Begin typing your search above and press return to search.

ఆస్కార్‌ ని ముద్దాడిన ఇండియన్స్ వీళ్లే

By:  Tupaki Desk   |   8 March 2023 7:00 AM GMT
ఆస్కార్‌ ని ముద్దాడిన ఇండియన్స్ వీళ్లే
X
సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మార్చి 12వ తారీకున వైభవంగా జరగబోతుంది. అమెరికా లాస్ ఏంజిల్స్ లో జరగబోతున్న ఈ మెగా ఈవెంట్‌ వైపు యావత్‌ భారత జాతి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. అందుకు కారణం నాటు నాటు పాట ఆస్కార్‌ నామినేషన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు కచ్చితంగా ఆస్కార్ దక్కించుకుంటుందనే నమ్మకంను అంతా కలిగి ఉన్నారు.

ఇప్పటి వరకు ఇండియాకు చెందిన అయిదు మంది ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆస్కార్‌ అవార్డులను ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత 55వ ఆస్కార్ వేడుకల్లో గాంధీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన భాను అథైయా అవార్డును సొంతం చేసుకున్నారు. 1982 లో భాను అథైయా ఇండియా కు మొదటి ఆస్కార్ ను తెచ్చి పెట్టారు. గాంధీ సినిమా కు భాను అథైయా తో పాటు ఇంగ్లాండ్ కు చెందిన జాన్ మొల్లో కూడా కాస్ట్యూమ్‌ డిజైనర్ గా వ్యవహరించారు. ఇద్దరు సంయుక్తంగా ఆ ఏడాది ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆస్కార్ ను సొంతం చేసుకున్నారు.

భారత సినీ దిగ్గజం సత్యజిత్‌ రే ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఆయన కేవలం దర్శకత్వం పైనే కాకుండా అనేక విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అందుకే ఆయనకు 1992 లో అకాడమీ ఆఫ్ మోషన్‌ పిక్చర్స్ ఆర్ట్స్‌ అండ్ సైన్సెస్‌ గౌరవ పురస్కారంను సొంతం చేసుకున్నారు. అనారోగ్య కారణంగా కోల్‌ కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యజిత్‌ రే కు ఆస్కార్‌ అవార్డు దక్కింది. ఆ విభాగంలో ఇండియా తరపున అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి సత్యజిత్‌ రే.

2009 సంవత్సరంలో జరిగిన 81వ ఆస్కార్‌ వేడుకల్లో ముగ్గురు భారతీయులు ఆస్కార్‌ ను ముద్దాడారు. అది కూడా స్లమ్‌ డాగ్ మిలీయనియర్‌ సినిమాకే ముగ్గురు అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. బెస్ట్ సౌండ్ మిక్సింగ్‌ కేటగిరీలో కేరళకు చెందిన రసూల్ ఆస్కార్ ను అందుకున్నాడు. జయహో పాటకు సాహిత్యాన్ని అందించిన గుల్జార్ ఆస్కార్‌ అవార్డు ను సొంతం చేసుకున్నారు.

స్లమ్ డాగ్‌ మిలియనీర్‌ సినిమాలోని జయహో పాటకు గాను బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ మరియు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను ఏఆర్‌ రెహమాన్ అందుకున్నాడు. ఒకే ఏడాది రెండు ఆస్కార్ లను అందుకున్న ఇండియన్‌ గా కూడా రెహమాన్‌ రికార్డు సాధించాడు. ఈసారి నాటు నాటు పాటకు కీరవాణి టీం అవార్డును సొంతం చేసుకుంటుందేమో చూడాలి. ఈ జాబితా లో ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు కూడా చేరాలని ప్రతి ఒక్క ఇండియన్ కోరుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.