Begin typing your search above and press return to search.

వివాదాన్ని మరింత పెంచుతున్నారా ?

By:  Tupaki Desk   |   25 Feb 2022 5:03 AM GMT
వివాదాన్ని మరింత పెంచుతున్నారా ?
X
భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా తలెత్తిన వివాదాన్ని జనసేన అధినేత పవన్ కల్యాన్ మరింతగా పెంచుతున్నట్లున్నారు. బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల ధరలు పెంచడం లాంటివి చేయకూడదని భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేకించి నోటీసులు జారీ చేసింది. దీంతో పవన్ పై ప్రభుత్వం వ్యక్తిగతంగా కక్షసాధింపు మొదలుపెట్టిందనే ఆరోపణలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నిజానికి ప్రభుత్వం తాజాగా సర్క్యులర్ జారీ చేయాల్సిన అవసరమే లేదు.

ఇపుడున్న నిబంధనలనే పాటించాలని చెబితే సరిపోయేది. ఎందుకంటే సర్క్యులర్ లో చెప్పిన విషయాలన్నీ ఎప్పటినుండో అమల్లో ఉన్నదే. ఉన్న నిబంధనలనే ప్రత్యేకంగా సర్క్యులర్ లో చెప్పటంతోనే వివాదం పెరిగిపోయింది. దీనికితోడు పవన్ విడుదల చేసిన ఒక ప్రకటన కూడా దీనికి తోడయ్యింది. రాజకీయ విమర్శలను కళారంగానికి అంటనీయరంటు మంత్రి కేటీయార్ ను ఉద్దేశించి పవన్ అభినందించారు. ఎంత భావ వైరుద్ధ్యమున్నా, రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళలకు, సంస్కృతికి అంటనీయకపోవటం తెలంగాణా రాజకీయ నేతల శైలి అన్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పవన్ వ్యవహారశైలి తెలంగాణ ప్రభుత్వంతో ఒకలాగ, ఏపీ విషయంలో ఒకలాగ ఉంటోంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను కానీ కేసీయార్ ప్రభుత్వం గురించి కాని పొరబాటున కూడా వ్యతిరేకంగా ఒక్క మాటనరు. కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణలో రాజకీయ రంగం కళ, సంస్కృతులకు అంటనీయరని చెప్పటమే విచిత్రం. ఎందుకంటే రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడి, మంత్రి పేర్నినానిని సన్నాసి మంత్రంటు నోరుపారేసుకున్నది పవనే.

వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సినీ ప్రముఖులు ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే పవనే నోరుపారేసుకుని సమస్యకు రాజకీయ రంగు పులిమారు. ఈ వివాదంలో ప్రభుత్వం వైపు నుండి కూడా తప్పులుండచ్చు. కానీ జగన్ తో జరిగిన చర్చలను, చర్చల తీరుపైన నరసాపురం బహిరంగ సభలో కూడా పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరు చూసిందే. ప్రభుత్వంపై తాను నోటికొచ్చినట్లు మాట్లాడేస్తు వివాదానికి ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే విచిత్రంగా ఉంది.

భీమ్లా నాయక్ సినిమా కు బెనిఫిట్ షోలు, అదనపు ఆటలకు అనుమతి కావాలని తెలంగాణా ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేసింది సినిమా యూనిట్. మరి ఇదే రిక్వెస్టు ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు చేయలేదు ? చూస్తుంటే పవన్ ఇగే వల్లే సినిమా యూనిట్ ప్రభుత్వాన్ని అప్రోచ్ కాలేదని అర్ధమవుతోంది. తమవైపు కూడా తప్పులు పెట్టుకుని ప్రభుత్వాన్ని మాత్రమే నిందించటం వల్ల వివాదం మరింత పెరుగుతుందే కానీ తగ్గదని పవన్ గ్రహించాలి.