Begin typing your search above and press return to search.

ఆ వ్యక్తే పక్షి రాజుకు ఇన్సిపిరేషన్‌

By:  Tupaki Desk   |   29 Nov 2018 4:30 PM GMT
ఆ వ్యక్తే పక్షి రాజుకు ఇన్సిపిరేషన్‌
X
‘రోబో’ సీక్వెల్‌ గా వచ్చిన ‘2.ఓ’ చిత్రంలో రజినీకాంత్‌ పాత్ర కంటే ఎక్కువగా అక్షయ్‌ కుమార్‌ పాత్ర గురించి ఎక్కువ చర్చ జరిగింది. సీక్వెల్‌ కనుక రజినీకాంత్‌ పాత్ర ‘రోబో’ ఉన్నట్లుగానే ఉండి ఉంటుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే రజినీకాంత్‌ పాత్ర రొటీన్‌ గానే ఉంది. అయితే అక్షయ్‌ కుమార్‌ పోషించిన పక్షి రాజు పాత్ర మాత్రం సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుంది. పక్షి రాజు ఫ్లాష్‌ బ్యాక్‌ ఆకట్టుకుంది. ఆ పాత్రకు సలీం అలీ అనే వ్యక్తి ఇన్సిపిరేషన్‌ అంటూ తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

1987, జూన్‌ 20న మరణించిన సలీం అలీకి బర్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇండియా అనే బిరుదు ఉంది. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను కూడా ఇచ్చి ఆయన్ను గౌరవించింది. పక్షుల పట్ల ఆయన చూపించిన శ్రద్ద, పక్షులపై ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా రాసి ఉండరని, అంత శ్రధ్ద చూపరని చెప్పుకోవాలి. భారతదేశంలో పక్షులపై పూర్తి సర్వే నిర్వహించి, పక్షులకు సంబంధించిన విషయాలను సేకరించిన వ్యక్తి సలీం అలీ మాత్రమే. పక్షుల ప్రేమికుడు మాత్రమే కాకుండా, పర్యవరణ వేత్త కూడా. ఆయన జీవితంను ఆయన సిద్దాంతాలను ఆదర్శంగా తీసుకుని పక్షి రాజు పాత్రను దర్శకుడు శంకర్‌ మరియు రచయిత జయమోహన్‌ రూపొందించి ఉంటారని భావిస్తున్నారు.

పకృతిని ఆరాధించే పక్షి రాజు ప్రస్తుతం జనాలు టెక్నాలజీ పేరుతో చేస్తున్న వినాశనంను తట్టుకోలేక విద్వంసంకు దిగడం సినిమాలో చక్కగా చూపించారు. అక్షయ్‌ కుమార్‌ పక్షిరాజు పాత్రకు పూర్తి న్యాయం చేయడంతో పాటు, గ్రాఫిక్స్‌ లో పక్షిరాజు విశ్వరూపంను దర్శకుడు శంకర్‌ అద్బుతంగా ఆవిష్కరించాడు.