Begin typing your search above and press return to search.

ఏంట‌య్యా ఇది.. చిన్న సినిమాల్ని చంపేయ‌డం కాక‌పోతే..!

By:  Tupaki Desk   |   10 April 2021 5:33 AM GMT
ఏంట‌య్యా ఇది.. చిన్న సినిమాల్ని చంపేయ‌డం కాక‌పోతే..!
X
కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే థియేటర్లలోకి వచ్చిన సినిమాలకు ప్రజాదరణ లభించడంతో టాలీవుడ్ కు నూతనోత్సాహం వచ్చినట్లైంది. అందరూ వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేశారు. ఒక వారం గ్యాప్ లో ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరో త‌మ సినిమాల విడుద‌ల తేదీల‌ను అనౌన్స్ చేసేశారు. అందరూ రిలీజ్ డేట్స్ ఇస్తున్నారు మనం కూడా ఒక కర్చీఫ్ వేసి పెడితే పోయేదేముంది అన్నట్లు సినిమా కంప్లీట్ అవుతుందో అని ఆలోచించుకోకుండా ప్రకటించారు. దీన్ని డైరెక్టర్ మారుతి త‌న‌దైన శైలిలో సెటైర్స్ వేస్తూ త‌న సినిమా రిలీజ్ డేట్ మీద క‌ర్చీఫ్ వేసుకున్నాడు కూడా. ఆ స‌మ‌యంలో ఇదో హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు పరిస్థితుల రీత్యా చాలా సినిమాల విడుదల తేదీలు మార‌బోతున్నాయ‌నే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇండియా మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అనేక పాన్ ఇండియా సినిమాల రిలీజులు అనుకున్న ప్ర‌కారం జరిగే ప‌రిస్థితి లేదని అంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్' దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చూస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ మారే అవ‌కాశం ఉంద‌ని.. ఉగాది రోజున ఈ సినిమా మేకర్స్ ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ విష‌యాన్ని చెబుతారని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రాన్ని వేసవిలో మే 13న విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు రిలీజ్ వాయిదా వేసుకొని, ఆగ‌స్ట్ నెలలో రావాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

సుకుమార్ - అల్లు అర్జున్ కలిసి చేస్తున్న 'పుష్ప' చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇంకా చాలా షూటింగ్ మిగిలి ఉందటం.. కోవిడ్ నేపథ్యంలో శరవేగంగా షూట్ చేయడం సాధ్యమవుతుందో లేదో అని 'పుప్ప' ను కూడా వాయిదా వేస్తారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఇయర్ ఎండింగ్ లేదా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రావ‌చ్చని అంటున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమా రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే ఇలా పెద్ద సినిమాలన్నీ ముందుగా డేట్స్ లాక్ చేసుకొని పెట్టుకుని.. ఇప్పుడు వాయిదా వేసి తదుపరి డేట్స్ ని ప్రకటిస్తే చిన్న సినిమాలకు ఇబ్బందిగా మారుతుంది. దీంతో రిలీజ్ డేట్లు దొర‌క్క స‌రైన పబ్లిసిటీ చేయ‌లేక చిన్న సినిమాల వారు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇప్పటికే దాదాపు 100 సినిమాలు విడుద‌ల అవ్వ‌క లాబ్ లోనే మ‌గ్గిపోతున్నాయని తెలుస్తోంది.