Begin typing your search above and press return to search.

బరిలో ఉన్న 'బంగార్రాజు' కు కూడా ఇబ్బందేనా..?

By:  Tupaki Desk   |   5 Jan 2022 11:52 AM GMT
బరిలో ఉన్న బంగార్రాజు కు కూడా ఇబ్బందేనా..?
X
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను 'సినిమా పండుగ' గా పేర్కొంటారు సినీ జనాలు. ఈ సీజన్ లో ఎలాంటి సినిమా వచ్చినా టాక్ తోసంబంధం లేకుండా వసూళ్లు కొల్లగొడుతుందని భావిస్తుంటారు. అందుకే పోటీపడి తమ చిత్రాలను విడుదల చేస్తుంటారు. ఒకేసారి నాలుగైదు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తుంటాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా గతేడాది సంక్రాంతి నీరుగారిపోయింది. 50 శాతం ఆక్యుపెన్సీతో 'క్రాక్' సినిమా తప్ప మరో మూవీ సక్సెస్ కాలేకపోయింది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో ఈసారి పండక్కి సినిమా జాతర ఖాయమని అందరూ భావించారు. దీనికి తగ్గట్టుగానే 'సర్కారు వారి పాట' 'భీమ్లా నాయక్' 'రాధే శ్యామ్' 'బంగార్రాజు' వంటి సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు ప్రకటించాయి. అయితే 'ఆర్.ఆర్.ఆర్' రాకతో రెండు పెద్ద సినిమాలు రేసు నుంచి తప్పుకున్నాయి. అయినా సరే రెండు మరో మూడు సినిమాలు ఉన్నాయిగా అని అనుకుంటుండగా.. ఇప్పుడు మరోసారి గతేడాది సీన్ రిపీట్ అయింది.

దేశవ్యాప్తంగా కరోనా మరియు ఓమైక్రాన్ ఉదృతి పెరుగుతుండటంతో ఒక్కొటొక్కటిగా వాయిదా బాట పడుతున్నాయి. ఇప్పటికే RRR చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయగా.. ఇప్పుడు 'రాధే శ్యామ్' కూడా అదే దారిలో నడిచింది. దీంతో సంక్రాంతి వార్ లో ఉంటాయని భావించిన పెద్ద సినిమాలేవీ లేకుండా పోయాయి. దీంతో దాదాపు పది చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాయి.

ప్రస్తుతానికి బరిలో నిలిచిన క్రేజీ మూవీ 'బంగార్రాజు' ఒక్కటే అని చెప్పవచ్చు. తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున - నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా కావడంతోమొదటి నుంచీ ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ కావడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద బాగా వర్క్ అవుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

'బంగార్రాజు' చిత్రాన్ని జనవరి 13న విడుదల చేస్తారనే టాక్ నడుస్తోంది. ఫెస్టివల్ రేసులో బజ్ ఉన్న మరో సినిమా లేకపోవడంతో.. రిలీజ్ కు ముందే బంగార్రాజు సంక్రాంతి విన్నర్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాకు కూడా ఇబ్బందులు తప్పవనే కామెంట్స్ వస్తున్నాయి. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ లలో కూడా ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదు.

ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోనూ 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించాల్సి వస్తుంది. అందులోనూ 'బంగార్రాజు' సినిమా కోసం ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావాల్సి ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో రిస్క్ తీసుకొని సినిమాలు చూడటానికి వస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అందుకే నాగార్జున సినిమాకు కూడా సమస్యలు తప్పవనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ వారంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

కాగా, ''బంగార్రాజు'' చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతూకు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.