Begin typing your search above and press return to search.

బాస్ అల్లు అర‌వింద్ ని టేకోవ‌ర్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   13 Sep 2021 4:57 AM GMT
బాస్ అల్లు అర‌వింద్ ని టేకోవ‌ర్ చేస్తున్నాడా?
X
తెలుగులో గొప్ప‌ హోదాలో కొన‌సాగుతున్న ప‌లువురు టాప్ ప్రొడ్యూస‌ర్స్ ఇటీవ‌ల హిందీ చిత్రసీమ‌లోకి దూసుకెళుతుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. మ‌న నిర్మాత‌లు ఇప్పుడు ముంబైకి రెగ్యులర్ గా ట‌చ్ లో ఉంటున్నారు. అక్క‌డ బిగ్ షాట్స్ తో బిజినెస్ డీల్స్ ని కుదుర్చుకుంటూ భారీగా ఆర్జిస్తున్నారు. తెలుగు సినిమాల అనువాద హ‌క్కుల రూపంలో లేదా రీమేక్ ల డీల్స్ రూపంలో తెలుగు నిర్మాత‌లు చాక‌చ‌క్యంగా లాభాలు దండుకుంటున్నారు. ఇందులో బాస్ అల్లు అర‌వింద్ కి ఎంతో అనుభ‌వం ఉంది. ఆయ‌న మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో గ‌జినీ లాంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. అమీర్ కి తొలి 100 కోట్ల క్ల‌బ్ చిత్రాన్ని అందించిన తెలుగు నిర్మాత‌గా అత‌డికి బాలీవుడ్ లో గొప్ప గుర్తింపు గౌర‌వం ఉన్నాయి.

ఇటీవ‌ల బ‌న్ని న‌టించిన ప్ర‌తి సినిమాని హిందీలోకి అనువ‌దించి అత‌డిని అక్క‌డా పెద్ద స్టార్ ని చేశారు అర‌వింద్. ప‌లు రీమేక్ చిత్రాల‌తోనూ హిందీ ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇక త‌న చిర‌కాల మిత్రుడు మ‌ధు మంతెన తో క‌లిసి బాలీవుడ్ లో రామాయ‌ణం చిత్రం తీసేందుకు గట్టి ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్లు స‌హా ద‌క్షిణాది తార‌లు న‌టిస్తారు.

అయితే అర‌వింద్ స్ఫూర్తితో ఇప్పుడు అగ్ర‌నిర్మాత దిల్ రాజు హిందీ చిత్రసీమ‌లో అడుగుపెడుతున్నారు. అక్క‌డా చెప్పుకోద‌గ్గ సినిమాల్ని నిర్మిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అంత‌కంత‌కు వేడి పెంచేస్తున్నారు. ఇటీవ‌లే శంకర్ దర్శకత్వంలో జాతీయ స్థాయి ప్రాజెక్ట్ #RC15 ని ప్రారంభించారు. ఇన్నేళ్ల‌లో అల్లు అర‌వింద్ కైనా సాధ్యం కాని ఫీట్ రాజు గారికి సాధ్య‌మ‌వుతోంది. శంకర్ తో సినిమా చేయడానికి ఇప్పటి వరకు ఏ తెలుగు నిర్మాత కూడా సాహసించలేదు. అర‌వింద్ కూడా శంక‌ర్ తో సినిమా చేయ‌లేక‌పోయారు కానీ దిల్ రాజు వంద‌ల కోట్ల బ‌డ్జెట్ల‌తో సాహ‌సాలు చేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది.

చాలా అగ్ర నిర్మాణ సంస్థ‌లు బాలీవుడ్ కి పాన్ ఇండియా సినిమాల‌తోనే వెళ్లాయి.. ఆ త‌ర్వాత‌ రేసు నుండి తప్పుకున్నాయి. కానీ దిల్ రాజు అలా కాదు. బోనీక‌పూర్ లాంటి అగ్ర నిర్మాత‌తో క‌లిసి పింక్ రీమేక్ ని తెలుగులో స‌క్సెస్ చేసి ఇప్పుడు ఏకంగా హిందీలోకే అడుగుపెడుతున్నారు. దిల్ రాజు మొదటి సినిమా సిద్ధమయ్యేలోపు రెండవ బాలీవుడ్ సినిమాని తెర‌కెక్కిస్తూ హీట్ పెంచాడు. షాహిద్ కపూర్ తో జెర్సీ రీమేక్ ని నిర్మిస్తున్న దిల్ రాజు.. ఇంత‌లోనే తన రెండవ బాలీవుడ్ చిత్రాన్ని ప్రారంభించారు. రాజ్ కుమార్ రావు క‌థానాయ‌కుడిగా HIT రీమేక్ ను మొద‌లు పెట్టి షాకిచ్చారు. ఈ చిత్రంతో హిట్ ఒరిజిన‌ల్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శైలేష్ కొల‌ను బాలీవుడ్ లోనూ అడుగుపెడుతుండ‌డం ఆస‌క్తిక‌రం.

బాహుబలి తో ఆర్కా మీడియా .. ఆర్‌.ఆర్‌.ఆర్ తో డివివి ఎంట‌ర్ టైన్ మెంట్స్ బాలీవుడ్ కి ప‌రిచ‌యమైనా... వీళ్లంతా కంటిన్యూగా హిందీలో డైరెక్ట్ సినిమాలు చేయ‌డం లేదు. కానీ అందుకు భిన్నంగా అల్లు అర‌వింద్ - దిల్ రాజు వంటి వారి ఆలోచ‌న‌లను విస్త‌రించ‌డం ఆస‌క్తిక‌రం. ఒక ర‌కంగా త‌మ సీనియారిటీని అనుభ‌వాన్ని పెట్టుబ‌డిగా పెట్టి ఇత‌ర మార్కెట్ల వైపు దారులు తెరుస్తున్న వీరు అంద‌రికీ ఆద‌ర్శం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాకి ఎల్ల‌లు లేవు. స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించ‌మ‌ని వీరంతా నిరూపిస్తున్నారు.

అర‌వింద్ - దిల్ రాజు కంటే ముందే మూవీ మొఘ‌ల్స్ బాలీవుడ్ లో అడుగుపెట్టి స‌త్తా చాటారు. మూవీ మొఘ‌ల్ రామానాయుడు - డి. సురేష్ బాబు కి చెందిన సురేష ప్రొడక్షన్స్ బాలీవుడ్ లో సినిమాలు చేసినా ఇటీవ‌ల కేవ‌లం హిందీ చిత్రాల తెలుగు రీమేక్ ల కోస‌మే తాప‌త్రాయ ప‌డ‌డం క‌నిపిస్తోంది. అయితే రానా తో పాన్ ఇండియా సినిమాల్ని తెర‌కెక్కించేందుకు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రస్తుతం ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. అలాగే రానాను హిందీ స్టార్ గా ఎస్టాబ్లిష్ చేయ‌డం వ‌ర‌కూ సురేష్ బాబు వ‌ర్క‌వుట్ చేశార‌న‌డంలో సందేహం లేదు. అయితే మునుముందు ఆయ‌నా హిందీ చిత్రాల్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాలు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతానికి అక్క‌డ హిట్లు కొట్టిన చాలా సినిమాల్ని తెలుగైజ్ చేస్తూ ఇక్క‌డ విజ‌యాలు అందుకుంటున్నారు. మ‌న అగ్ర నిర్మాత‌లు మునుముందు కూడా బాలీవుడ్ స్టార్ హీరోల్ని టాలీవుడ్ టాప్ హీరోల‌తో క‌లిపి యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న సినిమాల‌తో దేశ‌వ్యాప్తంగా వినోదం పంచుతార‌నే ఆకాంక్షిద్దాం.