Begin typing your search above and press return to search.

మ‌ర‌ణం పైనా ఇంత‌ చౌక‌బారుత‌నమా?

By:  Tupaki Desk   |   3 Nov 2021 4:21 AM GMT
మ‌ర‌ణం పైనా ఇంత‌ చౌక‌బారుత‌నమా?
X
ఈ భూమ్మీద ఎవ‌రికి ఎప్పుడు నూకలు చెల్లిపోతాయో ఎవ‌రూ ఊహించ‌లేరు! ఎవ‌రి టైమ్ వ‌స్తే వారు వెళ్లాల్సిందే!! క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణానంత‌రం ప‌లువురు స్టార్లు ప్ర‌వ‌చించిన వేదం ఇది. జీవితం మ‌రీ ఇంత వేగంగా ముగుస్తుందా? అంటూ ఆశ్చ‌ర్య‌పోయిన స్టార్లు ఉన్నారు. ఇత‌ర‌ తార‌ల‌తో ఫోన్ సంభాష‌ణ చేస్తూ లైఫ్ స్పాన్ పై సుదీర్ఘ ముచ్చ‌ట్లాడి నిర్వేదానికి గుర‌య్యారు.

అయితే సాటి స్టార్ పునీత్ రా జ్‌కుమార్ అకాల మరణంపై త‌మిళుల దుగ్ధ గురించి దేశ‌వ్యాప్తంగా డిబేట్ మొద‌లైంది. నిజానికి పునీత్ ఆక‌స్మిక మ‌ర‌ణం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. టాలీవుడ్ నుంచి అత‌డి స్నేహితులంతా బెంగ‌ళూరు కంఠీర‌వ స్టూడియోస్ కు వెళ్లి అంతిమ సంస్కారాల‌కు హాజ‌రై నివాళుల‌ర్పించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి- న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌- కింగ్ నాగార్జున‌- విక్ట‌రీ వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ స్టార్ల‌తో పాటు.. జూనియర్ ఎన్టీఆర్- అల్లు అర్జున్ - ద‌గ్గుబాటి రానా త‌దిత‌ర‌ ప్రముఖులు పునీత్ పార్థివ దేహానికి తుది నివాళులర్పించారు.

తెలుగు సినీప‌రిశ్ర‌మ త‌ప్ప ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు అంత‌గా స్పందించ‌లేదు. ముఖ్యంగా త‌మిళ హీరోల్లో ఒక్క శివ‌కార్తికేయ‌న్ మాత్ర‌మే బెంగ‌ళూరుకు వెళ్లి పునీత్ పార్థీవ దేహానికి నివాళుల‌ర్పించారు. పునీత్ మృతిపై తమిళ హీరోల్లో పెద్ద హీరోలు ఎవ‌రూ స్పందించ‌లేదు. స్టార్ హీరోలు అజిత్- విజ‌య్ - విజ‌య్ సేతుప‌తి- విక్ర‌మ్ స‌హా ఎవ‌రూ స్పందించ‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటో అర్థం కాలేదు.

కానీ దీనివెన‌క రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు. కర్నాట‌క - త‌మిళ‌నాడు మ‌ధ్య కావేరీ జ‌లాల పంపిణీ వివాదం ఎంత పెద్ద కార్చిచ్చును రాజేసిందో తెలిసిందే. ఆ క్ర‌మంలోనే త‌మిళ స్టార్లు క‌న్న‌డ స్టార్ కి అంతిమ నివాళిని ఇచ్చేందుకు వెళ్ల‌లేదు అన్న చ‌ర్చ సాగుతోంది. నిజానికి చావును రాజ‌కీయంతో ముడి వేసి ఆలోచించ‌డం స‌రైన‌దేనా? అంత పెద్ద స్టార్లు దీనిని రాజకీయ కోణంలో చూశారా? అంటూ సోష‌ల్ మీడియాల్లో అభిమానులు నిర్వేదం చెందుతున్నారు.

ఇక విశాల్ లాంటి స్టార్ మాత్ర‌మే పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణానికి తీవ్రంగా క‌ల‌త చెందిన‌ట్టు క‌నిపించింది. 1800 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే పునీత్ విద్యా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని విశాల్ ప్రతిజ్ఞ చేశాడు. ఇప్ప‌టికే త‌మిళ‌నాట క‌ష్ట కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచిన విశాల్ తన ప్ర‌తిజ్ఞ‌ను నిజంగానే నెర‌వేరుస్తాడ‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. ఇక‌ ఇత‌ర‌ అగ్ర తారలు బెంగళూరుకు మర్యాదపూర్వకంగా కూడా బెంగ‌ళూరు కంఠీర‌వ స్టూడియోస్ కి వెళ్లలేదు. ఇది అహేతుక‌మైన చ‌ర్య అంటూ ప‌లువురు తూర్పార‌బెడుతున్నారు.

ఇక రాఘ‌వ లారెన్స్ త‌మిళ‌నాట ఎన్నో స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఆయ‌న కూడా ఎందుక‌నో పునీత్ మ‌ర‌ణంపై స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి అప్ప‌టికే ఆరోగ్యం నిల‌క‌డ‌గా లేక‌పోవ‌డంతో చికిత్స కోసం ఆస్ప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే.