Begin typing your search above and press return to search.

'ఇండియ‌న్ - 2' లో అస‌లు ట్విస్ట్ ఇదే...!

By:  Tupaki Desk   |   24 April 2020 5:46 AM GMT
ఇండియ‌న్ - 2 లో అస‌లు ట్విస్ట్ ఇదే...!
X
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ - లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో 'ఇండియన్ 2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సుభాష్‌ కరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు'కు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. కానీ ఏ ముహూర్తాన సినిమాని మొదలుపెట్టారో ఏమో కాని సినిమాకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. షూటింగ్ సమయంలో హీరో కమల్ కి కాలుకి దెబ్బ తగలడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది.. ఆ తర్వాత షూటింగ్‌ లొకేషన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఆ ప్రమాదం నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునేలోపు కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయింది. ఇప్ప‌టికే ఇలా చాలా బ్యాడ్ సెంటిమెంట్లు ఇండియ‌న్ 2 చుట్టూ అల్లుకున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు 'ఇండియ‌న్ 2' లాక్ డౌన్ త‌రువాత స్టార్ట్ అవుతుందో లేదో తెలియ‌ని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్న లైకా వారికి కూడా వరుసగా పెద్ద పెద్ద డిజాస్ట‌ర్లు పడుతున్నాయి. దీంతో ఆ ప్ర‌భావం ఇండియ‌న్ 2 మీద కూడా ప‌డ‌నుంది. ఇది ప‌క్క‌న పెడితే ఇప్పుడు తాజాగా సమాచారం ప్ర‌కారం ఈ సినిమాలో క‌మ‌ల్ డ్యూయ‌ర్ రోల్ చేస్తున్నారట. విల‌న్ అండ్ హీరో పాత్రల్లో కమల్ కనిపించబోతున్నాడట. అలానే క‌మ‌ల్ ఈ సినిమాలో సోలో హీరో కాదట.. క‌మ‌ల్ తో పాటు మ‌రో హీరోగా ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహాను తీసుకున్నారట. ఈ విష‌యంలోనే ప్ర‌స్తుతం నిర్మాత‌ల‌కి శంక‌ర్ మ‌ధ్య కాస్త తేడాలు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. బాబీ సింహాని ప్రాజెక్ట్ నుంచి తప్పించి మూవీ బడ్జెట్ తగ్గించాలని శంక‌ర్ కి నిర్మాత‌లు సూచిస్తున్నార‌ట‌. కాల్షీట్స్ ప్ర‌కారం ప‌నిచేసే బాబీ సింహాకు ఇప్ప‌టికే 6 కోట్లు దాకా ఇచ్చార‌ట‌. అయితే అనుకోని అవాంతరాలు వ‌చ్చి ప‌డుతుండటతో బాబీ డేట్స్ ఇంకా కావాల్సి ఉంద‌ని.. ఈ లెక్క‌న చూస్తే మ‌నోడికి ఇంకో 4 కోట్లు వ‌రుకు ఇవ్వాల‌ని.. ఈ ఖ‌ర్చుని త‌గ్గించాల‌ని నిర్మాత‌లు శంక‌ర్ ని కోరుతున్న‌ట్లుగా స‌మాచారం. ఇన్ని ట్విస్టులను.. అవాంతరాలను తట్టుకొని 'ఇండియన్ 2' బయటకి వస్తుందేమో చూడాలి.