Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేస్‌.. థియేట‌ర్ల లెక్క తేలుతుందా?

By:  Tupaki Desk   |   7 Dec 2022 11:30 PM GMT
సంక్రాంతి రేస్‌.. థియేట‌ర్ల లెక్క తేలుతుందా?
X
2023 సంక్రాంతి స‌మ‌రం మొద‌లు కాబోతోంది. అప్పుడే టాలీవుడ్ లో సంద‌డి కూడా మొద‌లైంది. ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరోలు నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి 'వీర సింహారెడ్డి', 'వాల్తేరు వీర‌య్య' చిత్రాల‌తో సంక్రాంతి బ‌రిలో పోటీకి సై అంటున్నారు. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్ ల సినిమాల రిలీజ్ డేట్ ల‌ని ప్ర‌క‌టించేశారు. బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర సింహారెడ్డి' జ‌న‌వ‌రి 12న విడుద‌ల కాబోతుండ‌గా.. చిరంజీవి 'వాల్తేరు వీర‌య్య జ‌న‌వ‌రి 13న రాబోతోంది.

పండ‌గ సీజ‌న్ కావ‌డంతో ఈ రెండు తెలుగు సినిమాల‌తో పాటు మ‌రో రెండు త‌మిళ సినిమాలు విజ‌య్ 'వార‌సుడు', అజిత్ 'తునీవు'(తెగింపు) తెలుగు సినిమాల‌కు పోటీగా టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాయి. దీంతో తెలుగు సినిమాల‌కు అనుకున్న స్థాయిలో థియేట‌ర్లు ల‌భించే అవ‌కాశం లేద‌ని, ఇప్ప‌టికే 'వార‌సుడు' కోసం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్ రాజు ప‌లు కీల‌క థియేట‌ర్ల‌ని బ్లాక్ చేశాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

అది గ‌మ‌నించిన లుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ఓ ప్ర‌క‌ట‌న చేసింది. సంక్రాంతి, ద‌స‌రా పండ‌గ సీజ‌న్ ల‌లో తెలుగు సినిమాల‌కే ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌ని ప్ర‌త్యేకంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీనిపై భిన్నాభిప్ర‌యాలు వ్య‌క్తం కావ‌డం తెలిసిందే. అల్లు అర‌వింద్ ఒక‌లా.. సి. అశ్వ‌నీద‌త్ మ‌రోలా స్పందించారు. ఆ త‌రువాత త‌మిళ ప్రొడ్యూస‌ర్స్ తెలుగు నిర్మాత‌ల మండ‌లి నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు. డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్లు కేటాయించ‌నివ్వ‌రా? అంటూ మండిప‌డ్డారు.

అయితే దీనిపై రీసెంట్ గా ఓ న్యూస్ ఛాన‌ల్ తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. 'వార‌సుడు' వ‌ల్ల తెలుగు సినిమాల‌కు థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్త‌డం లేద‌ని, తాను 'వార‌సుడు' రిలీజ్ ని ముందే ప్ర‌క‌టించాన‌ని, తాను ప్ర‌క‌టించిన నెల‌ల త‌రువాతే మిగ‌తా సినిమాలు సంక్రాంతి వ‌స్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించాయ‌ని, ఇందులో త‌న‌ది త‌ప్పులేద‌ని దిల్ రాజు తెలివిగా స్పందించాడు. ఇదిలా వుంటే 'వార‌సుడు'తో పాటు దిల్ రాజు అజిత్ మూవీ 'తునీవు'ని కూడా రిలీజ్ చేస్తుండ‌టం హాట్ టాపిక్ గా మారుతోంది.

అంతే కాకుండా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌ల‌ని బ‌ట్టి దిల్ రాజు తాను రిలీజ్ చేస్తున్న 'వార‌సుడు' కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గ‌త మెయిన్ థియేట‌ర్ సంధ్యా 35 ఎం.ఎంని, 'తునీవు'కు దేవి థియేట‌ర్ ని బ్లాక్ చేసేశాడ‌ట‌. దీంతో చిరు వాల్తేరుకు, బాల‌య్య 'వీర‌సింహారెడ్డి'కి కీల‌క థియేట‌ర్లు ద‌క్క‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

వీటికే థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్ట‌మంటుంటే యువీ వారు సంతోష్ శోభ‌న్ న‌టించిన 'క‌ల్యాణం క‌మ‌నీయం'ని కూడా దించేస్తున్నార‌ట. దీంతో మొత్తం సంక్రాంతి బ‌రిలో ఐదు సినిమాలు పోటీప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ పోటీలో ఏ సినిమాకు ఎన్ని థియేట‌ర్లు మొత్తం కేటాయించారు.. అన్న‌ది జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్ లో కానీ బ‌య‌ట‌ప‌డ‌దు. అంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.