Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా ఉన్నది ఫ్యాన్ వార్స్ కోసమేనా..?

By:  Tupaki Desk   |   17 Aug 2022 2:33 PM GMT
సోషల్ మీడియా ఉన్నది ఫ్యాన్ వార్స్ కోసమేనా..?
X
టాలీవుడ్ హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. తోటి నటీనటుల సినిమాలను ప్రమోట్ చేయడమే కాదు.. సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు ఆభినందించుకుంటూ తమ మధ్య ఐక్యతను చాటుకుంటుంటారు. అయితే వారి ఫ్యాన్స్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇతర హీరోల అభిమానులతో తరచుగా ఫైట్ చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. మేమూ మేమూ బాగానే ఉంటాం.. మీరే మారాలి అని హీరోలు పబ్లిక్ గా చెప్పినా సరే ఫ్యాన్స్ మాత్రం అవేమీ లెక్క చేయడం లేదు.

ఒకప్పుడు థియేటర్ల వద్ద గొడవలకు దిగే అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకుంటున్నారు. తమ హీరో గొప్ప అని చెప్పడానికి ఇతర హీరోలపై అభిమానులు నెగిటివ్ పోస్టులు పెట్టడం మనం రోజూ చూస్తున్నాం. అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ అభ్యంతరకరమైన కామెంట్స్ తో ఇతర హీరోలను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ట్విట్టర్ లో నెగెటివ్ హ్యాష్ టాగ్స్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఫ్యాన్ వార్స్ ఎక్కువ అయ్యాయనేది వాస్తవం. ఇందులో తమిళ అభిమానులు అందరి కంటే కాస్త ముందుంటారు. తంబీలు దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ సృష్టించి అవ‌త‌లి హీరోల‌ను కించ‌ప‌రుస్తూ.. జుగుప్సాక‌ర‌మైన రీతిలో అందరూ అసహ్యించుకునే విధంగా ఫ్యాన్ వార్స్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు అది తెలుగు అభిమానులకూ పాకింది.

ఇటీవల కాలంలో నందమూరి అభిమానులు vs మెగా ఫ్యాన్స్ పరస్పరం పోట్లాడుకోవడం మనం చూశాం. RRR సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ స్క్రీన్ టైమ్ గురించి ట్వీట్ వార్ జరిగింది. అలానే మహేష్ బాబు అభిమానులు వెర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. పవన్ vs ప్రభాస్ ఫ్యాన్స్..  మహేష్ - అల్లు అర్జున్ అభిమానులు.. ఇలా నిరంతరం ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్టుగా మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు హీరోల అభిమానుల మధ్య గొడవ జరగడం హాట్ టాపిక్ గా మారింది.

మెగా హీరోలైన రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఇటీవల కాలంలో ట్విట్టర్ లో వార్ జరుగుతోంది. ఇరు వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ అనేక నెగెటివ్ హ్యాష్‌ ట్యాగ్‌లతో ట్రెండ్ చేసుకుంటూ వస్తున్నారు. బన్నీ - చరణ్ అభిమానుల మధ్య చాలా గ్యాప్ ఏర్పడిందని చెప్పడానికి ఇప్పుడు తాజా వార్ నిదర్శనంగా నిలిచింది.

అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన హ్యాష్‌ ట్యాగులు సోమవారం నుండి ట్రెండింగ్‌ లో ఉన్నాయి. ఇక్కడ చెప్పడానికి కూడా ఇబ్బంది ప‌డే స్థాయిలో ఆ దిగజారుడు హ్యాష్ ట్యాగ్స్.. అశ్లీలమైన మీమ్స్‌ ఉన్నాయి. ఒకరిపై ఒకరు అసభ్యకరమైన పదజాలంతో తిట్టుకోడవడం నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయింది. ఈ దిగ‌జారుడు ట్వీట్లు విష‌యంలోనూ మ‌ళ్లీ రికార్డుల గురించి కూడా చర్చించడం గ‌మ‌నార్హం.

నిజానికి రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఇద్దరూ మెగా బ్రాండ్ తో వచ్చినప్పటికీ.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను కాపాడుకోడానికి బాగా కష్టపడుతున్నారు. అయితే వారి అభిమానులు మాత్రం రెండుగా చీలిపోయి ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ హీరోల స్థాయిని దిగజరుస్తున్నారు. మరి రానున్న రోజుల్లో అయినా ఈ అగ్లీ ఫ్యాన్ వార్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.