Begin typing your search above and press return to search.

ప్రేక్షకుల మైండ్‌ సెట్‌ తో గందరగోళంలో నాని..?

By:  Tupaki Desk   |   14 Jun 2022 10:57 AM GMT
ప్రేక్షకుల మైండ్‌ సెట్‌ తో గందరగోళంలో నాని..?
X
ఇటీవల కాలంలో నేచురల్ స్టార్ నాని ఏది మాట్లాడినా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడు లేటెస్టుగా 'అంటే సుందరానికి' ఈవెంట్ లో 'మనం ఎలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలనే దానిపై క్లియర్ గా ఉండాలి' అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

నాని - నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంటే.. సుందరానికీ' సినిమా శుక్రవారం (జూన్ 20) థియేటర్లోకి వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ రోమ్ కామ్.. దానికి తగ్గట్టుగా వసూళ్ళు రాబట్టకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అందుకే ఈవెంట్ లో నాని పై విధంగా కామెంట్ చేశారు.

నాని మాట్లాడుతూ.. ''బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరుపుతున్నామని బ్యానర్ పెడితే.. రిలీజై మూడు రోజులే కదా అయింది అనుకోవచ్చు. కానీ మేము లెక్కేసేది నెంబర్స్ ను కాదు.. ప్రేక్షకుల ప్రేమను.. వాళ్ల హార్ట్స్ ను కౌంట్ చేస్తున్నాము. సినిమా చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేసే తీరును చూసి.. మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాళ్లు చూపించే ప్రేమను కొలమానంగా చూసుకుంటే, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్టే. ఇది మనందరం సెలబ్రేట్ చేసుకోవలసిన సినిమా. నా కెరియర్లో ఎప్పుడైనా వెనుదిరిగి చూసుకుంటే.. గొప్ప సినిమాల జాబితాలో ఈ చిత్రం ఉంటుంది'' అని అన్నారు.

''ఒక మంచి సినిమా తీసినప్పుడు మాస్ మూవీ రేంజ్ లో కలెక్షన్స్ ఉండవని.. ఒక మాస్ సినిమా చేసినప్పుడు మంచి సినిమా ఎప్పుడు చేస్తారు? అని అంటారు. ఎలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలనే దానిపై మనం క్లియర్ గా ఉండాలి. కేవలం కంప్లైంట్ చేయడమే కాదు.. మంచి సినిమా వచ్చినప్పుడు దానిని భుజాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్తే.. తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగుల్లో మనమంతా భాగమవుతాం'' అని నాని పేర్కొన్నారు.

దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకుంటే ఆడియన్స్ ను నిందించడం ఎంతవరకు సమంజసమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్లనే అన్ని వర్గాల ఆడియన్స్ కు సినిమా రీచ్ కాలేదని మరికొందరు అంటున్నారు.

రాంగ్ టైంలో రిలీజ్ చేసారని.. మాస్ సినిమాల హవా నడుస్తున్న ప్పుడు ఇలాంటి క్లాస్ మూవీని తీసుకురావడం కరెక్ట్ కాదనే అభిప్రాయాకు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా నాని కామెంట్స్ ని బట్టి, ప్రేక్షకుల మైండ్‌ సెట్‌ ని చూసి నిరుత్సాహపడటమే కాదు.. కాస్త గందరగోళానికి గురైనట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే నాని 'ఎంసీఏ' 'నేను లోకల్' వంటి కమర్షియల్ సినిమాలతో సూపర్‌ హిట్‌లను అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. అయితే నాని ఎప్పుడూ రొటీన్ సినిమాలనే చేస్తున్నాడని విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ - జెర్సీ, నాని 'వి' 'శ్యామ్ సింఘరాయ్' 'అంటే సుందరానికి' వంటి వైవిధ్యమైన సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కానీ ఈ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్స్ మాత్రం నిరాశ పరుస్తున్నాయి.

'శ్యామ్ సింగరాయ్' మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ లెక్కల పరంగా యావరేజ్ గా మిగిలిపోయింది. ఇప్పుడు 'అంటే సుందరానికి' సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం టాక్ కు అసలు సంబంధం లేకుండా ఉన్నాయి.

హిట్లు సూపర్ హిట్లు అందుకున్నప్పుడు నాని మూస సినిమాలు చేస్తున్నాడని విమర్శించారు. కానీ ఇప్పుడు సెన్సిబుల్ మూవీస్ చేయడం మొదలుపెట్టాక.. 'ఎంసీఏ' వసూళ్లతో కంపేర్ చేస్తున్నారు. సెన్సిబుల్ మరియు మాస్ సినిమాల మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌ తో నాని రాబోయే చిత్రంతో ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో వేచి చూడాలి.