Begin typing your search above and press return to search.

RRR హౌస్ ఫుల్స్ వెనుక అసలు రహస్యం అదేనా..?

By:  Tupaki Desk   |   23 March 2022 2:30 AM GMT
RRR హౌస్ ఫుల్స్ వెనుక అసలు రహస్యం అదేనా..?
X
ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ 'ఆర్.ఆర్.ఆర్' మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24న యూఎస్ఏ ప్రీమియర్స్ తో ఫస్ట్ టాక్ బయటకు వస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తూ అందరి దృష్టిని మరింతగా ఆకర్షించారు.

RRR సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. బుక్ మై షో వంటి ఆన్ లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా బుక్ చేసుకోవడానికి సాధారణ ప్రేక్షకులకు ఎటువంటి టికెట్స్ మిగలలేదు.

హైదరాబాద్ లోని AMB సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్లలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని మొదటి రోజు 35 కంటే ఎక్కువ షోలలో ప్రదర్శించనున్నారు. అన్ని స్క్రీన్లలో 8 వేలకు పైగా టిక్కెట్లు ఉండగా.. అందులో దాదాపు 80% టిక్కెట్లను సినిమా జనాలు మరియు వారి కుటుంబ సభ్యులకు కేటాయించారని తెలుస్తోంది.

ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి ఎన్నెన్ని ఇవ్వాలి అనే దానిపై థియేటర్ యజమానులకు ఆబ్లిగేషన్స్ ఉండటంతో.. ఫస్ట్ డే ఒక్క టికెట్ కూడా సాధారణ ప్రేక్షకులకు అమ్ముడుపోలేదు. ప్రసాద్స్ ఐమాక్స్ వంటి పలు థియేటర్లలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని తెలుస్తోంది.

రాజమౌళి తీసిన 'బాహుబలి 2' సినిమా టికెట్ల కోసం అప్పట్లో ఎంత హడావిడి జరిగిందో తెలిసిందే. అందుకే ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల్లోని ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు టిక్కెట్లను బ్లాక్ చేశారని తెలుస్తుంది. అందుకే ప్రేక్షకులకు టికెట్స్ అమ్మకుండానే షోలన్నీ హౌస్ ఫుల్స్ అవుతున్నాయని అంటున్నారు.

ఇదే కనుక నిజమైతే 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ కు ఒక రోజు ముందు అమ్ముడుపోని అనేక టిక్కెట్లను విక్రయించే అవకాశం ఉంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడిందనేది అర్థం అవుతోంది.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'RRR' అంటే తెలుగులో 'రౌద్రం రణం రుధిరం' అని.. ఇంగ్లీషులో 'రైజ్ రోర్ రివోల్ట్' అని అర్థం. ఇతర భాషల్లో కూడా RRR లెటర్స్ కు తగ్గట్టుగా టైటిల్ పెట్టారు.

డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్ - ఆలియా భట్ - ఒలివియా మోరిస్ - సముద్ర ఖని - శ్రీయా కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. 'RRR' చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.