Begin typing your search above and press return to search.
చెన్నై బ్యూటీకి హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది
By: Tupaki Desk | 19 Jun 2018 10:21 AM ISTచెన్నై బ్యూటీ త్రిషా కృష్ణన్ ను.. ఐదారేళ్లుగా ఓ కేసు వెంటాడుతోంది. అదే.. ఆమె ఆదాయంపై ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నమోదు చేసిన కేసు. 2011-12 సమయంలో ఈ కేసు నమోదు కాగా.. తాజాగా ఈ కేసుపై తుది తీర్పును వెల్లడించింది మద్రాస్ హైకోర్టు.
2011-12లో తన ఆదాయం 89.69 లక్షల రూపాయలు అంటూ రిటర్నులు ఫైల్ చేసింది త్రిష. ఈమేరకు తను సంపాదించిన మొత్తంపై పన్నులు కూడా కట్టేసింది. అప్పుడేమీ సమస్య రాలేదు. ఆ తర్వాతి ఏడాది మాత్రం తన ఆదాయం 4.4 కోట్లకు పెరిగినట్లు చూపించింది ఈ చెన్నై భామ. ఐటీ డిపార్ట్ మెంట్ కు ఇక్కడే అనుమానం వచ్చింది. ఒకే ఏడాది ఐదు రెట్లు ఆదాయం పెరిగిపోవడంపై వాళ్లు తెగ అనుమానించేసి.. ఆమెకు నోటీసులు ఇవ్వడమే కాదు.. ఆదాయ వ్యవహారాలపై ఓ కన్నేసి కూడా ఉంచారు. పలు దర్యాప్తులు నిర్వహించి.. పన్ను ఎగవేసిందంటూ ఆమెపై 1.16 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించారు.
దీనిపై మద్రాస్ హైకోర్టులో కేసు నడవగా.. ఇప్పుడు తీర్పు త్రిషకు అనుకూలంగానే వచ్చింది. పన్ను చెల్లింపుదారు ఎలాంటి ఎగవేతలకు పాల్పడలేదని.. ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్టుల కోసం అడ్వాన్సులు అందుకున్న ఆమె.. అందుకు తగినట్లుగానే తన ఆదాయాన్ని లెక్కలలో చూపించిందని.. ఆమెకు జరిమానా కట్టాల్సిన అవసరం లేదంటూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. మద్రాస్ హైకోర్టు ఇచ్చి తీర్పు.. త్రిషకు చాలా ఊరట కలిగించే విషయమే. ఎందుకంటే.. ఈ కేసు కనుక ఆమెకు వ్యతిరేకంగా వచ్చి ఉంటే వడ్డీలతో కలిపి 2 కోట్ల వరకూ చెల్లించాల్సి రావడమే కాదు.. జైలు శిక్షకు ఆస్కారం ఉండేది.