Begin typing your search above and press return to search.

థియేటర్స్ ఉన్నవారే ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారా...?

By:  Tupaki Desk   |   10 Jun 2020 1:30 PM GMT
థియేటర్స్ ఉన్నవారే ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారా...?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపైన.. టాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపైన.. ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి పలు విషయాలపై చర్చించడానికి టాలీవుడ్ సినీ ప్రముఖుల బృందం సీఎంతో సమావేశమయ్యారు. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వంతో చర్చలు జరిపిన సినీ పెద్దలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో కూడా చర్చించారు. ఈ సమావేశానికి టాలీవుడ్ తరపున స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, పీవీపీ, డైరెక్టర్ రాజమౌళి తదితరులు హాజరయ్యారు. జగన్ తో భేటీ అనంతరం చిరంజీవి మీడియా ముఖంగా చర్చకు వచ్చిన అంశాలను వివరించారు. చిరు మాట్లాడుతూ.. ప్రభుత్వం మేము అడిగిన అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించి తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌ లో అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పిన మాట మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ కరెంటు బిల్లులకు సంబంధించి మినిమమ్ ఛార్జెస్ ఎత్తివేతకు అంగీకరించారని వెల్లడించారు.

అయితే ఏపీ సీఎంతో సినీ పెద్దల మీటింగ్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరిని కలుపుకొని పోకుండా కేవలం థియేటర్స్ చేతిలో ఉన్నవారు మాత్రమే వెళ్లారని వారు విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీలో థియేటర్స్ అన్నీ దాదాపు ఇప్పుడు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్న వారి చేతిలో ఉన్నాయని.. అందుకే సినిమా థియేటర్స్ కరెంటు బిల్లులకు సంబంధించి మినిమమ్ ఛార్జెస్ ఎత్తివేయాలనే డిమాండ్ ప్రధానంగా సీఎం ముందు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం సమావేశాలు అని చెప్తూ తమ అభివృద్ధిని చూసుకుంటున్నారని నెటిజన్స్ అంటున్నారు. అందుకోసమే ఇండస్ట్రీ కొన్ని వర్గాలుగా చీలిపోయింది అని కామెంట్స్ వినిపిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా.. ఇండస్ట్రీలో మిగతా వర్గాల వారిని కలుపుకొని పోకుండా థియేటర్స్ ఉన్నవారు మాత్రమే విడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం వారు ఏపీలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారని.. అందుకనే ప్రభుత్వాన్ని సంప్రదించారని.. అయినా మీటింగ్ కి వెళ్లిన వారిలో అందరికి థియేటర్స్ లేవు కదా అని ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.