Begin typing your search above and press return to search.

ఆలియా పేరు అవసరమా జక్కన్న?

By:  Tupaki Desk   |   7 Oct 2022 6:32 AM GMT
ఆలియా పేరు అవసరమా జక్కన్న?
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఆరు నెలల క్రితం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఇంకా కూడా ఓటీటీ ద్వారా సందడి చేస్తూనే ఉంది. హాలీవుడ్‌ లో కూడా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుంది అంటే సినిమా యొక్క స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన సినిమా అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు.

ఈ సినిమా ఆస్కార్‌ నామినేషన్స్ ను దక్కించుకోవడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా అంతా నమ్మకంగా ఉన్న సమయంలో ఇండియన్ ఆస్కార్‌ కమిటీ కనీసం నామినేషన్స్ వరకు కూడా ఆర్ ఆర్‌ ఆర్‌ ను పంపించలేదు. దాంతో జక్కన్న టీమ్ జనరల్ కేటగిరీలో నేరుగా ఆర్ ఆర్‌ ఆర్‌ ను ఆస్కార్ బరిలో నిలిపేందుకు గాను ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఆస్కార్ కోసం ఏకంగా 14 కేటగిరీల్లో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను నామినేషన్స్ కోసం పంపించడం జరిగింది. అందులో సహాయ నటి పాత్ర లో ఆలియా భట్‌ పేరును మరియు సహాయ నటుడు పాత్రలో అజయ్ దేవగన్ పేరును ఆస్కార్‌ కమిటీకి పంపించడం జరిగింది. వీరిద్దరి పాత్ర సినిమాలో ఏపాటిదో అందరికి తెల్సిందే. దాంతో ఇప్పుడు అదే వివాదాస్పదంగా మారింది.

చిత్ర యూనిట్‌ సభ్యులు ఇతర విభాగాలకు సంబంధించి ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్లడం పర్వాలేదు. కానీ ఆలియా భట్‌ ను మరియు అజయ్ దేవగన్ లు ఎంత సమయం ఉన్నారని వారి యొక్క పేర్లను జాబితాలో చేర్చారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆలియా పాత్ర విషయంలో తీవ్ర విమర్శలు గతంలోనే వచ్చాయి.. మళ్లీ ఇప్పుడు ఆస్కార్‌ జాబితాలో చేర్చడం సరైనదేనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి టీమ్‌ అన్ని విభాగాలకు నామినేషన్స్ ను ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో ఆ జాబితా తయారు చేయడం జరిగింది. వారికి కూడా తెలుసు ఆ మొత్తం జాబితా లో మూడు లేదా నాలుగు విభాగాలు అయినా నామినేషన్స్‌ దక్కించుకోక పోవచ్చు. అయినా కూడా ప్రయత్నించడం మానవ ప్రయత్నం అన్నట్లుగా అన్ని విభాగాలకు ప్రయత్నిస్తున్నారు. అందులో తప్పేం లేదు అనేది కొందరి అభిప్రాయం.

ఆలియా పేరును జాబితాలో ఉంచినంత మాత్రాన నష్టం ఏమీ లేదు.. అది అభిమానులకు ఒకింత గొప్పే కదా అంటూ సోషల్‌ మీడియా లో కొందరు జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ లో ఆమె పాత్ర చిన్నదే అయినా ఆమె ఒక భాగం కనుక ఆమె పేరును జాబితాలో ఉంచి ఉంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.