Begin typing your search above and press return to search.

సుశాంత్ మృతి పై సిబిఐ చొరవ తీసుకోవాలి: కర్ణిసేన డిమాండ్స్

By:  Tupaki Desk   |   26 Jun 2020 12:10 PM GMT
సుశాంత్ మృతి పై సిబిఐ చొరవ తీసుకోవాలి: కర్ణిసేన డిమాండ్స్
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక దాగిన నిజాలను బయటికి రాబట్టాలనే డిమాండ్‌ దేశం మొత్తం కోరుతోంది. ఇప్పటికే బీహార్.. రాజస్థాన్ రాష్ట్రాలలో భారీ ఎత్తున నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటికి సుశాంత్ మరణ వార్తను తట్టుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన శ్రీ రాజ్‌పుత్ కర్నిసేన అలియాస కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమెది బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక #IndiaDemandsCBIForSSR అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ఈ డిమాండ్స్ విషయంలో అందరూ కలిసిరావాలని కర్ణిసేన కోరుతోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. "యువ హీరో మరణం వెనుక ఖాన్ కుటుంబాల హస్తం ఉంది. ఈ కేసులో వారి నిజస్వరూపాన్ని బయటకు తీసుకురావాలంటే సీబీఐ దర్యాప్తు చేయాల్సిందే. దేశంలోని అన్ని పార్టీల నేతలను కలిసి ప్రభుత్వానికి విన్నపాలను సమర్పించాలని కోరుతాను" అని ఆయన అన్నారు. నిజానికి సుశాంత్ మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

"అది ఆత్మహత్య కాదు హత్యే.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సుశాంత్ సింగ్‌కు న్యాయం జరిగేంత వరకు అఖండ జ్యోతిని వెలిగిస్తాం. 100 రోజులపాటు దీపాన్ని వెలిగించి న్యాయం కోసం పోరాడుతాం. 100 రోజుల తర్వాత కూడా ప్రభుత్వాలు స్పందించకపోతే జాతీయ రహదారులను అడ్డుకొంటాం.." అని సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. సుశాంత్ కి న్యాయం జరగాలంటే సిబిఐ కంపల్సరీ చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.