Begin typing your search above and press return to search.

'పఠాన్‌' వీఎఫ్‌ఎక్స్ 'ఆదిపురుష్' కంటే దారుణమా..?

By:  Tupaki Desk   |   3 Nov 2022 7:30 AM GMT
పఠాన్‌ వీఎఫ్‌ఎక్స్ ఆదిపురుష్ కంటే దారుణమా..?
X
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ''పఠాన్‌'' టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్ర స్థానంలో ట్రెండ్ అవుతోంది. కింగ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకూ 18 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే 1 మిలియన్ కు పైగా లైక్స్ సాధించి బాలీవుడ్ టీజర్స్ లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ ను ఒక స్టైలిష్ యాక్షన్ రోల్ లో చూడటం.. హై-ఆక్టేన్ యాక్షన్ మూవీతో తిరిగి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. 'పఠాన్‌' టీజర్ లోని వీఎఫ్‌ఎక్స్‌ పై నెట్టింట ఓ వర్గం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విజువల్స్ నాసిరకంగా ఉన్నాయని.. కొన్ని షాట్స్ లో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ మరీ దారుణంగా ఉన్నాయని స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వందల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ, నాణ్యమైన అవుట్ ఫుట్ అందించలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటిన్నర నిమిషాల టీజర్ లోనే వీఎఫ్‌ఎక్స్‌ ఇలా ఉంటే.. రెండున్నర గంటల పూర్తి సినిమాలో విజువల్స్ ఏ స్థాయిలో ఉంటాయో అని సెటైర్స్ వేస్తున్నారు. ఇటీవల 'ఆదిపురుష్' ను ట్రోల్ చేసిన బాలీవుడ్ క్రిటిక్స్.. ఇప్పుడు 'పఠాన్' గ్రాఫిక్ వర్క్ పై మాట్లాడరేం అని ప్రశ్నిస్తున్నారు.

డిజిటల్ యుగంలో టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు వరల్డ్ క్లాస్ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి లాంటి దర్శకులు వెండితెర మీద విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన తర్వాత.. సినీ ప్రియులు అదే స్థాయిలో వీఎఫ్‌ఎక్స్‌ ఉండాలని ఆశిస్తున్నారు. అందుకే ఏమాత్రం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోయినా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇటీవలి 'బ్రహ్మాస్త్ర: శివ' సినిమా VFX మరియు CGI విషయంలో నెట్టింట విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అలానే 'ఆది పురుష్' టీజర్ పైనా విమర్శలు వచ్చాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని పెట్టుకొని... 450 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసిన ఇలాంటి నాసిరకమైన విజువల్స్ అందించారని వ్యాఖ్యానించారు. అయితే ఇది మొబైల్స్ - టీవీల వంటి స్మాల్ స్క్రీన్స్ పై చూసే సినిమా కాదని.. బిగ్ స్క్రీన్ మీద 3డీలో చూస్తే ఆ అనుభూతి వేరేలా ఉంటుందని వివరణ ఇచ్చారు.

ఇప్పుడు లేటెస్టుగా షారుక్ ఖాన్ 'పఠాన్' సినిమా కూడా ఈ లిస్టులో చేరిపోయింది. ఇందులో కొన్ని షాట్స్ చూస్తే.. సౌత్ లో రూపొందే కొన్ని లో బడ్జెట్ చిత్రాల్లోని వీఎఫ్ఎక్స్ మెరుగ్గా ఉన్నాయనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అవన్నీ ఎడిటింగ్ చేసిన పిక్స్ అని.. కావాలని షారుక్ ను టార్గెట్ చేయడానికి ఇలా చేస్తున్నారని కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

ఏదేమైనా ఒకప్పుడు ప్రపంచ స్థాయి సినిమాలు తీస్తున్నామని గొప్పలు చెప్పుకునే బాలీవుడ్.. ఇటీవల కాలంలో సాంకేతికత పరంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఓవైపు దక్షిణాది నుంచి కంటెంట్ మరియు విజువల్ గ్రాండియర్ సినిమాలు తీస్తుంటే.. హిందీ పరిశ్రమ మాత్రం మంచి వీఎఫ్ఎక్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ తో కూడిన చిత్రాలను అందించడంలో ఫెయిల్ అవుతోందని కామెంట్స్ వస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.