణామాలు అవును అనే అంటున్నాయి.