Begin typing your search above and press return to search.

రూల్స్ ప్ర‌కార‌మే మ‌ల్టీప్లెక్స్ థియేటర్ క‌డుతున్నారా?

By:  Tupaki Desk   |   29 Nov 2019 1:30 AM GMT
రూల్స్ ప్ర‌కార‌మే మ‌ల్టీప్లెక్స్ థియేటర్ క‌డుతున్నారా?
X
ఏపీ తెలంగాణ న‌గ‌రాల్లో మెజార్టీ మ‌ల్టీప్లెక్స్ ల‌కు ఫైర్‌ సేఫ్టీ లేదనేది న‌గ‌ర పాల‌క సంస్థ‌ల అభియోగం. దీనిని ప్ర‌భుత్వాలు తీవ్రంగా పరిగణించినా కొంద‌రు అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదట‌. అలాంట‌ప్పుడు ఏదైనా అగ్ని ప్ర‌మాదం జ‌రిగితే ప‌రిస్థితేమిటి? న‌గ‌రాల్లో ప్ర‌తి మ‌ల్టీప్లెక్స్ కి అందులోని థియేట‌ర్ల‌ కి ఫైర్ సేఫ్టీ అవ‌స‌రం అన్న నిబంధ‌న ఉంది. 15మీటర్ల ఎత్తున్న వాణిజ్య.. 18మీటర్ల ఎత్తున్న నివాస భవనాలకు ఫైర్‌ సేఫ్టీ తప్పనిసరి అని నిబంధన అమ‌ల్లో ఉంది. వాస్తవంగా భవన నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) జారీ సమయంలోనే ఫైర్‌ సేఫ్టీ ఉందా లేదా అన్న‌ది పరిశీలించాలి. అధికారులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆమ్యామ్యాల‌తో లైట్ తీస్కుంటున్నార‌న్న ఫిర్యాదులు ఉన్నాయి. కనీస అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఓసీ జారీ చేస్తున్నారట‌. కొన్ని మ‌ల్టీప్లెక్సుల్లో అయితే అగ్నిమాపక ఏర్పాట్లు చేయడం లేదట‌.

అస‌లు మ‌ల్టీప్లెక్సులు.. వాటిలో థియేట‌ర్లు నిర్మించే ముందు ఎలాంటి నిబంధ‌న‌లు ఉన్నాయి? అంటే న‌గ‌ర ప్లానింగ్ వాళ్లు చెప్పేవాటిలో తెలుసుకుని తీరాల్సిన పాయింట్లు ఎన్నో. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ నిబంధనల ప్రకారం భవనాల్లో అగ్ని ప్రమాదాలను నియంత్రించే పరికరాలను ఏర్పాటుచేయాలి. మ‌ల్టీప్లెక్స్ ల‌కు.. భారీ భ‌వంతుల‌కు ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. ఫైర్‌ సర్వీసెస్‌ విభాగాల నుంచి విధిగా నిరభ్యంతర పత్రాలు తీసుకోవాలి. హోస్‌ రీల్‌- అలారమ్‌- మంటలను ఆర్పే ఫోమ్‌ అందుబాటులో ఉంచాలి. స్టిల్ట్‌ ప్లస్‌ ఐదంతస్థులతోపాటు సెల్లార్‌ ఉన్న భవంతుల్లో స్పింకల్చర్స్‌ అందుబాటులో ఉంచాలి. భారీ భవనాల చుట్టూ ఫైరింజన్‌ వాహనం తిరిగేందుకు అనువుగా స్థలం ఉండాలి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అక్కడ ఉన్న వారు త్వరగా బయటకు వెళ్లేందుకు వీలుగా దారులు ఉండాలి. ఇటీవ‌ల థియేట‌ర్లు ఉన్న చోటే హోట‌ళ్లు.. షాపులు వ‌గైరా అందుబాటులో ఉంటున్నాయి. ప్ర‌తిచోటా సేఫ్టీ నిబంధ‌న‌లు పాలించాల‌ని రూల్ ఉంది.

ఫైర్‌ సేఫ్టీ-1999 చట్టం ప్రకారం జీహెచ్ ఎంసీకి అగ్ని మాపక నియంత్రణ ఏర్పాట్లు లేని భవనాలపై నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేదు. నోటీసుల జారీ.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయకుండా నిలిపివేయడం వీరి పరిధిలో ఉంది. ఫైర్‌ సేఫ్టీ యాక్ట్‌-99.. ఫైర్‌ సేఫ్టీ లెవీ రూల్స్‌-2006లో సవరణలు చేసేందుకు ప్ర‌స్తుతం అధికారులు ప‌రిశీల‌నలు చేస్తున్నార‌ట‌.