Begin typing your search above and press return to search.

భారీ హంగులతో చరణ్ కొత్త ఇల్లు రెడీ అయిందా..?

By:  Tupaki Desk   |   2 July 2021 10:37 AM GMT
భారీ హంగులతో చరణ్ కొత్త ఇల్లు రెడీ అయిందా..?
X
టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు స్థిరపడటానికి చూస్తున్నారు. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే క్రమంలో సొంత ఇళ్లు కట్టుకుంటున్నారు. పెద్ద ఫ్యామిలీలకు చెందిన హీరోలు కూడా ఇల్లు కట్టుకొని వేరుగా ఉంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు కూడా కొత్త ఇంటి నిర్మాణం చేపట్టినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మెగా కోడలు ఉపాసన సైతం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తాజా సమాచారం ప్రకారం కొణిదెల వారసుడి కొత్త ఇంటి నిర్మాణం పూర్తైనట్లు తెలుస్తోంది. త్వరలోనే రామ్ చరణ్ తన భార్యతో కలసి గృహ ప్రవేశం చేసి అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అధునాతన సదుపాయాలతో భారీగా ఖర్చు చేసి ఈ ఇంటిని నిర్మించారట. టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో చరణ్ ఇల్లు అత్యంత ఖరీదైనదిగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకోవడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. చెర్రీ ఓవైపు హీరోగా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూనే.. మరోవైపు పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. దీనికి తోడు ఉపాసన అపోలో లైఫ్ వైస్ చైర్‌ పర్సన్‌ గా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇల్లు రెడీ అయింది కాబట్టి ఇంతకాలం తల్లిదండ్రులుతో కలసి ఒకే ఇంట్లో ఉన్న రామ్ చరణ్.. భార్య ఉపాసనతో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజీకి వచ్చింది. అలానే తన తండ్రి చిరంజీవితో కలసి 'ఆచార్య' చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీని తర్వాత శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.