Begin typing your search above and press return to search.

సురేష్ బాబు లైట్ తీసుకోవ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతోందా?

By:  Tupaki Desk   |   27 Oct 2022 9:49 AM GMT
సురేష్ బాబు లైట్ తీసుకోవ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతోందా?
X
కోలీవుడ్, టాలీవుడ్ లో ఏవీఎం సంస్థ నుంచి సినిమా వ‌స్తోందంటే ప్రేక్ష‌కుల్లో వుండే ఆస‌క్తి వేరుగా వుండేది. కార‌ణం ఆ సంస్థ నుంచి వ‌చ్చే సినిమాలు నూటికి తొంబై తొమ్మిది శాతం క‌థా బ‌ల‌మున్న సినిమాలు కావ‌డం.. జ‌నం మెచ్చే సినిమాలు కావ‌డ‌మే. మ‌ళ్లీ అలాంటి న‌మ్మ‌కాన్నే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి. రామానాయుడు నిర్మించే సినిమాలు సొంతం చేసుకున్నాయి. తెలుగు ప్రేక్ష‌కుల్లో ఈ సంస్థ అన్నా, ఈ సంస్థ నిర్మించే సినిమాలన్నా ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తుంటారు.

అయితే ప్రేక్ష‌కుల్లో గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ గ‌త కొంత కాలంగా క‌ళ త‌ప్పుతోంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్ లో సినిమా అంగే మినిమ‌మ్ హిట్ గ్యారెంటీ.. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. ఒక సినిమా క‌థ‌ని ఓకే చేయాలంటే ప్ర‌తీ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని మ‌రీ అన్ని వ‌ర్గాల‌ని ఆక‌ట్టుకునే అంశాలు వున్నాయ‌న్న త‌రువాతే దివంగ‌త నిర్మాత డి. రామానాయుడు ఫైన‌ల్ చేసి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేవారు. కానీ ఇప్ప‌డు అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన 'బొబ్బిలిరాజా' సినిమాతో రామానాయుడు వార‌సుడిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సురేష్ బాబు తొలి అడుగుతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేస‌కుని ఔరా అనిపించారు. రామానాయుడు వార‌స‌త్వాన్ని త‌న‌దైన పంథాలో కొన‌సాగించే వ్య‌క్తిగా ప్ర‌శంస‌లు అందుకున్నారు. 'దృశ్యం' రీమేక్ నుంచి ఇత‌ర ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల‌తో క‌లిసి సినిమాలు నిర్మించ‌డం మొద‌లు పెట్టారు. అంత వ‌ర‌కు బాగానే వుంది. కానీ ఈ మ‌ధ్యే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి. సురేష్ బాబు లెక్క త‌ప్పుతున్న‌ట్టుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

డి. సురేష్ బాబు నిర్మాత‌గా రంగంలోకి దిగిన ద‌గ్గ‌రి నుంచి ఆయ‌న జ‌డ్జిమెంట్ కి తిరుగుండేది కాదు.. ఆ య‌న లెక్క త‌ప్పేది కాదు. కానీ ఈ మ‌ధ్య లెక్క త‌ప్పుతోందనే కాబ‌మెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు సురేష్ బాబు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌లేక‌పోయాయి. రెజీనా, నివేదా థామ‌స్ ల‌తో రూపొందించిన 'శాకిని డాకిని', శ్రీ‌సింహ హీరోగా న‌టించిన 'దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌', శివ కార్తికేయ‌న్ 'ప్రిన్స్‌' సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచి షాకిచ్చాయి.

ఇక ఇందులో 'శాకిని డాకిని', 'దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌' వంటి సినిమాల‌ని కేవ‌లం ఓటీటీల కోస‌మే నిర్మించి హ‌డావిడిగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం.. ఆ వెంట‌నే ఓటీటీల‌కు ఇచ్చేయ‌డంపై కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అభిమానులు కౌంట‌ర్లు వేస్తున్నారు.

గ‌త‌మెంతో ఘ‌న‌మైప కీర్తిని సొంతం చేసుకున్న సంస్థ నుంచి ఇలాంటి సినిమాలేంటీ అని ప్ర‌శ్న‌స్తున్నారు. అంతే కాకుండా ఓ సినిమా విష‌యంలో, మ‌రీ ముఖ్యంగా స్క్రిప్ట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునే సురేష్ బాబు లైట్ తీసుకోవ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతోందా? అని అంతా వాపోతున్నారు. 'రాజ‌మండ్రి రోజ్ మిల్క్' అయినా సురేష్ బాబు, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ పై ప్రేక్ష‌కుల్లో స‌న్న‌గిల్లుతున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.