Begin typing your search above and press return to search.

'బంగార్రాజు' సాంగ్ టీజర్: వాసివాడి తస్సాదియ్యా.. పిల్ల జోరు అదిరిందయ్యా..!

By:  Tupaki Desk   |   17 Dec 2021 2:14 PM GMT
బంగార్రాజు సాంగ్ టీజర్: వాసివాడి తస్సాదియ్యా.. పిల్ల జోరు అదిరిందయ్యా..!
X
'మనం' తర్వాత తండ్రీకొడుకులు కింగ్ అక్కినేని నాగార్జున - యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ''బంగార్రాజు''. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే విడుదల చేయబడిన 'లడ్డుండా' - 'నా కోసం' అనే రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో 'పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌' పేరుతో 'ఏయ్ బంగార్రాజు' అనే మూడో పాటని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వదిలిన మ్యూజికల్ డిజిటల్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా థర్డ్ సింగిల్ టీజర్ ని నాగార్జున రిలీజ్ చేశారు.

'ఓయ్ బంగార్రాజు.. నువ్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే బంగార్రాజూ.. మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజూ.. నువ్వు శ్రీరాముడివి అయిపోతే బంగార్రాజూ.. మాకు ఇంకెవ్వడు తీరుస్తాడు ముద్దూ మోజు' అంటూ వచ్చిన ఈ టీజర్ అలరిస్తోంది. 'వాసివాడి.. వాసివాడి.. వాసివాడి తస్సాదియ్యా.. పిల్ల జోరు అదిరిందయ్యా' అంటూ అక్కినేని తండ్రీకొడుకులు మాస్ స్టెప్స్ వేసినట్లు కనిపిస్తోంది.

ఇందులో నాగ్ - చైతూలతో కలిసి 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఆడిపాడింది. అనూప్ రూబెన్స్ ఓ స్పెషల్ డ్యాన్స్ నంబర్ కి హార్మొనీ తబలా వంటి ఇంస్ట్రుమెంట్స్ తో ఫ్రెష్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. కళ్యాణ్ కృష్ణ ఈ పాటకు సాహిత్యం అందించగా.. మోహన భోగరాజు - సాహితీ చాగంటి - హర్షవర్ధన్ కలసి ఆలపించారు. శేఖర్ మాస్టర్ ఈ ఐటమ్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు.

చిన బంగార్రాజు పాత్ర స్వభావాన్ని తెలియజేసే ఈ 'ఓయ్ బంగార్రాజు' పాట ఫుల్ లిరికల్ వీడియోని డిసెంబర్ 19న సాయంత్రం 5.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 'పియో పియో' పాట తర్వాత తండ్రీకొడుకులు కలిసి స్టెప్పులేసిన ఈ సాంగ్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, నాగార్జున నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్ గా ''బంగార్రాజు'' సినిమా తెరకెక్కుతోంది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నాగ్ కు జంటగా రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. చలపతి రావు - రావు రమేష్ - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ - ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'బంగార్రాజు' చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా.. విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ మీద స్పష్టత రానుంది.