Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్ 30' హిట్టయితేనే బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   25 July 2022 7:36 AM GMT
ఎన్టీఆర్ 30 హిట్టయితేనే బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ‌త ఏడాది 'పుష్ప‌'తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. డిసెంబ‌ర్ 17న మొత్తం ఐదు భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం.. నెగ‌టివ్ టాక్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ అద్భుతమైన క‌లెక్ష‌న్స్ తో సూపర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు ఈ మూవీకి పార్ట్ 2 కూడా రాబోతోంది. 'పుష్ప ది రూల్‌' టైటిల్ తో తెర‌కెక్కనున్న ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. ప్ర‌స్తుతం సుకుమార్ స్క్రిప్ట్ లో ప‌లు మార్పులు చేర్పులు చేస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఇదిలా ఉంటే.. బ‌న్నీ గ‌తంలో స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివతో ఓ మూవీని అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. '#AA21' వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, జిఎ 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాల్సి ఉంది. పుష్ప రెండు పార్ట్ లు కూడా పూర్తి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంద‌ని అన్నారు. కానీ, రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్ ల‌ను హీరోలుగా పెట్టి కొర‌టాల శివ రూపొందించిన 'ఆచార్య‌' బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అస‌లు కొర‌టాల నుండి ఇలాంటి సినిమా ఊహించ‌లేద‌ని చాలా మంది పెద‌వి విరిచారు.

ఇన్నాళ్లు అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా చ‌లామ‌ణి అయిన కొర‌టాల శివ‌.. ఆచార్య‌తో భారీ ఫ్లాప్ ను మూట‌గ‌ట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే వ‌రుస హిట్స్ తో దూసుకుపోతున్న బ‌న్నీ.. ఇప్పుడు కొర‌టాల‌తో సినిమా అంటే వెన‌క‌డుగు వేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం కొర‌టాల శివ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. 'ఎన్టీఆర్ 30' వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప్రారంభం కాబోతోంది.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

ఇప్ప‌టికే ఈ మూవీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన గ్లింప్స్ విశేషంగా ఆక‌ట్టుకుంది. మ‌రికొద్ది రోజుల్లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ సైతం షురూ కానుంది. అయితే ఈ సినిమా హిట్టయితేనే.. '#AA21' చేసేందుకు బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాలని భావిస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు బ‌న్నీతో సినిమా చేయాలంటే.. ఎన్టీఆర్ కు కొర‌టాల హిట్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు.