Begin typing your search above and press return to search.

‘గిరీష్​ కర్నాడ్’ ​ గుర్తున్నారా? ఆయన జీవిత విశేషాలివే..!

By:  Tupaki Desk   |   19 May 2021 5:10 AM GMT
‘గిరీష్​ కర్నాడ్’ ​ గుర్తున్నారా?  ఆయన జీవిత విశేషాలివే..!
X
గిరీష్ కర్నాడ్​... ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడేమో. ఆయన నటన ఒక భాషకే పరిమితం కాలేదు. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఆయన నటించారు. అన్ని చోట్ల ఆయన మంచి నటుడిగా గుర్తింపు సాధించారు. ఎన్నో అవార్డులు సైతం సాధించారు. ఆయనను నటుడు అనడం సరికాదేమో.. ఎందుకంటే గిరీష్​ కర్నాడ్​ దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ అందుకున్నాడు. ఆయన గొప్ప సాహితీ వేత్త. తన నాటకాలతో ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చారాయన. నేడు ఆయన జయంతి.

జంధ్యాల తెరకెక్కించిన ఆనందభైరవిలో ఆయన తొలిసారిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆయన నటుడిగా పరిచమైంది మాత్రం కన్నడ సినిమా ద్వారా.. 1970లో కన్నడ సినిమా ‘సంస్కార్‌’ లో ఆయన తొలిసారిగా నటించారు. ఆ తర్వాత తెలుగులో ధర్మచక్రం, శంకర్​దాదా ఎంబీబీఎస్​, కొమరం పులి వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన తెలుగులో చివరగా నటించిన చిత్రం మాత్రం పవర్​ స్టార్​ నటించిన కొమరం పులి.

గొప్ప నాటకరచయిత, దర్శకుడు, కవి, అయిన గిరీష్​ కర్నాడ్​.. మే 19, 1938లో మహారాష్ట్రలోని మతేరన్​లో జన్మించారు. అయితే గిరీష్ కర్నాడ్‌ కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఎన్నో గొప్పరచనలు చేశారు. మహారాష్ట్రలో జన్మించిన గిరీష్. కన్నడ ప్రజలతో ఎనలేని అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన తన మొదటి నాటకం కన్నడలో రాశారు. తర్వాత దానిని ఇంగ్లిషులోకి అనువదించారు. ఈ నాటకం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆయన రాసిన 'యయాతిట, 'తుగ్లక్', 'హయవదన్', 'అంజు మల్లిగె', 'అగ్నిమతు మాలె' 'నాగమండల్' లాంటి నాటకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. 2019, జూన్ 10 న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

కేవలం నాటకకర్తగానే కాక.. సామాజిక వేత్త గా కూడా గిరీశ్ కర్నాడ్​ పేరు సంపాదించారు. ప్రభుత్వా విధానాలను ఆయన నిర్భయంగా వ్యతిరేకించేవారు. నిత్యం ప్రజల పక్షానే పోరాడే వారు. ఆయనకు ఎన్నో అవార్డులు దక్కాయి. 1994లో సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ్ పురస్కారం, 1974 లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ లభించాయి. 1972లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1992లో కన్నడ సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో దేశం లోనే అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ దక్కింది.

మొదటి సినిమాకే ఆయనకు రాష్ట్రపతి గోల్డెన్ లోటస్ పురస్కారం లభించింది. ఆర్‌కే నారాయణ్ పుస్తకం ఆధారంగా బుల్లితెరపై వచ్చిన 'మాల్గుడి డేస్' సీరియల్‌ లో ఆయన స్వామికి తండ్రి పాత్ర చేశారు. 1990లో మొదలైన సైన్స్ ఆధారిత టీవీ కార్యక్రమం 'టర్నింగ్ పాయింట్‌' ను హోస్ట్‌ చేశారు. ఆయన ఆఖరి సినిమా కన్నడ భాషలోనే నిర్మించిన అప్నా దేశ్.