Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘ఇంద్రసేన’

By:  Tupaki Desk   |   30 Nov 2017 1:41 PM GMT
మూవీ రివ్యూ: ‘ఇంద్రసేన’
X
చిత్రం :‘ఇంద్రసేన’

నటీనటులు: విజయ్ ఆంటోనీ - డయానా చంపిక - మహిమ - కాళి వెంకట్ - రాధారవి తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఛాయాగ్రహణం: దిల్ రాజ్
నిర్మాత: నీలం కృష్ణారెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీనివాసన్

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఐతే ఆ తర్వాత వచ్చిన విజయ్ రెండు సినిమాలూ నిరాశ పరిచాయి. ఇప్పుడతను ‘ఇంద్రసేన’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఇంద్రసేన-రుద్రసేన (రెండు పాత్రల్లోనూ విజయ్ ఆంటోనీనే) కవల సోదరులు. ఇంద్రసేన తన కుటుంబ వారసత్వంగా వచ్చిన బట్టల షాపు చూసుకుంటుంటే.. రుద్రసేన స్కూల్లో పీటీ మాస్టరుగా ఉంటాడు. ఐతే ఇంద్రసేన తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోవడంతో విషాదంలో మునిగిపోతాడు. తాగుడుకు బానిస అవుతాడు. మరోవైపు రుద్రసేన మాత్రం చక్కగా ఉద్యోగం చేసుకుంటూ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. తన వల్ల కుటుంబం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి ఇంద్రసేన మారుదామని అనుకుంటున్న సమయంలో అతడి వల్ల ఓ ప్రాణం పోతుంది. అతను జైలుకెళ్తాడు. అక్కడి నుంచి బయటికొచ్చేసరికి అతడి కుటుంబం పరిస్థితి తల్లకిందులై ఉంటుంది. అప్పుడు కుటుంబం కోసం ఇంద్రసేన ఏం చేశాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన ‘బేతాళుడు’ మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు తెలుగు ప్రేక్షకులు. కానీ అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత ‘యమన్’కు వచ్చేసరికి అంచనాలు తగ్గాయి. అయినా ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ‘ఇంద్రసేన’ సినిమాను మరింత తక్కువ అంచనాలతో చూసినా.. అసలు అంచనాలే లేకుండా చూసినా నిరాశ తప్పదు. కథల ఎంపికలో విజయ్ ఆంటోనీ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా.. దాన్ని ‘ఇంద్రసేన’ పోగొట్టేస్తుంది. ఇది ఒక దశా దిశా లేని.. ఒక పర్పస్ అంటూ లేని సినిమా.

ఇంద్రసేన సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఎమ్మెల్యేకు అనుచరుడైన పెద్ద గూండాని హీరో చంపేస్తాడు. అతడిని ఎలా మట్టుబెట్టాలా అని పోలీసుతో చర్చిస్తుంటాడు ఎమ్మెల్యే. చంపింది గూండాని కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోలేకపోతున్నామని.. పోలీస్ అయితే ఈపాటికి ఎన్ కౌంటర్ చేసేసేవాళ్లమని అంటాడు పోలీస్. అంతే.. ఎమ్మెల్యే పోలీసుని చంపేస్తాడు. ఆ తర్వాత ఆ పోలీసు శవం వద్ద ఒక హాకీ స్టిక్ పడేస్తాడు. ఎందుకయ్యా అంటే.. పూర్వాశ్రమంలో.. ఎప్పుడో ఏడెనిమిదేళ్ల కిందట హీరో పీఈటీగా పని చేశాడు కాబట్టి హాకీ స్టిక్ అక్కడుంటే హీరోనే చంపేశాడని పోలీసులు నమ్మేస్తారట. హీరోను ఎన్ కౌంటర్ చేసేస్తారట. ఈ సీన్ చూశాక మనం 2017లో ఉన్నామా..? లేక 1987లో ఉన్నామా అని సందేహం కలుగుతుంది. ఈ సీన్ మాత్రమే కాదు.. మొత్తంగా ‘ఇంద్రసేన’ సినిమా చూస్తున్నంతసేపూ మనం 20-30 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లే భావిస్తాం. అంత ఔట్ డేటెడ్ సినిమా ఇది.

దర్శకుడు శ్రీనివాసన్ ఆసక్తికరంగా ట్రైలర్ తీర్చిదిద్దడంలో చూపించిన శ్రద్ధ.. సినిమాను రూపొందించడంలో చూపించలేదు. అసలు ఈ సినిమాను విజయ్ ఆంటోనీతో పాటు రాధికా శరత్ కుమార్ కూడా ఎలా ఓకే చేశారు.. సినిమా తీస్తున్నపుడు కూడా వారికేమీ అనిపించలేదా అన్న సందేహం ఆద్యంతం మనసును తొలిచేస్తూనే ఉంటుంది. ఈ సీన్ తర్వాత ఏమైనా ఉంటుందేమో.. అని ఆరంభం నుంచి చివరి దాకా చూస్తూనే ఉంటాం. కానీ ఆ నిరీక్షణతోనే సినిమా ముగింపుకు వచ్చేస్తుంది. ఓవైపు బ్రదర్ సెంటిమెంట్.. మరోవైపు మదర్ సెంటిమెంట్ దట్టిస్తూ.. విరామం లేకుండా హీరోతో ఫైట్లు చేయిస్తూ.. ఆద్యంతం అసహనానికి గురి చేస్తూ సాగుతుంది ‘ఇంద్రసేన’.

ఊరికే బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారా ఏదో జరిగిపోతున్నట్లు భ్రమ కల్పించడమే తప్ప.. ‘ఇంద్రసేన’లో ఆసక్తి రేకెత్తించే ఏ మలుపూ కనిపించదు. డ్రామాని తలపించే కథాకథనాలతో.. ఒక ప్రయోజనం లేకుండా సాగిపోతుందీ సినిమా. ఒక్క క్యారెక్టర్ని కూడా సరిగా తీర్చిదిద్దని దర్శకుడు.. ఏ రెండు పాత్రల మధ్య రిలేషన్ కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. లవ్ స్టోరీ తేలిపోయింది. ఇంతకుముందు కథతో పాటు సాగిపోయే పాత్రలు చేసిన విజయ్ ఆంటోనీ.. తొలిసారి మాస్ హీరోలా ఫైట్లు చేశాడు. అవి అతడికి సూటవ్వలేదు. సినిమా అంతటా అరవ వాసనలు కొట్టడం మరో ప్రతికూలత. ఓవరాల్ గా చెప్పాలంటే ‘ఇంద్రసేన’ విషయం లేని కథాకథనాలతో ఆద్యంతం విసిగించే ఒక వ్యర్థ ప్రయత్నం.

నటీనటులు:

విజయ్ ఆంటోనీ బేసిగ్గా అంత మంచి నటుడేమీ కాదు. అతడి ముఖంలో హావభావాలు పలకవు. కానీ మంచి కథలు.. పాత్రలు ఎంచుకోవడంతో అతను జనాలకు నచ్చాడు. కానీ ఇందులో కథ.. పాత్ర రెండూ తేలిపోయాయి. దీంతో అతనూ తేలిపోయాడు. ద్విపాత్రాభినయం చేసిన అతను రెండు పాత్రల్లో ఏమాత్రం వైవిధ్యం చూపించలేకపోయాడు. హీరోయిన్లు డయానా చంపిక.. మహిమల గురించి చెప్పుకోవడానికేమీ లేదు. విలన్ పాత్రలు చేసిన వాళ్లూ అంతంత మాత్రమే. నటీనటులెవ్వరూ ఏ ప్రత్యేకతా చూపించలేకపోయారు.

సాంకేతికవర్గం:

విజయ్ ఆంటోనీ సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం వరకు తన ప్రత్యేకత చూపించాడు. పాటలు తమిళ వాసనలు కొడతాయి. దిల్ రాజ్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు శ్రీనివాసన్ ఏ రకంగాననూ మెప్పించలేకపోయాడు. అతను ఎంచుకున్న కథలో కానీ.. స్క్రీన్ ప్లేలో కానీ ఏ విశేషం లేదు. పాతికేళ్ల కిందటి స్టయిల్లో సినిమాను నడిపించాడు.

చివరగా: ఈ ‘ఇంద్రసేన’తో జాగ్రత్త సుమీ!

రేటింగ్- 1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre