Begin typing your search above and press return to search.

అగ్రహీరోలు మళ్లీ దూరమయ్యారా..?

By:  Tupaki Desk   |   4 Oct 2021 4:30 PM GMT
అగ్రహీరోలు మళ్లీ దూరమయ్యారా..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీ ఒకప్పుడు స్వర్ణయుగంలా గడిచింది. కానీ రాను రాను చిత్ర పరిశ్రమ ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని పలువురు సీనియర్ నటులు అంటున్నారు. నటులెందరు ఉన్నా కలిసి మెలిసి ఉండాలనే భావనతో ఎన్టీఆర్ హయాంలో సాగింది. ఆ తరువాత కొన్నేళ్లపాటు అలాగే ఉండేది. కానీ రాజకీయాలు సినీ పరిశ్రమలోకి వెళ్లడంతో నటుల మధ్య విభేదాలు వస్తున్నాయి. ఆ విభేదాలు తారాస్థాయికి చేరి వర్గాలుగా ఏర్పడుతున్నాయి. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు కార్యవర్గాన్ని ఎక్కువ శాతం ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు తలపించేలా నటుల మధ్య వైరుధ్యాన్ని పెంచుతున్నాయి. ఈ సారి జరిగే ఎన్నికలు ఇద్దరు అగ్రహీరోల మధ్య దూరాన్ని పెంచాయంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.

ఇప్పుడున్న తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు, మురళీ మోహన్ తదిరులుగా చెప్పుకుంటున్నారు. అయితే సినీ పరిశ్రమ వజ్రోత్సవాల సందర్భంగా చిరంజీవి, మోహన్ బాబు ల మధ్య వివాదం రాజుకుంది. ఆ తరువాత ఇరు కుటుంబాలు ఎక్కువగా కలుసుకోలేదు. ఫంక్షన్లలోనూ, సినిమాల్లోనూ వేర్వేరుగా కనిపించారు. అయితే కొన్నేళ్ల కిందట వీరిద్దరు కలిసిపోయారు. అంతేకాకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. దీంతో వీరి మధ్య ఉన్న దూరం తొలిగి చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటైందని భావించారు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు మళ్లీ చిరు, మోహన్ బాబుల మధ్య దూరాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఎందుకంటే చిరంజీవి వర్గం ప్రకాశ్ రాజ్ తరుపున ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆయన సినీ ఇండస్ట్రీకి కొన్నాళ్ల పాటు పెద్ద దిక్కలా మారారు. జూనియర్ ఆర్టిస్టుల సమస్యలపై మాట్లాడుతున్నారు. వారి బాగోగులను చూసుకుంటున్నారు. అవసరమైన వారికి సాయం అందిస్తున్నారు. దీంతో ఆనధికారికంగా చిరంజీవి సినీ పెద్దగా అందరూ భావిస్తున్నారు.

ఇటీవల మోహన్ బాబు 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆర్కే అడిగిన పలు ప్రశ్నలకు మోహన్ బాబు ఓపెన్ గానే సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రీలో పెద్ద దిక్కు ఎవరు..? అన్న ప్రశ్నకు 'దాసరి నారాయణ తరువాత సినిమాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. ఆయనతోనే పోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద మనుషులు అంటూ ఎవరూ లేరు. ఎవరికి వారే పెద్ద అని కామెంట్ చేశారు. అలాగే మా అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు విష్ణుతో మాట్లాడట కదా..? అని అడిగితే అలాంటిదేమీ చేయలేదు. ఒకవేళ చిరంజీవి తన కుటుంబ సభ్యులెవరైనా పోటీలో ఉండి, తను అడిగితే కచ్చితంగా విత్ డ్రా చేసుకొమ్మనేవాడిని అని అన్నారు. ఈమధ్య మీ స్నేహం చెడిందని వార్తలొస్తున్నాయంటున్నారని అడిగితే.. 'రాజకీయంగా.. సినీమా పరంగా నమ్మక ద్రోహం జరిగింది.. మనుషులు ఇలా కూడా ఉంటారా..? అని అనిపించింది' అని సమాధానం ఇచ్చారు.

గత కొన్నేళ్లుగా చిరు, మోహన్ బాబు కుటుంబాలు దూరంగా ఉంటాయని వచ్చిన వార్తలకు కొన్ని నెలల కిందట తెరదించారు. ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చారు. అంతేకాకుండా మోహన్ బాబు తాజాగా నటిస్తున్న 'సన్నాఫ్ ఇండియా' సినిమాలో చిరంజీవి వాయిస్ కూడా వినిపించారు. దీంతో వీరిద్దరు మళ్లీ ఒక్కటయ్యారని అనుకున్నారు. అయితే 'మా ' ఎన్నికల సందర్భంగా వీరి మధ్య మళ్లి చెడిందని అనిపిస్తోంది. మా అధ్యక్ష ఎన్నికల్లో మోహన్ బాబు కుమారుడు విష్ణు పోటీలో ఉండగా ప్రకాశ్ రాజ్ సైతం ఆయనకు పోటీనిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల తరువాత ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరూ ఎదురుచూస్తున్నారు.