Begin typing your search above and press return to search.

ఏంటీ.. '139 మంది రేప్ కేసు' పై సినిమా తీస్తున్నారా...?

By:  Tupaki Desk   |   1 Sep 2020 4:00 PM GMT
ఏంటీ.. 139 మంది రేప్ కేసు పై సినిమా తీస్తున్నారా...?
X
ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా '139 మంది రేప్ కేసు' సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనపై 139 మంది 5వేల సార్లు అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిలో బుల్లితెర యాంకర్ ప్రదీప్ మరియు నటుడు కృష్ణుడు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సంచలనంగా మారిన ఈ కేసుపై అందరూ ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో ఈ కేసుపై అనేక కథనాలు వెలువడుతూ వచ్చాయి. అయితే ఇదే సమయంలో ఆ యువతి మీడియా ముందుకు వచ్చి అదంతా అబద్ధమని.. ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతోన్న వ్యక్తి బలవంతం మేరకు ఈ కేసులు పెట్టానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు '139 మంది రేప్ కేసు' ని కథా వస్తువుగా ఎంచుకొని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాగా తీయాలని ప్లాన్ చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా, రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుస పెట్టి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సమయాన్ని కూడా అనుకూలంగా మార్చుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ఓపెన్ చేసి సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే 'క్లైమాక్స్' 'నగ్నం' 'థ్రిల్లర్' 'పవర్ స్టార్' అనే సినిమాలు రిలీజ్ చేసిన వర్మ.. 'మర్డర్' అనే సినిమాని విడుదలకు సిద్ధం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తీయడంలో సిద్ధహస్తుడైన వర్మ 'మర్డర్' సినిమాని మిర్యాలగూడ అమృత - ప్రణయ్‌ - మారుతీరావు ఉదంతాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించాడు. ఈ క్రమంలో ఇప్పుడు సంచలనం రేపిన '139 మంది రేప్ కేసు' పై వర్మ కన్నుపడిందని తెలుస్తోంది. ఈ 139 మందిలో టీవీ, సినీ, జర్నలిజం, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఉండటం వల్ల ఈ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చని వర్మ భావిస్తున్నారట. స్టోరీ లేకుండానే సినిమా తీసే వర్మకు ఇప్పుడు ఇదే పెద్ద స్టోరీ అనిపించేదేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే రామ్ గోపాల్ వర్మ దీనిపై ట్వీట్ చేసే వరకు ఆగాల్సిందే.