Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా.. ద‌ర్శ‌కుడు అత‌డే..?

By:  Tupaki Desk   |   8 March 2021 6:50 AM GMT
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా.. ద‌ర్శ‌కుడు అత‌డే..?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప‌తో య‌మా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ ను ఆగ‌స్టులో ప్లాన్ చేసిన ద‌ర్శ‌కుడు సుకుమార్‌.. శ‌ర‌వేగంగా షూటింగ్‌ చేస్తున్నాడు. బ‌న్నీ కెరీర్లోనే తొలి పాన్ ఇండియ‌న్ మూవీ అయిన ఈ సినిమాను.. దాదాపు 170 కోట్ల భారీ వ్య‌యంతో తెర‌కెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత‌లు.

ఇప్ప‌టికే రాజ‌మండ్రి స‌మీపంలోని మారేడు మిల్లి అడ‌వుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్‌.. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులోని తెన్కాసిలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతోంది. ఈ సినిమాలో గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ గా, మొర‌టు వ్య‌క్తిగా క‌నిపించ‌బోతున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత‌.. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఆచార్య పూర్త‌యిన త‌ర్వాత బ‌న్నీ మూవీ స్క్రిప్టుపై కూర్చోనున్నాడు కొర‌టాల‌.

ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ ఎవ‌రితో ప‌నిచేయ‌నున్నాడు అనే విష‌యం ఇంకా తెలియ‌లేదు. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి లైన్లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. గౌత‌మ్ తో సినిమా చేయడానికి బ‌న్నీ కూడా ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే గౌత‌మ్ ఫుల్ స్క్రిప్టు సిద్ధం చేశాడ‌ని, త్వ‌ర‌లోనే వినిపించ‌బోతున్నాడ‌ని టాక్‌. బ‌న్నీకి న‌చ్చితే రాబోయే దిపావ‌ళికే సినిమా ప్రారంభ‌మైనా ఆశ్చ‌ర్యం లేద‌ట‌.

మాంచి ఎమోష‌న‌ల్ బ్యాక్ డ్రాప్ తో క‌థ సిద్ధం చేశాడ‌ట ద‌ర్శ‌కుడు. మ‌రి, ఇది విన్న త‌ర్వాత బ‌న్నీ ఏమంటాడో చూడాలి. ప్ర‌స్తుతం గౌత‌మ్ త‌న‌ జెర్సీ రీమేక్ లో ఉన్నాడు. హిందీలో షాహిద్ క‌పూర్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. బ‌న్నీతో సినిమా క‌నుక ఓకే అయితే.. జెర్సీ రీమేక్ పూర్త‌యిన‌ త‌ర్వాత.. ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.