Begin typing your search above and press return to search.

ఇంటర్వ్యూ: నారప్ప నా కెరీర్ లోనే మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ - వెంకటేష్

By:  Tupaki Desk   |   17 July 2021 10:30 AM GMT
ఇంటర్వ్యూ: నారప్ప నా కెరీర్ లోనే మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ - వెంకటేష్
X
విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ''నారప్ప''. ఇది తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'అసురన్' చిత్రానికి రీమేక్. వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై క‌లైపులి ఎస్.థాను - సురేష్ బాబు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా జూలై 20న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో వెంకటేష్ మీడియా మాట్లాడుతూ 'నారప్ప' సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు..

* 'నారప్ప' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తారని అనుకుంటున్న సమయంలో OTT రిలీజ్ కు వెళ్లడంపై మీ స్పందన ఏంటి?

౼ నేను కాలానికి కట్టుబడి ఉండే వ్యక్తిని కాదు. టైం కి ఇది అవ్వలేదు. అది అవ్వలేదు అనుకోవడం తప్పు. ప్రశ్నించకూడదని నేను భావిస్తాను. అది తప్పో ఒప్పో కాలమే నిర్ణయిస్తుంది. నటుడిగా నా పని నేను చేసాను. విడుదల పై నిర్మాతలు నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా కెరీర్ లో ఫస్ట్ టైం అనేది వస్తుంది కదా.. ఓటీటీలో నా సినిమా రిలీజ్ అవ్వడం ఫస్ట్ టైం అని అనుకోవాలి. (నవ్వుతూ)


* 'నారప్ప' ఓటీటీ విడుదల పై ఫ్యాన్స్ నిరాశ చెందినట్లున్నారు?

౼ అవును నిజమే. కొందరు హ్యాపీగా ఉన్నప్పటికీ
మరికొందరు అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఈ విషయంలో వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఈ పరిస్థితుల్లో సినిమాని ప్రత్యామ్నాయం లేక ఓటీటీ రిలీజ్‌ ను ఎంచుకోవాల్సి వచ్చింది. నా ఫ్యాన్స్ అది అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకు ఉంది. నా సినిమాలు 100 రోజులు ఆడినా ఆడకపోయినా ఎన్నో ఏళ్ల నుంచి నన్ను అభిమానిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది.


* 'అసురన్' రీమేక్ చేయడానికి మిమ్మల్ని ఏ అంశం బాగా ఆకర్షించింది?

౼ నేను ధనుష్, కి వెట్రిమారన్ కి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ ని హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇచ్చారు. 'అసురన్' నాకు బాగా నచ్చింది. చూసిన వెంటనే ఇలాంటి సినిమా తెలుగులో చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అది నాకు ఛాలెంజింగ్ రోల్ అనిపించింది. అందుకే రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాను. కెరీర్ ప్రారంభం నుంచి నేను చాలా రీమేక్‌ లు చేసాను. ప్రతి ఒక్కరూ రిమేక్ అనేది ఈజీ అనుకుంటారు. కానీ ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని.. ఒక హీరో చేసిన పాత్రను మళ్ళీ తన స్టైల్ లోకి మార్చుకొని చేయడం అంటే చాలా పెద్ద సవాల్.


*'నారప్ప' పాత్ర కోసం మీరు ఎలా సన్నద్ధం అయ్యారు?

౼ నారప్ప నా కెరీర్ లోనే మోస్ట్ ఛాలెంజింగ్ రోల్. గెటప్ - ఎమోషన్స్ - యాక్షన్ సీక్వెన్స్ అన్నీ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. నేను నా పాత్రలో నటిస్తున్న సమయంలో హోటల్ లో 50 రోజులు అదే డ్రెస్ లో ఉన్నాను. ప్రతీ ఎమోషనల్ సీన్ షూట్ చేసిన తర్వాత చూసుకుంటే అద్భుతంగా వచ్చిందని అనిపించేది. ఇలాంటి క్యారక్టర్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే సినిమాలో యాక్టర్స్ అందరు చాలా బాగా చేసారు.


* 'నారప్ప' కు దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల ను తీసుకోడానికి కారణం?

౼ శ్రీకాంత్ అడ్డాల 'అసురన్' సినిమా చూసి తెలుగు రీమేక్ ని డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. నాతో ఆల్రెడీ ఒక మంచి సినిమాకి వర్క్ చేసిన శ్రీకాంత్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అయితే బాగుంటుంది అనుకున్నాం. ఆల్రెడీ హిట్ అయిన కథను అడాప్ట్ చేసుకొని.. తెలుగులో చెప్పడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. అతను తన పనిని చాలా బాగా చేసాడు.


* ఒరిజినల్ సినిమాతో ధనుష్ తో కంపేరిజన్ గురించి?

౼ రీమేక్ చేసినప్పుడు ఒరిజినల్‌ తో పోలికలు ఉంటాయి. కాని మేము ఎవరినీ నిరాశ పరచమని నేను భావిస్తున్నాను. ధనుష్ చాలా మంచి యాక్టర్. ఎలాంటి పాత్రను అయినా చేయగలడు. నేను అతని యాక్టింగ్ ని చాలా ఇష్టపడతాను. 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాన్ని తమిళ్ లో ధనుష్ రీమేక్ చేసాడు. ఏదేమైనా సినిమా చూసిన తర్వాత ఎవరు ఎలా చేశారు అనేది ప్రేక్షకులు ఆలోచించరు. ఆ పాత్రలో లీనమై బాగా చేశాడా లేదా అనేదే ఆలోచిస్తారు.


* ఒకేసారి బ్యాక్-టు-బ్యాక్ మూడు సినిమాలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది?

౼ ఆ విధంగా నేను చాలా లక్కీ అని భావిస్తున్నాను. నేను ఏ సినిమా షూటింగ్ చేసినా వెంటనే ఆ పాత్ర నుంచి బయటకు వచ్చేస్తాను. కెరీర్ ప్రారంభం నుంచి నేను అంతే. 'నారప్ప' 'దృశ్యం 2' 'ఎఫ్ 3' వేటికవే ప్రత్యేకమైనవి. అలా మూడు సినిమా చేయడానికి కుదిరినందుకు నేను లక్కీ.


* OTT లపై మీ అభిప్రాయం?

౼ టైం చాలా త్వరగా మారిపోయింది. ఇప్పుడు ఓటిటిల హవా నడుస్తుంది. కరోనా తగ్గిపోతే మళ్ళీ ఖచ్చితంగా థియేటర్స్ అన్నీ తెరుచుకుని మామూలు పరిస్థితులు వస్తాయి.


* 'నారప్ప' సినిమా చూసాక మీకు ఏమనిపించింది?

౼ నా వరకు చాలా బాగా అనిపించింది. ఛాలెంజింగ్ రోల్. నా కెరీర్ లో ది బెస్ట్ ఈ సినిమా అని చెప్పవచ్చు. ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకొనే నారప్ప చేసా. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాక ఫ్యాన్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది.