Begin typing your search above and press return to search.

ఈవెంట్ రద్దుతో మేకర్స్ కు రూ. 2.25 కోట్లు నష్టం!?

By:  Tupaki Desk   |   3 Sep 2022 11:30 AM GMT
ఈవెంట్ రద్దుతో మేకర్స్ కు రూ. 2.25 కోట్లు నష్టం!?
X
బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని తెలుగులో చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బచ్చన్ - మౌనీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించారు.

'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తుండటంతో దక్షిణాదిలోనూ అందరిలో ఆసక్తి నెలకొంది. దర్శకధీరుడు ప్రమోట్ చేస్తున్నాడంటే కచ్చితంగా ఏదో ప్రత్యేక ఉంటుందని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

'బ్రహ్మాస్త్రం: శివ' చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అభిమానులు మరియు మీడియా మిత్రుల సమక్షంలో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరవుతారని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. బిగ్ స్టార్స్ - టాప్ టెక్నిషియన్స్ పాల్గొనే ఈ వేడుక కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాజమౌళి తనయుడు కార్తికేయ దగ్గరుండి వీటిని పర్యవేక్షించారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు - అక్కినేని ఫ్యాన్స్ మరియు రాజమౌళి అభిమానులు పెద్ద సంఖ్యలో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. అయితే భద్రతా సమస్యల కారణంగా చివరి నిమిషంలో ఈ ఈవెంట్ రద్దు చేయబడిన సంగతి తెలిసిందే.

గణేష్ ఉత్సవాల దృష్ట్యా మొత్తం పోలీసు యంత్రాంగం ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నందున.. ఈవెంట్ కు భద్రత కల్పించలేమంటూ తెలంగాణ పోలీసులు 'బ్రహ్మాస్త్ర' బహిరంగ వేడుకకు అనుమతి నిరాకరించారు. ఈ పరిణామాలతో ఫ్యాన్స్ తో పాటుగా టీమ్ అంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.

నివేదికల ప్రకారం ఆర్ఎఫ్సీలో ఈవెంట్ కోసం మేకర్స్ రూ. 2 - రూ. 2.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడంతో ఇదంతావృధా అయిందని నిర్వాహకులు ఆవేదన చెందినట్లు టాక్ వినిపిస్తోంది.

'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయినప్పటికీ.. పార్క్ హయత్ హోటల్‌ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా మీట్ కు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరో 10 లక్షలు ఖర్చయ్యాయచని అంటున్నారు.

ఇప్పటికే ఈ సోసియో ఫాంటసీ అడ్వాంచర్ మూవీ కోసం అధిక బడ్జెట్ ను కేటాయించగా.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు ఖర్చులు అదనపు భారంగా మారాయని తెలుస్తోంది. ఈవెంట్ క్యాన్సిల్ అయినా.. ప్రెస్ మీట్ ను సక్సెస్ చేయగలిగారు.

ఎన్టీఆర్ స్పీచ్ హైలైట్ గా నిలవగా.. తారక్ తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడి నాగార్జున అందరినీ ఆకట్టుకున్నాడు. అలియా తెలుగులో పాట పాడగా.. ఆమె భర్త రణబీర్ ఏకంగా తెలుగులో మాట్లాడి ఆశ్చర్య పరిచారు. కరణ్ జోహార్ ఈ కార్యక్రమంలో నాగ్ కాళ్లకు నమస్కరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక రాజమౌళి ఈ సందర్భంగా 'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చేసిన ఏర్పాట్ల గురించి మాట్లాడారు. సినిమాలో అగ్ని అస్త్ర గా కనిపించనున్న రణవీర్.. ఎన్టీఆర్ వద్దకు వచ్చి 'తొడ కొట్టు చిన్నా' అని 'ఆది' సినిమాలోని డైలాగ్ చెప్పగా.. అప్పుడు తారక్ తొడగొడితే ఆకాశంలో ఫైర్ వర్క్ వచ్చేలా ప్లాన్ చేశామని.. ఇది అద్భుతంగా అనిపించేదని జక్కన్న తెలిపారు. ఈ ఈవెంట్ లో కుదరకపోయినా సక్సెస్ మీట్ లో దీన్ని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.

కాగా, 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. దీని బడ్జెట్ 400 కోట్ల వరకూ అయిందని నివేదికలు చెబుతున్నాయి. అంత పెట్టుబడిని రికవరీ చేయడానికి అన్ని భాషలలో బాగా వసూళ్ళు చేయాల్సి ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద 'బ్రహ్మాస్త్ర' ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.