Begin typing your search above and press return to search.

# RC15 `ఒకే ఒక్క‌డు` సీక్వెలా ఇది?

By:  Tupaki Desk   |   31 March 2021 3:51 AM GMT
# RC15 `ఒకే ఒక్క‌డు` సీక్వెలా ఇది?
X
ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌లో రాజ‌కీయ అవ్య‌వ‌స్థ గురించి తెలిసిన‌దే. స‌మాజాన్ని బాగు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డాల్సిన రాజ‌కీయాలు స్వార్థ‌పూరిత ప్ర‌యోజ‌నాల కోసం సామాన్య ప్ర‌జ‌ల‌పై పెత్త‌నం చెలాయించేందుకు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌న్న అభిప్రాయం ఉంది. అంతా అవినీతిమ‌యం. రాజ‌కీయం అధికారులు ఒకే దారిలో ఉన్నారు. అయితే ఈ వ్య‌వ‌స్థ‌ను ఇలానే వ‌దిలేస్తే .. సంఘంలో ఉన్న ఐఏఎస్ లు ఎందుకు? అస‌లు ముఖ్య‌మంత్రి అనేవాడే ఎందుకు? ఎవ‌రి స్వార్థానికి వారు దోచుకు తిన‌డ‌మే ధ్యేయంగా బ‌తికేసి జ‌నాల్ని భృష్ఠుప‌ట్టిస్తే దానిని చూస్తూ ఊరుకోవాలా?

# RC15 క‌థాంశం కాస్త అటూ ఇటూగా ఇలానే ఉంటుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ యువ ఐఏఎస్ గా క‌నిపిస్తార‌ని.. ఆ త‌ర్వాత అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి రాజకీయ వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యతను తీసుకునే యువ ముఖ్యమంత్రి అవుతారని తెలుస్తోంది‌. కాన్సెప్ట్ వింటుంటేనే రోమాలు నిక్క‌బొడిచే విధంగా ఉంది.

అయితే ఇంత‌కుముందు యువ ముఖ్య‌మంత్రి కాన్సెప్ట్ తో చాలా సినిమాలొచ్చాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన నోటా ఈ త‌ర‌హానే. కానీ అవ‌న్నీ జూనియ‌ర్ ద‌ర్శ‌కుల సినిమాలు. ఇప్పుడు సీనియ‌ర్ అయిన ది గ్రేట్ శంక‌ర్ విజ‌న్ నుంచి పుట్టుకొచ్చిన క‌థ‌తో తెర‌కెక్కుతోంది. ఇక విజువ‌ల్ గ్రాండియారిటీ ప‌రంగా కానీ.. సామాజిక రాజ‌కీయాంశాల్ని ట‌చ్ చేసే వైనం కానీ ఓ లెవ‌ల్లోనే తెర‌పై పండుతాయ‌న‌డంలో ఎలాంటి సందేమం లేదు. ఇక గ‌ల్లీలో డ‌ప్పు కొట్టి అమ్మోరి ముందు డ్యాన్సులాడే మాస్ జ‌నానికి కూడా క‌నెక్ట‌య్యేలా.. ప‌ల్లె ప‌ల్లెనా ప్ర‌తి ఒక్క‌రికీ అర్థ‌మ‌య్యేలా ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో ఇలాంటి సినిమాల్ని మ‌ల‌చ‌డంలోనూ శంక‌ర్ గ‌త నైపుణ్యం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అందుకే ఇప్పుడు చ‌ర‌ణ్ ని సీఎంగా చూపిస్తారంటేనే ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌కుముందు యాక్ష‌న్ కింగ్ అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఒకే ఒక్క‌డు ఈ సంద‌ర్భంగా స్ఫుర‌ణ‌కు వ‌స్తుంది. అయితే చ‌ర‌ణ్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు నేటి స‌న్నివేశానికి క‌నెక్టివిటీ ఇస్తూ శంకర్ ఒకే ఒక్క‌డు సీక్వెల్ త‌ర‌హా క‌థాంశాన్ని రెడీ చేస్తున్నారా? అంటూ లాజిక్ వెతుకుతున్నారు.

నిజానికి చ‌ర‌ణ్ కుటుంబ నేప‌థ్యంలో రాజ‌కీయం ఉంది. త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ముఖ్య‌మంత్రి అవ్వాల‌న్న క‌సితో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి ప్ర‌స్తుత కుతంత్రాల రాజ‌కీయ వ్య‌వస్థ‌ను ఢీకొట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ముఖ్య‌మంత్రి క‌ల‌లు నెర‌వేర‌లేదు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీని జాతీయ కాంగ్రెస్ లో విలీనం చేశారు. దానిపై బోలెడ‌న్ని విమ‌ర్శ‌లొచ్చాయి. అయితే ఇప్పుడు చ‌ర‌ణ్ రాజ‌కీయ నాయ‌కుడిగా అందునా సీఎం పాత్ర‌లో క‌నిపిస్తారు అంటే అది ర‌క‌ర‌కాలుగా డిబేట్ కి తెర తీస్తుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. క‌నీసం త‌న‌యుడిని సీఎంగా తెర‌పై చూసుకునే అవ‌కాశం చిరుకి క‌లుగుతుంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తాయన‌డంలో సందేహ‌మేం లేదు. జ‌న‌సేన పార్టీని స్థాపించి ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో ఉండ‌డంతో శంక‌ర్ - రామ్ చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో పెద్ద డిబేట్ కి తెర తీసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.