Begin typing your search above and press return to search.

కల్కి మీద కాపీ వివాదం ?

By:  Tupaki Desk   |   21 Jun 2019 4:21 AM GMT
కల్కి మీద కాపీ వివాదం ?
X
యాంగ్రీ మెన్ రాజశేఖర్ హీరోగా రూపొందిన కల్కి వచ్చే వారం 28న విడుదల కానుంది. గరుడవేగా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో దీని మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. అ! తో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ వర్మ దీనికి మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా ఈ నెలలో పెద్ద కమర్షియల్ మూవీగా ట్రేడ్ సైతం దీని మీదే ఆశలు పెట్టుకుంది. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న తరుణంలో కాపీ వివాదం వచ్చేసింది.

కార్తికేయ అనే రైటర్ కం డైరెక్టర్ కల్కి కథ నాదే అంటున్నాడు. ఈయన గతంలో ఇదే రాజశేఖర్ తో మహంకాళి అనే సినిమా తీశాడు. అది వచ్చిందో పోయిందో ఎవరికి గుర్తులేదు కానీ యుట్యూబ్ లో అఫీషియల్ మూవీ అందుబాటులో ఉంది. ఆ టైంలోనే కల్కి స్టోరీ లైన్ చెప్పి స్క్రిప్ట్ తో సహా హీరోకు ఇచ్చాడట. అయితే బడ్జెట్ ఎక్కువ డిమాండ్ చేస్తోంది కాబట్టి చేయలేమని చెప్పడంతో సైలెంట్ అయ్యాడు కార్తికేయ. ఇదంతా 2009 నాటి ఇన్సిడెంట్

కట్ చేస్తే కల్కి ప్రమోషన్స్ ట్రైలర్ చూసాక కార్తికేయకు కొన్ని మార్పులు చేసిన తన కథే అని అర్థమైపోయింది. వెంటనే నిర్మాతలను టీమ్ ను సంప్రదించే ప్రయత్నం చేయగా ఎవరూ స్పందించడం లేదు. ఛాంబర్ లో 2009లోనే తన కథ రిజిస్టర్ అయ్యిందని తన వద్ద ఆధారాలు ఉన్నాయని గట్టిగా చెబుతున్నాడు కార్తికేయ. కల్కి యూనిట్ మాత్రం ఇదో వెబ్ సైట్ నుంచి కొన్న కథని లింక్ పంపించారు. తీరా అది పని చేయడం లేదట. ఇదీ కార్తికేయ వెర్షన్

ఇప్పుడు నాకు న్యాయం చేయమని కార్తికేయ అసోసియేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటి వివాదాలు పరిశ్రమలో కొత్త కాదు కానీ ఇది రచ్చకు ఎక్కకముందే సెటిల్ చేసుకోవడం మంచిది. అందులోనూ స్టార్ హీరో సినిమానాయే. లేనిపోని కామెంట్స్ వస్తాయి. నిర్మాత సి కళ్యాణ్ హీరో రాజశేఖర్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంకా దీని గురించి ఏమి స్పందించలేదు