Begin typing your search above and press return to search.

'పొన్నియిన్ సెల్వ‌న్‌' కు హైలైట్ ఆ క్యారెక్ట‌రేనా?

By:  Tupaki Desk   |   16 Sep 2022 9:12 AM GMT
పొన్నియిన్ సెల్వ‌న్‌ కు హైలైట్ ఆ క్యారెక్ట‌రేనా?
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గ‌త కొన్నేళ్ల క్రితం న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'న‌ర‌సింహా'. త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌లైన ఈ మూవీ రెండు భాష‌ల్లోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది.

సినిమా ఎంత గా పాపుల‌ర్ అయిందో అంత‌కు మించి ఈ మూవీలో నీలాంబ‌రిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ పాపుల‌ర్ అయింది. విశేషం ఏంటంటే ఈ మూవీకి ర‌జ‌నీకాంత్ క‌థ అందించారు. నీలాంబ‌రి పాత్ర‌ని 1950లో ప్ర‌ముఖ ర‌చ‌యిత క‌ల్కీ కృష్ణ‌మూరి రాసిన 'పొన్నియిన్ సెల్వ‌న్‌'లోని నందిని పాత్ర స్ఫూర్తితో రాసుకున్నార‌ట‌.

ఈ విష‌యాన్ని ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ లో వెల్ల‌డించారు ర‌జ‌నీ. దీంతో మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 30 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ ని తెర‌పైకి తీసుకురావాల‌ని మ‌ణిర‌త్నం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. గ‌తంలో రెండు సార్లు ప్ర‌య‌త్నించి ఫైనాన్షియ‌ర్ లు ముందుకు రాక‌పోవ‌డంతో త‌న ప్ర‌య‌త్నాల‌ని విర‌మించుకున్నారు. ఎట్ట‌కేల‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ఏ. సుభాస్క‌రన్ ముందుకు రావ‌డంతో మ‌ణిర‌త్నం క‌ల‌ల ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వ‌న్' ఫైన‌ల్ గా కార్య‌రూపం దాల్చింది.

చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రెండు భాగాలుగా తెర‌కెక్కిన ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ ని సెప్టెంబ‌ర్ 30న భారీ స్థాయిలో ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. అయితే త‌మిళ్ తో పోలిస్తే తెలుగులో ఈ మూవీకి పెద్ద‌గా బ‌జ్ లేదు. సినిమా రిలీజ్ కి కేవ‌లం ప‌దిహేను రోజులే వున్నా మేక‌ర్స్ నుంచి ఎలాంటి హ‌డావిడీ క‌నిపించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో ఐశ్వ‌ర్యారాయ్ పోషిస్తున్న నందిని పాత్రకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తోంది. సినిమాలో ఐశ్వ‌ర్యారాయ్ పాత్ర చాలా కీల‌కంగా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. 'న‌ర‌సింహా'లో ఈ పాత్ర‌ని స్ఫూర్తిగా తీసుకునే నీలాంబ‌రి పాత్ర‌ని సృష్టించాన‌ని ర‌జ‌నీ చెప్ప‌డంతో ఇప్ప‌డు అంద‌రి దృష్టి ఐశ్వ‌ర్యారాయ్ పాత్ర‌పై ప‌డింది. దీంతో ఐశ్వ‌ర్య పాత్ర నేప‌థ్యం కూడా ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

'పొన్నియిన్ సెల్వ‌న్ 1'లో ఐశ్వ‌ర్యా రాయ్ డ్యుయెల్ రోల్ లో క‌నిపించ‌బోతోంది. అందులో త‌న ప్రేమికుడిని త‌న క‌ళ్ల‌ముందే శిర‌ఛ్చేద‌న చేసిన ఆదిత్య క‌రికాల‌న్ పై, అత‌ని చోళ‌రాజ్యంపై ప్ర‌గ‌, ప్ర‌తీకారాల‌తో ర‌గిలిపోయే పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఈ పాత్ర 'న‌ర‌సింహ‌'లో ర‌మ్య‌కృష్ణ న‌టించిన నీలాంబ‌రి పాత్ర‌ని పోలి వుండ‌టంతో సినిమాకు ఐశ్వ‌ర్యారాయ్ పాత్ర ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.