Begin typing your search above and press return to search.

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో ఇంట్రెస్టింగ్ జోడీ?

By:  Tupaki Desk   |   2 April 2021 6:30 AM GMT
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో ఇంట్రెస్టింగ్ జోడీ?
X
ప్రేమకథల స్పెషలిస్టుగా శేఖర్ కమ్ములకి మంచి పేరు ఉంది. ఆయన ప్రేమకథలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ కథల్లోని హీరో .. హీరోయిన్లు తమ పెద్దలను ఎదిరించేవిగా ఉండవు .. ఒప్పించేలా ఉంటాయి. ప్రేమ అనేది నాయకా నాయికలకు సంబంధించినదే అయినా, అది కుటుంబ బంధాలకు లోబడి నడుస్తుంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో నాయిక పాత్ర .. పాటలకు మాత్రమే పరిమితం కాదు. ఆమెకంటూ ఒక బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఆమె అభిప్రాయాలకు .. అలవాట్లకు .. ఆలోచనలకు ప్రాధాన్యత ఉంటుంది.

శేఖర్ కమ్ముల ప్రేమకథలను ఎంచుకునే తీరు .. దానిని అందంగా నడిపించే విధానం .. కథకు హృద్యమైన పాటలను తోడుగా ఇచ్చి పరిగెత్తించే పద్ధతి ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందువల్లనే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే, యూత్ అంతా ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటుంది. తాజాగా ఆయన నుంచి 'లవ్ స్టోరీ' రానుంది. నాగచైతన్య - సాయిపల్లవి జోడీగా ఆయన రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సారంగధరియా ..' పాట బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమా తరువాత చేయడానికి శేఖర్ కమ్ముల మరో ప్రేమకథకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడట. ఈ సినిమాలో కథానాయకుడిగా వైష్ణవ్ తేజ్ పేరు తెరపైకి రావడం విశేషం. ఇక కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది. ఇద్దరికీ కూడా శేఖర్ కమ్ముల కథకి కావలసిన నాయకా నాయిక లక్షణాలైతే ఉన్నాయి. కానీ ఇటు వైష్ణవ్ తేజ్ .. అటు ప్రియాంక ఇద్దరూ కూడా వరుస సినిమాలతో బిజీగానే వున్నారు. ప్రస్తుతం వాళ్లకి గల కమిట్మెంట్స్ పూర్తయిన తరువాతనే ఈ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియదుగానీ, తాజాగా ఈ వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది.