Begin typing your search above and press return to search.

మైత్రీ వారిని అదుపు చేసే ఎత్తుగ‌డేనా?

By:  Tupaki Desk   |   10 Dec 2022 8:52 AM GMT
మైత్రీ వారిని అదుపు చేసే ఎత్తుగ‌డేనా?
X
ప్ర‌తీ పండ‌క్కి ప‌ల్లెటూళ్ల నుంచి పట్నం వ‌ర‌కు జ‌నాలు చేసే హ‌డావిడీ.. హంగామా అంతా ఇంతా కాదు. ఇక సినిమాల విష‌యంలోనూ పంగ‌డ వేళ మ‌రింత ప్ర‌త్యేకంగా చూస్తుంటారు. ఆ రోజు న‌చ్చిన వాళ్ల‌తో థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూస్తూ పండ‌గ వాతావర‌ణాన్ని ఎంజాయ్ చేయాల‌ని ప‌ల్లె నుంచి ప‌ట్నం వ‌ర‌కు ఆశ‌గా ఎదురుచూడ‌ని వారంటూ వుండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. అదే పండ‌క్కి న‌చ్చిన స్టార్ల సినిమాలు పోటా పోటీగా పోటీప‌డితే స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఎటు వెళ్లాలో .. ఏ స్టార్ సినిమాకు వెళ్లాలో తేల్చుకోవ‌డం క‌ష్ట‌మే. ఇక ఇలాంటి సందిగ్ధంలో ఆర‌డ‌జ‌ను సినిమాలు సంక్రాంతికి పోటీప‌డితే ఎవ‌రి సినిమాకు కూడా హాలు హౌస్ ఫుల్ బోర్డ్ ప‌డ‌దు.

ఈ విష‌యం తెలిసి కూడా సీనియ‌ర్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు 2023 సంక్రాంతి స‌మ‌రానికి సై అంటుండ‌టం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కుడిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఒకే పండ‌క్కి ఇంత మంది పోటీప‌డ‌టం వ‌ల్ల పెద్ద‌గా ఓపెనింగ్స్ రావ‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. అయినా స‌రే నేను కూడా అంటూ సంక్రాంతి బ‌రికి పోటీప‌డుతూ పోటా పోటీగా బ‌రిలో దిగుతున్నారు. పండ‌గ సీజ‌న్ ల‌లో భారీ సినిమాలు రిలీజ్ చేస్తే సాధార‌ణ టైమ్ కంటే భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబట్టొచ్చు. ఈ ఫార్ములాని పాటిస్తూ స్టార్ హీరోల సినిమాల‌ని పండ‌గ‌ల‌కు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తుంటారు.

కానీ అదే సినిమాల‌కు ఇత‌ర సినిమాలు పోటీగా వ‌స్తే మాత్రం ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. మ‌రి ఈ విష‌యం తెలిసి కూడా చాలా వ‌ర‌కు సినిమాలు సంక్రాంతి పోటీప‌డుతుండ‌టం కావాల‌నే జ‌రుగుతున్న‌ట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మైత్రి వారిని అదుపు చేయాల‌నే ఆలోచ‌న‌లో భాగంగానే తాజా త‌తంగం అంతా జ‌రుగుతున్న‌ట్టుగా ఇన్ సైడ్ టాక్. ఈ ఎత్తుగ‌డ‌లో భాగంగానే వ‌చ్చే సంక్రాంతి ఫెస్టివెల్ కి ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాలు పోటీప‌డుతున్నాయి.

దిల్ రాజు నిర్మిస్తున్న తొలి త‌మిళ మూవీ 'వారీసు'. విజ‌య్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీని తెలుగులో 'వార‌సుడు'గా సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు ఇప్ప‌టికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కోసం అత్య‌ధికంగా కీల‌క థియేట‌ర్ల‌ని బ్లాక్ చేసి పెట్టిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీని త‌మిళ‌, తెలుగు భాష‌ల‌లో జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్నారు. దీనిపై టాలీవుడ్ లో వివాదం న‌డుస్తోంది. దీనిపై దిల్ రాజు ఇంత వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఇక‌ ఇదే రోజున నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'వీర సింహారెడ్డి'రిలీజ్ ని ప్ర‌క‌టించేశారు.

దీంతో మాస్ ప్రేక్ష‌కుల్లో హంగామా మొద‌లైంది. ఇక జ‌న‌వ‌రి 13న చిరు 'వాల్తేరు వీర‌య్య‌'రిలీజ్ డేట్ ని డిసైడ్ చేశారు. ఈ రెండు సినిమాల‌ని ఒకే సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. ఇద్ద‌రు హీరోల సినిమాల‌ని ఒకే టైమ్ లో రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న లేక‌పోయినా హీరోల వొత్త‌డి మేర‌కు త‌లొగ్గ త‌ప్ప‌లేదు. ఈ మూడు సినిమాల కంటే ముందు అజిత్ 'తునీవు' కూడా 'తెగింపు' పేరుతో జ‌న‌వ‌రి 11నే రానున్న‌ట్టుగా తెలుస్తోంది. వీటికే థియేట‌ర్ల‌ని పంచుకోవాల్సిన ప‌రిస్థితి వున్న నేప‌థ్యంలో మ‌రో రెడు చిన్న సినిమాలు కూడా సంక్రాంతి పోటీకి సైర‌న్ మోగించేశాయి.

సంతోష్ శోభ‌న్ న‌టిస్తున్న 'క‌ల్యాణం క‌మ‌నీయం' జ‌న‌వ‌రి 14న రిలీజ్ కాబోతోంది. దీన్ని యువీ క‌నెక్ట్స్ వారు నిర్మించారు. యువీ వారికున్న థియేట‌ర్ చైన్ ని ఈ సినిమాకు వాడేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల పెద్ద సినిమాలైన 'వాల్తేరు వీర‌య్య‌', 'వీర సింహారెడ్డి' చిత్రాల‌కు థియేట‌ర్స్ త‌గ్గుతాయి. ఇలా ఎందుకు చేస్తున్నారా అని ఆరా తీస్తే మైత్రీ వారిని అదుపు చేసే ఎత్తుగ‌డ‌లో ఇదొక భాగ‌మ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే తేదీని 'విద్యా వాసూల అహం' ని కూడా దించేస్తున్నారు. పండ‌గ టైమ్ లో ఈ సినిమాల‌ని ఎవ‌రి కోసం రిలీజ్ చేస్తున్న‌ట్టు అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కావాల‌నే చేస్తున్నారా? లేక ఓటీటీ కోసం, పండ‌గ సీజ‌న్ ని క్యాష్ చేసుకోవాల‌నా?.. అలా అయితే పెద్ద సినిమాల‌కు మించి ఈ సినిమాల్లో అంత స్ట‌ఫ్ వుందా? అని కొంత మంది ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. సీనియ‌ర్ హీరోల సినిమాల‌కు అడ్డంప‌డుతున్న ఈ సంక్రాంతి స‌మ‌రం ఏ మ‌లుపు తిరిగుతుందో ఎలాంటి వివాదానికి తెర తీస్తుందో వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.