Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌, సౌత్‌ సినిమాల మద్య ఉన్న లైన్ చెరిగి పోయినట్లేనా?

By:  Tupaki Desk   |   8 July 2021 8:30 AM GMT
బాలీవుడ్‌, సౌత్‌ సినిమాల మద్య ఉన్న లైన్ చెరిగి పోయినట్లేనా?
X
ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలకు సౌత్ సినిమాలకు చాలా తేడాలు ఉండేవి. కాస్టింగ్‌ నుండి మొదలుకుని బడ్జెట్‌ వరకు ఎన్నో రకాలుగా అంతరం ఉండేది. బాలీవుడ్ సినిమా అంటే దేశ వ్యాప్తంగా చూసే సినిమా అని ప్రాంతీయ భా సినిమా అంటే ఒక రాష్ట్రం వరకు చూసే సినిమా అనే అభిప్రాయం ఉండేది. కాని ఇప్పుడు ఆ అంతరం కనిపించడం లేదు. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో దుమ్ము రేపేలా కలెక్షన్స్ వసూళ్లు సాధిస్తున్నాయి. గతంలో కొన్ని సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా రోబో తో సౌత్‌ సినిమాల సందడి అక్కడ మొదలు అయ్యింది. బాహుబలి సినిమా తర్వాత సౌత్‌ సినిమాలు అంటే బాలీవుడ్‌ లో ఒక క్రేజ్ ఏర్పడింది. అందుకే బాహుబలి నుండి మొదలుకుని ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు సౌత్‌ నుండి బాలీవుడ్‌ వెళ్లి సక్సెస్‌ అవుతున్నాయి. కేవలం తెలుగు సినిమా లు మాత్రమే కాకుండా కన్నడ సినిమా కేజీఎఫ్‌ ఇంకా కొన్ని సినిమాలు కూడా భారీ విజయాలను ఉత్తరాదిన దక్కించుకున్నాయి.

ప్రస్తుతం సౌత్‌ లో రూపొందుతున్న సినిమాల్లో పెద్ద సినిమాలు అన్ని కూడా బాలీవుడ్‌ లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెల్సిందే. రాధే శ్యామ్‌ మొదలుకుని కేజీఎఫ్ 2 వరకు బాలీవుడ్‌ లో భారీ బిజినెస్ ను చేస్తున్నాయి. బాలీవుడ్‌ లో సౌత్ డబ్బింగ్ సినిమాలకు మరియు రీమేక్ సినిమా లకు ఉన్నంత క్రేజ్‌ హిందీలో రూపొందుతున్న సినిమాలకు కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు. కంటెంట్ తో పాటు మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉంటున్న కారణంగా సౌత్‌ సినిమా లను యూట్యూబ్‌ లో కూడా తెగ చూస్తున్నారు. బాలీవుడ్‌ లో రూపొందుతున్న సినిమాలతో సమానమైన క్రేజ్ ను సౌత్‌ భాషల్లో రూపొందుతున్న సినిమాలు కూడా దక్కించుకుంటూ ఉన్నాయి కనుక ప్రతి సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా చేసేందుకు మేకర్స్‌ మరియు స్టార్‌ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు.

బాలీవుడ్‌ హీరోల సినిమాలు సౌత్‌ లో ఒకటి రెండు మాత్రమే నడుస్తాయి. కాని సౌత్‌ లో రూపొందుతున్న సినిమాలు మాత్రం ఎక్కువ శాతం హిందీలో డబ్బింగ్ అయ్యి విడుదల అవుతున్నాయి. గతంలో హిందీ మరియు ప్రాంతీయ భాషల సినిమాలకు మద్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌ లో ప్రస్తుతం వరుసగా రూపొందుతున్న సినిమా లు అన్ని విడుదల అయితే ముందు ముందు బాలీవుడ్ సినిమాల కంటే కూడా ప్రేక్షకులు సౌత్‌ సినిమాల గురించి వెయిట్‌ చేసే రోజులు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ప్రభాస్ సినిమాలు మాత్రమే కాకుండా జక్కన్న సినిమాలు ఇతర హీరోల సినిమాలు కూడా ముందు ముందు బాలీవుడ్‌ లో వందల కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకోవడంతో పాటు ఖచ్చితంగా అక్కడ రికార్డుల వర్షం కురిపిస్తుందని అంటున్నారు. బాలీవుడ్ కు సౌత్‌ సినిమాలకు ఉన్న అంతరం ఇప్పటికే దాదాపుగా కనుమరుగు అయ్యింది. చిన్న సినిమాలు సహా ముందు ముందు హిందీలో కూడా డబ్‌ అవ్వడం మనం చూడబోతున్నాం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌ లను తీసుకోవడం వల్ల ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే పద్దతి ముందు ముందు కూడా కొనసాగాలని ఆశ వ్యక్తం చేస్తున్నారు.