Begin typing your search above and press return to search.

గట్టి ఎదురుదెబ్బలు తగిలింది ఆ నిర్మాతలకేనా..?

By:  Tupaki Desk   |   2 Aug 2022 4:24 AM GMT
గట్టి ఎదురుదెబ్బలు తగిలింది ఆ నిర్మాతలకేనా..?
X
పాండమిక్ తర్వాత టాలీవుడ్ లో నిర్మాతల పరిస్థితి ఏమీ బాగాలేదు. ఎవరో ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ బాక్సాఫీస్ వద్ద నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంత పెద్ద మూవీ అయినా భారీ బడ్జెట్ తో తీసినా సరే.. కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు నిర్ధాక్ష్యంగా తిరస్కరిస్తున్నారు.

మరోవైపు అధిక టికెట్ రేట్లు కూడా ఆడియన్స్ ను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలవడానికి ఇదే కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కారణాలు ఏవైతేనేం ఈ ఏడాది టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కు వరుసగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

భారీ ప్లాప్స్ వచ్చినా అగ్ర నిర్మాతలకు నష్టాన్ని పూడ్చుకునే సామర్థ్యం ఉంటుంది.. తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ చిన్న మీడియం రేంజ్ నిర్మాతల పరిస్థితి వేరు. పరాజయాలు ఎదురైతే ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. భారీ డిజాస్టర్ వస్తే ఒక్కసారిగా కిందికి పడిపోతారు. అందుకే వారిని హీరోలు ఆదుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల కాలంలో అగ్ర నిర్మాత దిల్ రాజు 'రౌడీ బాయ్స్' 'థాంక్యూ' వంటి ప్లాప్స్ అందుకున్నాడు. 'ఎఫ్ 3' కూడా కొంత మేర నష్టాలను మిగిల్చిందనే టాక్ ఉంది. హిందీలో చేసిన 'జెర్సీ' 'హిట్' సినిమాలు కూడా నిరాశ పరిచాయి. అయితే RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల దిల్ రాజు కు మంచి లాభాలే వచ్చాయి ఇబ్బంది లేకుండా పోయింది.

అలానే 'రాధేశ్యామ్' సినిమాతో యూవీ క్రియేషన్స్ వారు భారీ డిజాస్టర్ అందుకున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన 'పక్కా కమర్షియల్' మూవీ ప్లాప్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ మంచి అంచనాలు పెట్టుకున్న 'అంటే సుందరానికి' సినిమా నష్టాలనే మిగిల్చింది.

ఇలా స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ చేదు అనుభవాలనే ఎదుర్కొన్నారు కానీ.. ఇవేమీ వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి తీసుకెళ్లవు. 'ఆచార్య' సినిమాని మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా పరిగణించాలి. ఎందుకంటే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి నుంచి దర్శకుడు కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేయడంతో ఆయనే నష్టాలను భరిస్తున్నారనే టాక్ ఉంది.

ఇకపోతే ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాల నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ - శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ వంటి సంస్థలకు కూడా బాక్సాఫీస్ వద్ద ఎదురు దెబ్బలు తగిలాయి. గతేడాది 'సీటీమార్' అంటూ వచ్చిన శ్రీనివాసా చిట్టూరి.. ఇటీవల 'ది వారియర్' చిత్రంతో భారీ ప్లాప్ రుచి చూశాడు. అయితే తదుపరి ప్రాజెక్ట్ ను రామ్ పోతినేని తోనే చేస్తున్నారు కాబట్టి.. నిర్మాతకు అండగా నిలుస్తారనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్న సుధాకర్ చెరుకూరి.. ఈ ఏడాది 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' 'విరాటపర్వం' 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి మూడు ప్లాప్స్ అందుకోవాల్సి వచ్చింది. మొదటి రెండు చిత్రాలు ఎర్లీ ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా అంతో ఇంతో బయటపడ్డారు కానీ.. రామారావు తో పెద్ద షాక్ తిన్నారనే అనుకోవాలి.

ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ ని బట్టి బాక్సాఫీస్ వద్ద రామారావు భారీ పరాజయంగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఏ నిర్మాణ సంస్థకైనా బ్యాక్ టూ బ్యాక్ మూడు ప్లాప్స్ ఎదురైతే మనుగడ సాగించడం కష్టమవుతుంది. అందులోనూ నిర్మాత సుధాకర్ ఇప్పుడు 'దసరా' వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను బ్యాంక్ రోల్ చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రామారావు నిర్మాతను హీరో రవితేజ ఆదుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే బ్యానర్ లో తక్కువలోనే ఓ సినిమా చేయనున్నట్లు హామీ ఇచ్చారట. ఈ విధంగానైనా నష్టపోయిన వారికి సెటిల్ చేయాలని భావిస్తున్నారట.

ఏదేమైనా పాండమిక్ తర్వాత ప్రేక్షకు అభిరుచి మారిందనేది వాస్తవం. నిర్మాతలు దీన్ని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ ను బట్టి ఖర్చు చేయాల్సిన అవసరముంది. అవేమీ ఆలోచించకుండా సినిమాలు చేస్తే మాత్రం ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కష్టమవుతుంది.