Begin typing your search above and press return to search.

'విరాట‌ప‌ర్వం' డిలే వెనుక‌ ఇంట్రెస్టింగ్ స్టోరీ?

By:  Tupaki Desk   |   6 Dec 2021 11:30 AM GMT
విరాట‌ప‌ర్వం డిలే వెనుక‌ ఇంట్రెస్టింగ్ స్టోరీ?
X
లాక్‌డౌన్ స‌డ‌లింపుల త‌రువాత థియేట‌ర్ల‌ పునః ప్రారంభానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో సినీమా ఇండస్ట్రీకి మళ్లీ కొత్త ఊపు వ‌చ్చింది. ఇందులో భాగంగా ముందుగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`.

ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయినా జ‌నం థియేట‌ర్ల‌కి వ‌స్తారా? అని మీమాంస‌లో వున్న ఇండ‌స్ట్రీ వ‌ర్గాల అనుమానాల్ని ప‌టాపంచ‌లు చేసింది. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో వ‌రుస‌గా సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం మొద‌లైంది.

ఇలా విడుద‌లైన చిత్రాల్లో చాలా వ‌ర‌కు సూప‌ర్ హిట్‌లుగా .. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచాయి. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్‌`, పంజా వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతూ బుచ్చిబాబు సానాని డైరెక్ట‌ర్‌గా ఇంట్ర‌డ్యూస్ చేస్తూ మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మించిన `ఉప్పెన‌`, ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన `జాతిర‌త్నాలు`, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన `క్రాక్‌` బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సాధించ‌డ‌మే కాకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిలిచి క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపించాయి.

కోవిడ్ భ‌యం కొన‌సాగుతున్నా ఈ చిత్రాలు థియేట‌ర్ల‌లో విడుద‌లై ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకున్నాయి. ఆ త‌రువాత నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన `ల‌వ్‌స్టోరీ` విడుద‌లై క‌లెక్ష‌న్‌ల సునామీని సృష్టించింది. ఈ సినిమాకు వ‌చ్చిన హైప్.. క‌లెక్ష‌న్‌లు చూసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు విడుద‌ల‌కు సిద్ధంగా వున్న మ‌రిన్ని చిత్రాల‌ని థియేట‌ర్ల‌లోకి వ‌దిలారు.

ఇలా వ‌చ్చిన చిత్రాల్లో రెడ్‌.. జాంబిరెడ్డి.. నాంది.. శ్రీ‌కారం... రంగ్‌దే .. నార‌ప్ప‌.. తిమ్మ‌రుసు.. రాజ రాజ చోరా.. శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌.. ట‌క్ జ‌గ‌దీష్‌.. సీటీమార్‌.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌.. దృశ్యం -2 .. రీసెంట్‌గా అఖండ వంటి చిత్రాలు విజ‌యాల్ని సాధించాయి.

అయితే ఇన్ని చిత్రాలు విడుద‌ల‌వుతున్నా `విరాట‌ప‌ర్వం` మాత్రం విడుద‌ల‌కు నోచుకోలేదు. రానా ద‌గ్గుబాటి హీరోగా, సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా ఇందులో న‌టించారు.

`నీది నీది ఒకే క‌థ‌` చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న వేణు ఊడుగుల ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఉత్త‌ర తెలంగాణలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని న‌క్స‌లైట్ ఉద్య‌మ నేప‌థ్యంలో రూపొందిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ ఆల‌స్యం కావ‌డానికి కార‌ణం కొంత షూటింగ్ పెడింగ్‌లో వుంద‌ని అది ఎప్పుడు పూర్త‌వుతుందో తెలియ‌ద‌ని ఇటీవ‌ల నిర్మాత డి. సురేష్ బాబు తెలియ‌జేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ ఆల‌స్యం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సాయి ప‌ల్ల‌వి పాత్ర అని విశ్వ‌స‌నీయ మాచారం.

అదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ మ‌హిళ ఉద్య‌మ భావాజాలానికి ప్రేరేప‌ణ పొంది ఉద్య‌మంలో చేర‌డానికి ప్ర‌య‌త్నించింది. స‌ఫ‌ల‌మైంది కూడా. అయితే ఆమె పోలీస్ ఇన్ఫార్మ‌ర్ అని అనుమానించిన ఉద్య‌మ‌కారులు ఆమెని చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేశారు.

ఆమె హ‌త్య త‌రువాత నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఆమె పోలీస్ ఇన్ఫార్మ‌ర్ కాద‌ని, అన‌వ‌స‌రంగా ఆమెని అనుమానించి హత్య చేశామ‌ని తెలుసుకున్న ఉద్య‌మ‌కారులు ఈ విష‌యంలో త‌ప్ప‌ చేశామ‌ని ప్ర‌జ‌ల‌కు, ఆమె కుటుంబానికి క్ష‌మాప‌ణలు చెప్పారు.

ఆమె ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల సాయి ప‌ల్ల‌వి పాత్ర‌ని తెర‌కెక్కించార‌ట‌. ఈ విష‌యం తెలిసి ప‌లువురు ఉద్య‌మ‌కారులు అభ్యంత‌రం చెప్పార‌ని, ఉద్య‌మాన్ని త‌ప్పుగా చిత్రీక‌రించే ప‌ని చేస్తున్నార‌ని ద‌ర్శ‌కుడిపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశార‌ట‌. దీంతో సాయి ప‌ల్ల‌వి పాత్ర‌ని కొంత మార్చి అందుకు సంబంధించిన స‌న్నివేశాల‌ని రీ షూట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇదే `విరాట‌ప‌ర్వం` రిలీజ్ ఆల‌స్యానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలుస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.