Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు.. కొత్త అప్ డేట్

By:  Tupaki Desk   |   1 Feb 2018 2:30 PM GMT
డ్రగ్స్ కేసు.. కొత్త అప్ డేట్
X
ఆర్నెల్ల కిందట టాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ గురించి ఎంత చర్చ నడిచిందో తెలిసిందే. రోజు వారీ విచారణలు.. అప్ డేట్లతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకున్నారు. కానీ నెల గడిచాక ఈ కేసు పక్కకు వెళ్లిపోయింది. ఇంకొన్ని రోజుల తర్వాత అందరూ దీని గురించి మరిచిపోయారు. చాలామంది సందేహించినట్లే కేసును నీరు గార్చేశారన్న భావన అందరిలో వచ్చేసింది. ఐతే కొన్ని నెలల విరామం తర్వాత ఇప్పుడు డ్రగ్స్ కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ కేసు త్వరలోనే ఓ కొలిక్కి రాబోతున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఎల్‌ ఎస్డీ నమూనాలు త్వరలో ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు చేరనున్నాయి. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే విశ్లేషణ పూర్తి చేసి సంబంధిత నివేదికను న్యాయస్థానంలో సమర్పించేందుకు.. అభియోగపత్రాలు దాఖలు చేసేందుకు సిట్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

విచారణలో భాగంగా అనుమానితుల నుంచి సేకరించిన రక్తం.. గోళ్లు.. వెంట్రుకల నమూనాలను సిట్‌ అధికారులు ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపారు. వాటిలో మత్తుమందుల అవశేషాలు ఉన్నాయో లేదో చెప్పాలని కోరారు. ప్రధానంగా నిందితులు కొకైన్‌.. ఎల్‌ ఎస్డీ అనే రెండు రకాల మత్తుమందులు వాడినట్లు ఆరోపణలుండగా.. అనుమానితుల నుంచి సేకరించిన నమూనాల్లో వాటి అవశేషాలను విశ్లేషించాల్సి ఉంది. అది జరగాలంటే ముందు ఆ మత్తుమందు తాలూకు స్టాండర్డ్‌ సాంపిల్‌ ఉండాలి. ఐతే మన దేశంలో కేవలం కొకైన్‌ కు సంబంధించిన ప్రామాణిక నమూనా మాత్రమే ఉండగా.. ఎల్‌ఎస్డీ నమూనా అమెరికాలో మాత్రమే దొరుకుతుంది. దానికోసం తెలంగాణ ఆబ్కారీ అధికారులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమెరికాను సంప్రదించారు. అనేక దశల్లో ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఆ దేశ ఫోరెన్సిక్‌ అధికారులు ఎట్టకేలకు గత వారం దాన్ని పంపారు. ఒకటి రెండు రోజుల్లోనే ఇది ఇక్కడికి చేరే అవకాశం ఉంది. కొకైన్‌ ప్రామాణిక నమూనా ద్వారా పూర్తిచేసిన విశ్లేషణ నివేదికలను ఇదివరకే ఫోరెన్సిక్‌ అధికారులు న్యాయస్థానానికి పంపారు. తదుపరి దశలో ఎల్‌ఎస్డీ నమూనాను.. అనుమానితుల నమూనాలతో విశ్లేషించి సంబంధిత నివేదికను న్యాయస్థానానికి అందిస్తారు. తర్వాత రెండుమూడు రోజుల వ్యవధిలోనే అభియోగపత్రాలు దాఖలు చేయాలనే ఆలోచనలో సిట్‌ ఉంది. మరి పోలీసులు ఛార్జ్ షీట్ ఏమని దాఖలు చేస్తారు.. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది అన్నది చూడాలి.